Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దుష్ట శిక్షణకే నృసింహావతారం

$
0
0

కమలాపురం, మార్చి 23 : దుష్ట శిక్షణకే మహావిష్ణువు నృసింహుని అవతారం ఎత్తారని, తద్వారా మానవ సమాజానికి, భక్తుల కోసం ఎక్కడైనా ఉంటానని తెలియజేశారని శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామీజీ పేర్కొన్నారు. శనివారం స్థానిక మాచిరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మానవ కల్యాణం కోసం మహా విష్ణువు దశావతారాలు ఎత్తారన్నారు. ఇందులో ప్రధానంగా కృతయుగంలో తన కుమారుడైన ప్రహ్లాదున్ని అనునిత్యం నారాయణ జపం కాకుండా తన నామస్మరణ చేయాలని హింసించేవాడన్నారు. అలాంటి సమయంలో భక్తుడు ఎప్పుడు కోరితే అప్పుడు ‘ఇందుగలడు అందు లేడని’ నిరూపించేందుకు స్తంభంలో నుంచి నృసింహావతారంలో బయటకు వచ్చి దుష్టసంహరణ చేశారన్నారు. మానవులు భగవంతున్ని ఎంతగా ఆరాధిస్తారో, అంతగా దేవుడు కూడా తోడుగా ఉండి కష్టాలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించి సిరిసంపదలు కలుగజేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ తోటి మానవుని ప్రేమించాలని అభిలషించారు. మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ తాను శృంగేరిలో పీఠాధిపతిని దర్శించుకున్న సమయంలో కడపకు వచ్చినపుడు తన స్వగ్రామం మాచిరెడ్డిపల్లెకు రావాలని కోరిన కోరిక మేరకు స్వామివారు ఆలయాన్ని దర్శించారన్నారు. అది తనతోపాటు ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఈ సందర్భంగా స్వామికి మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి దంపతులు, పెద్ద చెప్పల్లి సొసైటీ అధ్యక్షుడు సాయినాథశర్మ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం నేతలు గోవర్ధన్‌రెడ్డి, సుభాన్‌భాషా, దివాకర్‌రెడ్డి, రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి ఖాదరభాషా, మల్లికార్జునగుప్తా, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం చర్యలు చేపట్టండి
* కలెక్టర్ కోన శశిధర్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 23 : నగరంలో పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ స్పెషలాఫీసర్ ఛాంబరులో శానిటేషన్, రోడ్డు, వీధిలైట్లు, తాగునీరు అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజలు రోడ్లపై చెత్త చెదారం వేస్తున్నారని, దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా, ప్రస్తుతం 11 ట్రాక్టర్లు, 9 టిప్పర్లు, 24 ఆటోలు, పుష్‌కార్ట్స్ 89కు 30 ద్వారా ఇళ్లలో చెత్తచెదారం సేకరించి డపింగ్ యార్టుకు తరలిస్తున్నామ వివరించారు. అలాగే ఒక పుష్‌కార్ట్ ద్వారా 500 ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నామన్నారు. కౌన్సిల్‌లో చేసిన తీర్మానం ప్రకారం ఒక్క ఇంటి నుండి నెలకు రూ.20లు వసూలు చేస్తున్నారని కమిషనర్ వివరించారు. ఇందుకు కలెక్టర్ మాట్లాడుతూ ఒక పుష్‌కార్ట్స్‌కు వేరు, వేరు కలర్ ఉండాలన్నారు. వీధుల్లో మొదట, ఆఖరు పాయింట్లలో మైక్రో శానిటేషన్ ప్లాన్ ఉండాలన్నారు. చెత్త, చెదారం సేకరించేందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అవుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వాహనాలు పదే పదే తిరగడం వల్ల అదా ఉండదని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం శానిటేషన్ చేయాలన్నారు. రోడ్లపై చెత్తచెదారం వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నగర పాలక సంస్థలో ఎంత మంది రెగ్యులర్ వర్కర్లున్నారని, వారికి ఏం ఇస్తున్నారో వివరాలు అందజేయాలన్నారు. నగరంలో సిసి రోడ్డు, వీధిలైట్లు మంజూరైన పనులు, పూర్తయిన పనులు తప్ప మిగిలిన పనులకు కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి నివేదికను వెంటనే అందజేయాలన్నారు. డ్రైనేజీ కాలువ పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్యల ఉందా అని అడుగ్గా 38 ప్రాంతాల్లో ఉందని వివరించారు. ఇందుకు కలెక్టర్ మాట్లాడుతూ ఆ కాలనీల్లోని ఎంత మంది జనాబా ఉన్నారు, బోర్లు ఉన్నాయి, వ్యవసాయబోర్లు ఉన్నాయి, ట్యాంకర్ల ద్వారా ఏ సమయలో నీటి సరఫరా చేస్తున్నారో వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించే అశ్లీల పోస్టర్లను థియేటర్ యాజమాన్యంతో చర్చించి తొలగించాలని గతంలో చెప్పానని అయితే తిరిగి అక్కడక్కడ కనపడుతున్నాయన్నారు. వాటిని తక్షణమే తొలగించి సంబంధిత థియేటరకు నీటి సరఫరాను నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ జాన్‌శ్యాంసన్ , ఇఇ జాదేవ్, డిఇలు నాగానందయ్య, దౌలా, చెన్నకేశవరెడ్డి, ఆరోగ్య అధికాకిరి డాక్టర్ వినోద్‌కుమార్, ఎఇఇలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

వన్య ప్రాణుల రక్షణకు చర్యలు
* కలివికోడిని కనుగొనేందుకు 80 లక్షల నిధులు : ఎపిసిసి డబ్ల్యు ఎవి జోసఫ్
కడప (క్రైం), మార్చి 23 : వన్య ప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్వీజిలేటరు ఆఫ్ వైల్డ్ లైఫ్ అధికారి ఎవి. జోసఫ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక డివిజనల్ ఫారెస్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని లంకమల్లేశ్వర అడవుల్లో కలివికోడి ఉందని, ఇవి అంతరించి పోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీంతో కేంద్ర అటవీ శాఖ అధికారి జయంతి నటరాజన్ ఢిల్లీ అధికారులతో చర్చించి 2013-14 సంవత్సరం మొట్టమొదట అనంతపురం, గోదావరి, భద్రాచలం ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా కలివికోడి ఎక్కడెక్కడ సంచరిస్తుందో కనుగోనేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని రెడ్డిపల్లె, అట్లూరు, సిద్దవటం అటవీ ప్రాంతాల్లోని లంకమల్లేశ్వర అడవుల్లో ఉందని, దీన్ని కనుగొనేందుకు వచ్చే 80 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కలివికోడి కనుగోనేందుకు లంకమల్లేశ్వర అడవుల్లో 20 లక్షల వరకు నిధులు వెచ్చించామన్నారు. దీన్ని సంరక్షించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలివికోడిని కనుగోనేందుకు 100 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క కెమెరా 400 చదరపు మీటర్లు దూరంతో నిరంతరం ఫొటోలు తీస్తుందన్నారు. దీనికి టిటిడి మద్దతు కూడా ఉందన్నారు. అలాగే కృష్ణజింకలు అంతరించిపోకుండా ఉండేందుకు నీటి వసతితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల కోడూరు ప్రాంతంలో చనిపోయిన ఎనుగు అనారోగ్య కారణాల వల్లే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందన్నారు. సోమశిల ప్రాజెక్టు ప్రాంతంలోని అడవుల్లో 31 లక్షల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సిద్దవటం, బద్వేలు రహదారిలో గత నాలుగు నెలల కాలంలో పలు జంతువులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయని, అందువల్లే రాత్రి 9 నుండి ఉదయం 6 వరకు వాహనాలను నిషేధించినట్లు తెలిపారు. అలాగే కొండూరు తోపులో సిసి కెమెరాల ప్రణాళికకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కన్విజరేషన్ ఆఫ్ ఫారెస్టు అధికారి శాంతి ప్రియాపాండే, కడప డివిజనల్ ఫారెస్టు అధికారి బి. ఎన్. ఎన్. మూర్తి, కలివికోడి రిసర్చ్ అధికారి జగన్ తదితరులు పాల్గొన్నారు.

భారీగా పోలీసుల బదిలీ
* 17 మంది ఎస్సైలు, ఆరుగురు ఎఎస్‌ఐలు, 34 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు స్థాన చలనం
కడప (క్రైం), మార్చి 23 : జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 17 మంది ఎస్సైలు, ఆరుగురు ఎఎస్‌ఐలు, 34 మంది హెడ్‌కానిస్టేబుళ్లను బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.హేమసాగర్‌ను వేముల నుంచి వల్లూరుకు, ఎం.మధుసూదన్‌రెడ్డిని వల్లూరు నుంచి వీరబల్లెకు, మొయినుద్దీన్‌ను వీరబల్లె నుంచి వేములకు, సోమశేఖర్‌ను ప్రొద్దుటూరు పిసిఆర్ నుంచి కలసపాడుకు, కె.రాజారెడ్డి కలసపాడు నుంచి సంబేపల్లెకు, పి.నాగన్నను కడప విఆర్ నుంచి కడప సిసిఎస్‌కు, మహమ్మద్ నూర్‌ను విఆర్ కడప నుంచి జమ్మలమడుగు అర్బన్‌కు, ఎం.బాలకృష్ణను కడప నుంచి తాలూకాకు, ఎం.రామచంద్రను కడప నుంచి కోడూరుకు, టి.రామకృష్ణను మైదుకూరు అర్బన్ నుంచి ఉమెన్ కడపకు, చాంద్‌బాషాను కడప ఉమెన్ నుంచి రిమ్స్‌కు, టి. రంగనాయకులును సిసిఎస్ నుంచి వన్‌టౌన్‌కు, మహమ్మద్ అలీని చిన్నచౌక్ నుంచి టుటౌన్‌కు, టి.నరసింహులును కడప సిసిహెచ్ నుంచి చిన్నచౌక్‌కు, జి.మధుసూదన్‌రెడ్డిని, విఆర్ కడప నుంచి, మైదుకూరు అర్బన్‌కు, మస్తాన్ బాషాను మైదుకూరు అర్బన్ నుంచి చిన్నచౌక్‌కు, టి.ఈశ్వర్‌రెడ్డిని విఆర్ కడప నుంచి, సిసిఎస్ కడపకు బదిలీ చేశారు. వీరితో పాటు ఆరుగురు ఎఎస్సైలను, 34 హెడ్ కానిస్టేబుళ్లు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.

వోల్వో బస్సు - లారీ ఢీ
ఇద్దరి మృతి
మైదుకూరు, మార్చి 23: మైదుకూరు సమీపంలోని సరస్వతీపేట వద్ద బైపాస్ క్రాస్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ వొల్వా బస్సు, లారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు సహాయక డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో అతని పరిస్థితివిషమంగా మారింది. బస్సు ప్రయాణికుల్లో కొందరికి స్వల్పగాయాలతో బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన ప్రైవేట్ వొల్వా బస్సు రేణిగుంట్ల నుంచి హర్యానాకు బ్యాక్టీరియాలోడ్‌తో బయలుదేరిన లారీ సరస్వతీ పేట బైపాస్ రోడ్డు పైన శనివారం తెల్లవారుజామున ఎదురెదురుగా అదుపుతప్పి ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్ వీరబాబు (48) , లారీ డ్రైవర్ అజ్మీర్ (35) సంఘటనాస్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు సహాయక డ్రైవర్ రమేష్‌కు తీవ్రగాయాలు కావడంతో అతనికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతి చెందిన లారీ డ్రైవర్ అజ్మీర్‌ది హర్యానా రాష్ట్రం సొనిపట్ ప్రాంతంగా బస్సు డ్రైవర్ వీరబాబుది విజయవాడ సమీపంలోని కానూరు ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక సరస్వతీ పేటకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అర్బన్ సిఐ రామచంద్ర తన సిబ్బందితో హుటాహుటీన సంఘటనా స్థలానికి వెళ్ళి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయమై మృతుల బంధువులకు పోలీసులు సమాచారం చేరవేశారు.

వైవియూలో కొనసాగుతున్న
బోధనేతర సిబ్బంది ఆందోళన
* స్తంభించిన పాలనా వ్యవస్థ * విద్యార్థులపై కేసులు ఎత్తివేత
కడప, మార్చి 23 : వైవియూలో బోధనేతర సిబ్బంది చేస్తున్న ఆందోళన శనివారం కూడా కొనసాగింది. దీంతో పాలనావ్యవస్థ స్థంభించిది. ఉదయం 8 గంటల నుంచే బోధనేతర సిబ్బంది వైవియూ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. మరోవైపు అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న దీక్షల వద్దకు వైవియూ ఓఎస్‌డి ధనుంజయనాయుడు, రెక్టార్ వలిబాషా, ప్రిన్సిపాల్ వాసంతి వచ్చి చర్చించి కేసులు ఎత్తివేస్తామని హామీ ఇవ్వడంతో దీక్షలు విరమించారు. బోధనేతర సిబ్బంది మాత్రం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈసందర్భంగా దీక్షలు చేస్తున్న బోధనేతర సిబ్బంది దగ్గరకు వైవియూ అధ్యాపకులు ఈశ్వర్‌రెడ్డి, గోవర్ధన్‌నాయుడు, మరి కొందరు అధ్యాపకులు దీక్షల్లో కూర్చొని సిబ్బందికి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు 63 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు. మరోసారి ఓఎస్‌డి ధనుంజయనాయుడు, ప్రిన్సిపాల్ వాసంతి నిరసన దీక్ష చేస్తున్న బోధనేతర సిబ్బందితో చర్చలు జరిపారు. అయినప్పటికీ బోధనేతర సిబ్బంది ఆందోళన విరమించలేదు. ఈ సందర్భంగా బోధనేతర సిబ్బంది యూనియన్ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి, కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ సిబ్బందికి హెచ్‌ఆర్‌ఎ కేటాయించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులనే ఉల్లఘించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై ఓఎస్‌డి ధనుంజయనాయుడు, రెక్టార్ వలిబాషా, ప్రిన్సిపాల్ వాసంతితో సమావేశమై చర్చించుకున్నారు. బోధనేతర సిబ్బంది సమ్మె ఇలాగే కొనసాగితే పిజి పరీక్షలు, డిగ్రీ పరీక్షలు ఎక్కడ వాయిదా పడుతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, కనుక సోమవారం లోపు ఆందోళన విరమించేటట్లు చూసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఉద్యమాలకు సిద్ధం కండి
* సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ
బ్రహ్మంగారిమఠం, మార్చి 23: జిల్లాలోని ప్రజలందరు ఉద్యమాలకు సిద్ధం కావాలని అప్పుడే భడానాయకులు తమకు సంబంధించిన బినామీ పేర్లతో పెట్టుకున్న భూములను వెలికి తీసి ఆ భూములలో ఇంటింటికి ఒక ఎకరా వంతున పంచుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి బి నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం వికలాంగుల జాతీయ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈసభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వికలాంగులు హాజరయ్యారు. ఈసభను ఉద్ధేశించి నారాయణ మాట్లాడుతూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, భూ ఆక్రమణదారులు, గ్యాంగ్‌లు, ముఠాలుగా తయారై భూములు ఆక్రమించుకోవడం, కబ్జా చేయడం పరిపాటైందని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పుణ్యక్షేత్రమైన బిమఠం భవిష్యత్తులో పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందని ఇక్కడి భూములను కబ్జా చేస్తున్నారన్నారు. బ్రహ్మంసాగర్ ఏర్పాటుతో నీరు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయ భూములుగా మారాయన్నారు. ఆ భూములను కాజేయడానికి పలుకుబడి కలిగిన నాయకులంతా గ్యాంగ్‌లు ఏర్పడి కబ్జా చేస్తున్నారన్నారు. బిమఠం చిన్నచిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునే వారు సైతం నేడు ప్రభుత్వ భూములు దోచుకొని కోట్లు సంపాధించారన్నారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థను వాటికి సంబంధించిన వ్యక్తుల వద్ద లంఛాలు తీసుకొని దొంగరికార్డులు సృష్టించి భూములను వారే చూపిస్తున్నారన్నారు. వికలాంగులపై దాడి చేసినవారిని పిఓటి యాక్ట్ మీద ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వారు కేసులు నమోదు చేయకుంటే రెవెన్యూ , పోలీసులకు కూడా ఇందులో భాగాలు ఉన్నాయని అని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వీరశేఖర్, వెంకట తిరుపతి, శివ, జకరయ్యలతో పాటు ఎంపిఆర్‌డి నాయకులు ఓబులేసు, రాయుడు, నరశింహారెడ్డి, గురివిరెడ్డి తదితరులు మాట్లాడారు.

* శృంగేరి శారదా పీఠాధిపతులు భారతీ తీర్థమహాస్వామి
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>