మంగళగిరి, మార్చి 23: మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల జరుపుతున్న పాదయాత్ర శనివారం మంగళగిరి మండలంలోకి ప్రవేశించింది. నూతక్కి వద్ద షర్మిలకు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మున్నంగి గోపిరెడ్డి, బెజ్జం రాజాజీ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం షర్మిల నూతక్కిలో పాదయాత్ర జరిపారు. సెంటర్లోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. నూతక్కి, కొత్తపాలెంలో పాదయాత్ర జరిపారు. పార్టీ నాయకులు తోట శ్రీనివాసరావు, వంశీకృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలి
* ఆర్డీవోకు కోడెల వినతి
నరసరావుపేట, మార్చి 23: పట్టణంలో ఉన్న రెడ్డినగర్ ఓటర్లను రావిపాడు గ్రామ పంచాయతీలో చేర్చకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పి అరుణ్‌బాబును మాజీమంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావుకోరారు. శనివారం ఓట్ల చేర్పులు, మార్పులపై కోడెల ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని పల్లెల్లో ఓట్లు పట్టణంలోనూ, పట్టణంలోని ఓట్లు పల్లెల్లోనూ డబుల్ ఎంట్రీగా ఉన్నాయని తెలిపారు. తగిన అధారాలతో ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి, డబుల్ ఎంట్రీలను తొలిగించాలని కోరారు. 2013జనవరి ఓటర్ల జాబితాలో కొన్ని గ్రామాల్లోని 16ఏళ్ళ యువకులకు ఓటు హక్కును కల్పించారని, వాటిని తొలిగించాలని తెలిపారు. అర్హులైన వారికి ఓట్లు లేవని, నిరంతర ప్రక్రియ కింద దరఖాస్తులను తీసుకుని ఓటుహక్కును కల్పించాలని, దరఖాస్తులకు తగిన రశీదుఇవ్వాలని, విచారణకాలంలో నోటీసులు ఇవ్వాలని, నోటీసులో ఇచ్చిన సమయం ప్రకారం విచారణ జరపాలని కోరారు. పట్టణంలోని రెడ్డినగర్ ఓట్లను రావిపాడు గ్రామ పంచాయతీలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్డీవో దృష్టికి తెచ్చారు. రెడ్డినగర్‌కు రేషన్ దుకాణంలోని సరుకులు పట్టణం నుండే పంపిణీ అవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ నిరంతర ప్రక్రియ కింద ఓట్లను చేర్చుకుంటామని, 16ఏళ్ల పిల్లలకు ఉన్న ఓట్లను తొలిగిస్తామని, బోగస్ ఓట్లను ఏరివేస్తామని హామీ ఇచ్చారు. అయితే తగిన అధారాలతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో వేల్పుల సింహాద్రియాదవ్, కొల్లి ఆంజనేయులు, కడియంకోటి సుబ్బారావు, రావెళ్ళ లక్ష్మీనారాయణ, కడియాల రమేష్, కొల్లి వెంకటేశ్వర్లు, కల్యాణం రాంబాబు, దాసరి నరసింహారావు, కుంపటి రవి తదితరులు పాల్గొన్నారు.
ఎంపి నిధులతో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధి
* నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి
గుంటూరు, మార్చి 23: జిల్లాలో షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పార్లమెంటు నిధులు వెచ్చించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సిపిఒ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎంపి నిధుల వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపి మోదుగుల మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 12.30 కోట్ల రూపాయలు మంజూరు కాగా 9.80 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. పంచాయితీరాజ్‌కు సంబంధించి 317 పనులు మంజూరుకాగా 289 పనులు పూరె్తై 5.82 కోట్లు, అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం కింద 460 పనులు మంజూరు కాగా 333 పనులు పూరె్తై 2.60 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2012-13తో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో పాటు గత నాలుగు సంవత్సరాల కాలంలో వివిధ అభివృద్ధి పనులకు 794 పనులు మంజూరయ్యాయని, వీటిలో 460 పనులను 7.8 లక్షలతో పూర్తి చేశామని పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ఆర్‌ఒ ప్లాంట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు చేపట్టని పనులకు సంబంధించిన నిధులకు చెందిన వడ్డీ 27 లక్షల రూపాయలను పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అధ్యయనానికి అధికారులను, ఇంజనీర్లను పంపించేందుకు వినియోగించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను ప్రణాళిక శాఖ ద్వారా జిల్లా కలెక్టర్‌ను కోరనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త పనుల ప్రతిపాదనలను తయారు చేసి అందించాలన్నారు. జిల్లా ప్రజలకు ఉపయోగకరమైన పనులకే పార్లమెంటు నిధులు వినియోగించాలని ఆయన సూచించారు. సమావేశంలో ప్రణాళికాశాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమయ్యేందుకే సేవా కార్యక్రమాలు
* అర్బన్ ఎస్‌పి ఆకె రవికృష్ణ
గుంటూరు(పట్నంబజారు), మార్చి 23: ప్రజలతో మమేకయ్యేందుకే సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని అర్బన్ ఎస్‌పి ఆకె రవికృష్ణ చెప్పారు. శనివారం స్థానిక స్వర్ణ్భారతి నగర్‌లో గుంటూరు అర్బన్ పోలీసు ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని అర్బన్ ఎస్‌పి రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సౌత్‌జోన్ డిఎస్‌పి జోసఫ్‌రాజ్‌కుమార్ అధ్యక్షత వహించారు. వాసన్ ఐకేర్ నేత్ర వైద్యనిపుణులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 40 సంవ త్సరాలు దాటిన వారందరూ కంటి పరీక్షలు చేయంచుకోవాలని, షుగర్ వ్యాధి గ్రస్థులకు ఆ ప్రభావం కంటి రెటీనాపై పడుతుందని, వారు తప్పక నేత్రవైద్యులను సంప్రదించాలని అన్నారు. వైద్య శిబిరంలో సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిఐ మోజేస్‌పాల్, వాసన్ ఐ కేర్ సిబ్బంది కోటేశ్వరరావు, మహేష్, హెడ్‌కానిస్టేబుల్ సీతారామయ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు
* గోవింద నామ స్మరణతో మార్మోగిన బృందావన వెంకన్న సన్నిధి
గుంటూరు (కల్చరల్), మార్చి 23: ఉదయగానం, పుణ్యాహవచనం, అగ్నిధ్యానం, నిత్యహోమాలతో బృందావన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం యజ్ఞస్థలిలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజవాహనంపై శ్రీదేవి, భూదేవీ సమేతుడైన వెంకటేశ్వరస్వామి నయన మనోహరంగా భక్తజనానికి దర్శనమిచ్చారు. ఉత్సవాలను పురస్కరించుకుని అన్నమయ్య కళావేదికపై ఏర్పాటు చేసిన సత్సంఘ గోష్టిలో విద్యా స్వరూపానందగిరి స్వామి, శివకల్యాణానంద భారతీస్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట కృష్ణారెడ్డి, పారిశ్రామిక వేత్త కళ్ళం హరనాధరెడ్డి, కాట్రగడ్డ లక్ష్మీనరసింహారావు, పండితుడు మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి తదితరులు బృందావన వెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి 365 రోజులూ చేస్తున్న ధార్మిక సేవలను ప్రస్తావించి, ఇదేరీతిన భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ ఆధ్యాత్మిక సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా భక్తులు, వివిధ భజన బృందాలు చేసిన గోవిందనామ స్మరణతో వెంకన్న దేవాలయం మార్మోగింది.
సెమీఫైనల్స్‌కు చేరిన రాష్టస్థ్రాయి స్నూకర్ పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), మార్చి 23: ఎల్‌విఆర్ అండ్ సన్స్‌క్లబ్ రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్టస్థ్రాయి బిలియర్డ్స్, స్నూకర్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పి పవన్‌కుమార్ (వరంగల్), ఎ అరవింద్‌కుమార్ (ఎపిబిఎస్‌ఎ), ఐవి రాజీవ్ (కాకినాడ), స్వామి (కాకినాడ) క్వార్టర్ ఫైనల్స్‌లో విజేతలై సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పవన్‌కుమార్ 56-62, 57-09, 69-48, 70-28, 27-56, 46-11 స్కోర్లతో ఈ పాండురంగారావు (నెల్లూరు)పై గెలుపొందగా, రెండవ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎ అరవింద్‌కుమార్ 23-63, 63-22, 68-24, 62-66, 64-18, 64-53 స్కోర్లతో డి అరవింద్ (హైదరాబాద్)పై గెలుపొందారు. మూడవ క్వార్టర్ ఫైనల్స్‌లో ఐవి రాజీవ్ 61-18, 53-14, 66-27, 68-49 స్కోర్లతో జేమ్స్ సుందరరాజ్ (హైదరాబాద్)పై గెలుపొందగా, నాల్గవ క్వార్టర్ ఫైనల్స్‌లో స్వామి 66-34, 39-54, 60-50, 38-55, 73-39, 60-01 స్కోర్లతో ఖైజర్ రవూఫ్ (ఎపిబిఎస్‌ఎ)పై గెలుపొందారు. అంతకముందు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో పాండురంగారావు 3-0 ఫ్రేములతో ఎస్ శంకర్‌పై, అరవింద్‌కుమార్ 3-0తో అబ్దుల్ జుబేర్‌పై, బి అరవింద్ 3-0తో హేమంత్‌సింగ్ ఠాగూర్‌పై, జేమ్స్ సుందరరాజు 3-1తో వి చంద్రశేఖర్‌పై, పవన్‌కుమార్ 3-1తో అసుతోష్‌పై, స్వామి 3-2తో పరమేష్‌రెడ్డిపై, రాజీవ్ 3-0తో నరేష్‌పై, ఖైజర్ రవూఫ్ 3-1 ఫ్రేములతో పి సుధాకర్‌పై గెలుపొందారు. ఆదివారం మ్యాచ్‌లలో బ్రిలియర్డ్స్ ఫైనల్ పోటీలు జరుగుతాయని నిర్వాహక కార్యదర్శి వట్టికూటి బాలజీ ప్రసాద్ పేర్కొన్నారు.
కీమేన్ అప్రమత్తతతో తప్పిన రైలుప్రమాదం
భట్టిప్రోలు, మార్చి 23: రైల్వే కీమెన్ అప్రమత్తతతో శనివారం ఉదయం భట్టిప్రోలు- పల్లెకోన స్టేషన్ల మధ్య రైలుప్రమాదం తప్పింది. మండలంలోని పల్లెకోన స్టేషన్ నుండి భట్టిప్రోలు స్టేషన్ వైపుకు ఉదయం 7గంటలకు రైల్వేలైన్ పరిశీలనకు కీమెన్ డి జాన్‌పాల్ బయలుదేరాడు. మార్గమధ్యంలో 25/6-7 మైలురాయి వద్దకురాగానే రైలుపట్టా విరిగి యుండటాన్ని గుర్తించాడు. అదే సమయం లో 123నెంబర్ రైలు తెనాలి నుండి రేపల్లె వైపుకు వచ్చేసమయం దగ్గర పడటంతో ఆందోళన పడ్డ కీమెన్ ప్రమాదం సూచికకు 300మీటర్ల దూరంలోఉన్న రైలుగేటు వద్దకు చేరుకొని తనవద్దనున్న ఎర్ర జెండాను డ్రైవర్‌కు చూపి రైలును నిలిపివేశాడు. విషయాన్ని రైలుడ్రైవర్‌కు తెలియజేశాడు. దీంతో సంఘటన స్థలం వరకు రైలును నెమ్మదిగా నడిపిన డ్రైవర్ పట్టాల మరమ్మతులు చేసిన తరువాతే ముందుకు నడుపుతానని తెలిపారు. దీంతో కీమెన్ అవసరమైన పరికరాలు తీసుకువచ్చి పట్టాలు సరిచేయటంతో రైలు బయలుదేరింది. విషయం తెలుసుకున్న ప్రయాణీకులు కీమెన్ ప్రమాదం గుర్తించకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని ఆందోళన చెందారు. అయితే ఈరైలు మార్గం ఆధునీకరణ పనులు ఇటీవల నిర్వహించిన అధికారులు సంఘటన స్థలం వరకు కొనసాగించి నిలిపివేయటంతో ఈదుర్గటన జరగటానికి కారణమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.