మదనపల్లె, మార్చి 23: తంబళ్ళపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జి శంకర్‌యాదవ్‌ను కనుమరుగు చేసే యోచనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. 2009లో కాంగ్రెస్ టికెట్ శంకర్‌కు కేటాయించడంతో విభేదించి పార్టీని వీడిన సిఎం మేనమామ, మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డిని చేరదీశారు. ఇందుకు తంబళ్ళపల్లె కాంగ్రెస్‌కు ఇన్‌చార్జ్‌గా ఇచ్చేందుకు సైతం నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీలో మరోసారి గందరగోళం నెలకొంది. 1989లో తంబళ్ళపల్లె ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, పిఆర్‌పి అభ్యర్థిగా 2009లో ఓటమిచెందడం, నాలుగుమాసాలు వైఎస్సార్‌సిపిలో ఉంటూ అందులో నెలకొన్న విభేదాల కారణంగా నాలుగు మాసాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి తన జీవితమంతా కాంగ్రెస్‌లో కొనసాగారు. బెంగళూరు, ముంబయి, చెన్నై ప్రాంతాలలో భూముల వ్యాపారం చేసుకునే జి శంకర్‌ను 2009లో తంబళ్ళపల్లెకు బిసి అభ్యర్థిగా బరిలోకి తీసుకువచ్చారు. ఓటమితో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాల్సిన శంకర్ బెంగళూరులో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నియోజకవర్గానికి దూరమయ్యారు. స్థానిక రాజకీయాలలో క్రియాశీలకంగా పోయారు. దీంతో నాయకులు, కార్యకర్తలు తమ గోడుపట్టించుకునే వారు కనుమరుగయ్యారని సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. సిఎం సోదరులు కిశోర్‌కుమార్‌రెడ్డి తంబళ్ళపల్లె నియోజకవర్గ రాజకీయాలలో క్రియాశీలకంగా చేసే సిపి సుబ్బిరెడ్డిని నియమించే యత్నంలో మంత్రి రఘువీరారెడ్డి అడ్డుతగలడంతో విఫలమైంది. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో మేనమామ మాజీ ఎమ్మెల్యే కలిచెర్లను దగ్గరకు చేసుకోవాలని ముఖ్యమంత్రి నల్లారి నిర్ణయిస్తూ జరిగిన సహకార ఎన్నికలలో కలిచెర్ల కుటుంబాన్ని కలుసుకునేందుకు సోదరులు కిషోర్‌ను అనేకమార్లు పంపారు. దీంతో ఈనెల 18న మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల రాజధాని సచివాలయంలో సిఎంను కలుసుకున్నారు. తనకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇస్తేపార్టీలోకి వస్తానని షరతు విధించడం, ఇందుకు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా కలిచెర్ల ఉంటే మంచిదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సరే అనడం, మరుసటి రోజు మదనపల్లెలోని కలిచెర్ల ఇంటిలో సిఎం సోదరులు కిషోర్‌కుమార్‌రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదిలావుండగా కాంగ్రెస్‌లో కలిచెర్ల, శంకర్‌లు కలిసుండే అవకాశాలు లేవు. ఇంతకాలం కాంగ్రెస్‌లో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నమ్ముకుని ఉన్న శంకర్ తననే పార్టీకి దూరంగా పెడుతున్నారన్న అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఏ వైపు తిప్పుకుంటారో నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
నేటి నుండి సూర్యపూజా మహోత్సవం
* ముస్తాబైన నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయం
నాగలాపురం, మార్చి 23 : నాగలాపురంలోని శ్రీవేదవల్లి సమేత శ్రీవేదనారాయణస్వామి ఆలయంలో ఆదివారం నుండి ఈనెల 25వతేది వరకూ వార్షిక సూర్యపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఉదయభానుని కిరణాలు నేరుగా ఆలయంలోని వేద నారాయణస్వామి మూలవిరాట్టుపై ప్రసరిస్తాయి. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇందుకు సంబంధించి టిటిడి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారి పాదాలపైన, రెండవ రోజు నాభిపైన, మూడవరోజు శిరస్సుపై ఈ సూర్యకిరణాలు ప్రచురించి స్వామివారి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేయనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకూ స్వామిపూజా మహోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుండి 8 గంటల వరకూ తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 26వతేది నుండి 28వతేదివరకూ సాయంత్రం 6.30 గంటల నుండి గంటపాటు తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తొలిరోజున సీతా సమేత శ్రీకోదండరామస్వామి, రెండు, మూడు రోజుల్లో వేదవల్లీ సమేత వేదనారాయణస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 27న స్వామివారు ముత్యపుపందిరివాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. 28న తెప్పోత్సవం ముగిసిన తరువాత స్వామి, అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఘనంగా ఏర్పాట్లు
నాగలాపురంలోని శ్రీవేదవల్లి సమేత వేదనారాయణస్వామి ఆలయంలో సూర్యపూజోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా పుష్పాలంకరణలు చేశారు. ప్రతి యేడాదిలాగే ఈ యేడాది కూడా ప్రత్యేకంగా 250 కేజిల పుష్పాలతో, విద్యుత్‌దీపాల అలంకరణలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. మూడురోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం ప్రాంతంలో సూర్యకిరణాలు శ్రీవేదనారాయణస్వామివారి పాదాలను కొద్దికొద్దిగా తాకాయి. ఈ కిరణాలు ఆదివారం పాదాలు, సోమ,మంగళవారాల్లో నాభి, శిరస్సును తాకనున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో ఆ రాష్ట్రం నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలిరానున్నారు. ఈనేపద్యంలో టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 30 మంది టిటిడి సెక్యూరిటి సిబ్బంది, 50 మంది పొలీసు సిబ్బంది, 4మంది సినీయర్ అసిస్టెంట్లు, 6 మంది జూనియర్ అసిస్టెంట్లు ఇతర టిటిడి సిబ్బంది విధులకు కేటాయించారు. అలాగే టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుకు సంబంధించిన 30 మంది కళాకారుల బృందం ఇక్కడ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
ఎవ్వరి కోసం ...రెవెన్యూ సదస్సులు
* తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని సిపిఎం విమర్శ
తిరుపతి,మార్చి 23: ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధిలేని ప్రభుత్వం తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఈ సదస్సు ఎవ్వరి కోసమని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యులు వందవాసి నాగరాజులు విమర్శించారు. శనివారం అమ్మచెరువు గ్రామంలో ఆర్‌డిఓ వై రామచంద్రారెడ్డి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు జరిగింది. ఎక్కడ సదస్సులు నిర్వహిస్తారో అక్కడికి సంబంధించి అన్ని రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రికార్డులను తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు గట్టిగా సూచనలు ఇచ్చిందన్నారు. అయితే అమ్మచెరువు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆర్‌ఐ, సర్వేయర్, విఆర్‌ఓలు మాత్రమే హాజరైయ్యారు కాని రికార్డులు తీసుకురాలేదని ఆరోపించారు. దీనిపై ఆర్‌డిఓ రామచంద్రారెడ్డి కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి సంబంధించిన గుంటలు, కాలువలు, దారులకు సంబందించిన ఒక్క రికార్డును కూడా అధికారులు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను పర్యవేక్షించడంలో రెవెన్యూ అధికారులు ఘోరవైఫల్యం చెందారన్నారు. సర్వేనెంబర్ 9,10,11లలోని ప్రభుత్వానికి చెందిన 6 ఎకరాల 56 సెంట్ల భూమిని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్సా రమేష్, బల్సా చంద్రశేఖర్ కబ్జా చేసినా పట్టించుకునే నాథుడే లేరన్నారు. వారు మామిడి చెట్లు పెట్టుకుని ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నా అధికారులు దాన్ని చూసీచూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గతంలో వీరు దళితులకు చెందిన ఇళ్ల స్థలాల భూములను, శ్మశానాలను ఆక్రమించుకున్నారన్నారు. అప్పుడు సిపిఎం పోరాటం చేసినా అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. పేదలకు భూములు పంచకపోవడంతోనే వలసలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికి 33 మంది నిరుపేదలు భూములు ఇవ్వాలని ధరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ గ్రామంలో 157 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి వున్నా ఒక్కరికి కూడా భూమి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అడిగితే అటవీశాఖ అధికారులపై నెపం మోపుతున్నారన్నారు. ఈ గ్రామంలో జరుగుతున్న భూ అక్రమాలపై తాము ఆర్‌డిఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అందుకు ఆర్‌డిఓ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుని అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నింటిని తానే స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ సదస్సులు పూర్తి అయిన తరువాత తిరిగి ఈ గ్రామంలో సదస్సులను నిర్వహిస్తామన్నారు. అర్హులైన గ్రామస్థులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలపై అన్నీ భారాలే
* 31,517 కోట్ల విద్యుత్ భారం
* టిడిపి రాష్ట్ర కార్యదర్శి నరసింహాయాదవ్
తిరుపతి,మార్చి 23: ఎన్నికల ముందు ఎటువంటి భారం మోపమని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన 9 ఏళ్ల పాలనలో అన్ని రకాల భారాలు మోపుతూ ప్రజల నడ్డివిరిచిందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి జి నరసింహాయాదవ్ విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ప్రజలపై భారం మోపమని చెప్పిన నాయకులు నేడు మాట తప్పి పేద, సామాన్య ప్రజలు కోలుకోలేని విధంగా ప్రజలపై భారం మోపారన్నారు. 2010-11లో 920 కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. 2011-12 ఏడాదిలో 1000 కోట్ల భారం మోపిందన్నారు. 2012-13లో 4,950 కోట్ల రూపాయల భారంతో మొత్తం 6,870 కోట్ల రూపాయల భారం మోపిందన్నారు. 2013-14 యేడాదికి పెంచే విద్యుత్ చార్జీలు 12,723 కోట్ల రూపాయలను సిద్ధం చేస్తుందన్నారు. ఇక ఇంధన సర్దుబాటు పేరుతో వినియోగదారులకు సంబంధం లేని చార్జీలను 11,924 కోట్ల రూపాయలు విధించారన్నారు. ఇందులో ఇప్పటికే 7771 కోట్ల రూపాయలను ఇప్పటికే వసూలు చేశారన్నారు. అన్ని చార్జీలను కలిపి గత 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 31,517 కోట్ల రూపాయల భారాన్ని మోపిందన్నారు. విద్యుత్‌ను సక్రమంగా పంపిణీ చేయకుండా విద్యుత్ కోతలను విధిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అధికారంలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదన్నారు. ఈ సమావేశంలో టిపిడి బిసి సెల్ జిల్లా ఉపాద్యక్షులు గోవిందకృష్ణయ్య, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మైనం బాలాజి,జిల్లా టిడిపి ప్రచార కార్యదర్శి దేవా, నగర పార్టీ ఉపాధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు.
జగన్‌ను విడుదల చేయాలని
వైఎస్‌ఆర్‌సిపి నేతల వౌన ప్రదర్శన
చిత్తూరు, మార్చి 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని జైలు నుండి విడుదల చేయాలంటూ చిత్తూరు పట్టణంలో ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రిదేవి ఆధ్వర్యంలో మహిళలు వౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద గాయత్రిదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో జన నేతగా ఎదుగుతున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడైన జగన్ ఎదుగుదలను ఓర్వలేకనే కాంగ్రెస్‌పార్టీ ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టించిందన్నారు. సిబిఐ కాంగ్రెస్‌పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నదని ఆమె ధ్వజమెత్తారు. 300రోజులు ఒక నాయకున్ని జైలులో పెట్టడం ఏమిటని కోర్టులే ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి చీమకుట్టినట్లైనా లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌పార్టీకి ఎదురు తిరిగిన వారిపై ఎలాంటి దాడులు చేస్తారో అన్నదానికి ఉదాహరణే రెండు రోజుల క్రితం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఇంటిపై జరిగిన సిబిఐ సోదాలు అన్నారు. జగన్‌పై పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులని తేలి త్వరలో ఆయన విడుదలై బయటకు రావడం తథ్యమన్నారు. ప్రజలు తమ పార్టీ వైపే ఉన్నారని, తమ నాయకుడు జైలులో ఉన్నా ఆయన సందేశంతోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తాము విజయం సాధిస్తామన్నారు. ఓట్లతో కాంగ్రెస్‌పార్టీకి ప్రజలు బుద్ధిచెప్పి వైఎస్‌ఆర్‌సిపిని గెలిపించే రోజులు దగ్గరపడ్డాయని గాయత్రిదేవి పేర్కొన్నారు. ఈ వౌన ప్రదర్శనలో పలువురు మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు పాల్గొన్నారు.
25న రాజీవ్ యువ కిరణాల జాబ్‌మేళా
చిత్తూరు, మార్చి 23: రాజీవ్ యువకిరణాలు పథకం డైరెక్టు ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు చిత్తూరులోని కొత్త కలెక్టరేట్ ఆఫీసు సమీపంలోని టిటిడిసి భవనంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు, అలాగే ఐటిఐ, యంబిఎ, ఫార్మసీ చదివిన నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందవచ్చన్నారు. ఈ జాబ్‌మేళాలో యునివర్శల్ సెల్ కంపెనీ, ఐడియా కంపెనీ (ఆరెంజ్), బిగ్‌సి సెల్‌ఫోన్స్ కంపెనీ, అపోలో ఫార్మసీ, అమర్‌రాజా బ్యాటరీస్ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఫార్మసిస్టులు, సెక్యురిటి గార్డులు, డ్రైవర్లు, కుక్, మెషిన్ ఆపరేటర్స్, హెల్పర్లు, సేల్స్‌మెన్, టైలర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ తదితర ఉద్యోగాలకు ఆసక్తిగల నిరుద్యోగులు బయోడేటా, రేషన్‌కార్డు, సర్ట్ఫికెట్ల జెరాక్సు కాపీలతో హాజరుకావాలని ఆయన తెలిపారు.
నేడు గోవా గవర్నర్ జిల్లా పర్యటన
చిత్తూరు, మార్చి 23: గోవా గవర్నర్ భారత్‌విర్‌వాస్‌చో ఈనెల 24, 25వ తేదీల్లో చిత్తూరుజిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ 24వ తేదీ సాయంత్రం 6.25గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని నేరుగా తిరుచానూరు వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని అనంతరం తిరుమలకు చేరుకొని బస చేస్తారు. 25న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఉదయం 9.25 గంటలకు తిరుమల నుండి బయలుదేరి 10గంటల నుండి 11గంటల వరకు జరుగు వెంకటేశ్వరా వేదిక్ యూనివర్శిటీ, తిరుపతిలో విద్యార్థులతో సంభాషణ అనంతరం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో కొద్దిసేపు విరామం తీసుకుంటారు. అనంతరం 1.30నిమిషాలకు తిరుపతి నుండి బయలుదేరి హైదరాబాదు వెళ్తారని కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆ ప్రకటనలో తెలిపారు.
రెండవ రోజు పరీక్షకు 591 మంది గైర్హాజరు
* ఇన్విజిలేటర్ తొలగింపు
చిత్తూరు, మార్చి 23: జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో భాగంగా రెండవ రోజైన శనివారం 591మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నారాయణవనం పాఠశాలలోని ఇన్విజిలేటర్‌ను విధుల నుండి తొలగించినట్లు డిఇఓ పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే ఎవరిపైనైనా వేటు తప్పదని ఈ సందర్భంగా డిఇఓ హెచ్చరించారు.
‘్ధమపానం, మద్యపానం మానితే టిబి దూరం
* శే్వత సంచాలకులు డాక్టర్ రామకృష్ణ స్పష్టం
తిరుపతి,మార్చి 23: తితిదేలో శే్వత ఉద్యోగులనుద్దేశించి ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా శే్వత సంచాలకులు డాక్టర్ కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ టిబి వ్యాధి మైక్రోబాక్టీరియం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. ఇది అంటువ్యాధి అయినప్పటికీ దానిని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. మన భారతదేశంలో 40 శాతం టిబి వ్యాధిగ్రస్తులున్నారని ప్రపంచం మొత్తంలో 8.7 మిలియన్లలో భారతదేశంలోనే 2011కు 3.1మిలియన్ క్షయవ్యాధిగ్రస్తులున్నారని తెలిపారు. టిబి, హెచ్‌ఐవి రెండు కలిస్తే చాలా అపాయం, చెడు వ్యసనాలు మాని హిందూ ధర్మ ఆరోగ్యసూత్రాలు, పాటించడం ద్వారా ఈ వ్యాధిని నిరోధించవచ్చని చెప్పారు. పొగతాగేవారిలో రోగనిరోధక శక్తి చక్కగా వున్నంతవరకు ఈ వ్యాధి సోకదని, రోగనిరోధక శక్తి తగ్గిన వెంటనే ఈ బాక్టీరియా శరీరంలో బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ మునిశంకర్, హేమచంద్ర. శే్వత పర్యవేక్షకులు మునస్వామినాయుడు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.