అనంతపురం, మార్చి 23: రెక్కాడితే గానీ డొక్కాడని చేనేత బతుకులు వారివి... అవసరానికి చేసిన అప్పులు వారి పాలిట శాపంగా మారుతున్నాయి.. చివరికి ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ధర్మవరం కేంద్రంగా ‘నయా వెట్టి చాకిరీ’ కొనసాగుతోంది. వెట్టిచాకిరీలో పలువురు చేనేత కార్మికులు సమిధలుగా మారుతున్నారు. ధర్మవరం కేంద్రంగా కొనసాగుతున్న వెట్టి చాకిరీ గురించి తెలిసినా కొంతమంది అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా యజమానుల హింసను తట్టుకోలేక పలువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొంతమంది బడాబాబులు సాగిస్తున్న నయా వెట్టి చాకిరీ వివరాల్లోకి వెళ్తే... అవసరార్థం అప్పుకోసం వచ్చే చేనేత కార్మికులు బడాబాబులకు పెట్టుబడిగా మారుతున్నారు. మొదట్లో డబ్బు అవసరం ఉన్న నేత కార్మికుడికి అప్పు రూపేణా కొంత మొత్తం ఇస్తారు. అవసరమైతే వారి ఇంట్లో ఉన్న మరికొందరి పేరా అప్పు ఇస్తారు. అప్పు ఇచ్చిన మరుక్షణం నుంచీ ఇంటిల్లిపాదీ యజమాని ఆధీనంలో ఉంటారు. యజమాని ఇచ్చిన కూలీ తీసుకుంటూ వారి పర్యవేక్షణలో కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకూ చేనేతలు నిరంతరాయంగా పని చేయాల్సి ఉంటుంది. తమ వద్ద అప్పుతీసుకునే చేనేతలతో పని చేయించేందుకు బడాబాబులు ధర్మవరం శివార్లలో విశాలమైన ప్రాంతంలో విశాలమైన భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని స్థానికులు చేనేత ఫ్యాక్టరీలు అని పిలుస్తుంటారు. ఈ భవనాల్లో వసతి, భోజనం కల్పిస్తుంటారు. ఒక్కో షెడ్డులో ఏకంగా 150 వరకూ మగ్గాలు ఏర్పాటుచేస్తున్నారు. ధర్మవరం శివార్లలో ఇలాంటి షెడ్లు సుమారు వంద నుంచి 150 వరకు ఉన్నట్లు సమాచారం. జనసమ్మర్థం అంతగా లేని, శివారు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన ప్రాంగణంలో ఈ షెడ్లు ఉంటాయి. ప్రాంగణం చుట్టూ ఎతైన గోడ ఉంటుంది. కొత్త వాళ్లు లోపలకు వెళ్లడానికి వీలు లేదు. లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు రావడానికి లేదు. తిండీతిప్పలు అన్నీ అక్కడే. అత్యవసర పని పడితే ఒకరు లోపల ఉంటే మరొకరు బయటకు రావాల్సి ఉంటుంది. అలా బయటకు వెళ్లిన వారు తిరిగి రాకుంటే లోపల ఉన్న వారికి నరకం చూపిస్తారు. ఆ భయంతో బయటకు వెళ్లిన వారు సమయానికి తిరిగి వస్తుంటారు. వారికి ఇచ్చే కూలీ బయట లభించే కూలీతో పోలీస్తే సగానికి సగమే. ఎవరైనా బయటకు పారిపోవాలని చూస్తే చుట్టూ గట్టి కాపలా ఉంటుంది. రౌడీలు కనుసన్నల్లో చేనేతలు పని చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే చేనేత బతుకులు జైలు జీవితం గడుపుతున్నారనే అనుకోవాలి. ఇలాంటి పలు కఠిన నియమ నిబంధనల మధ్య అప్పుతీసుకున్న చేనేతలు పనిచేయాల్సి ఉంటుంది. ఎవరయినా ధైర్యం చేసి ఇదేమని ప్రశ్నించినా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇక వారి పని అయిపోయినట్లే. అలాంటి వారిని పోలీసుల సమక్షంలోనే పిలిపించి మరీ చితకబాదుతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి దౌర్జన్యాలను తట్టుకోలేక తీసుకున్న అప్పు ఒకేమారు చెల్లించేందుకు కార్మికులు ముందుకువచ్చినా యజమానులు అంగీకరించరు. బతికినంత కాలం వారు ఇచ్చిన కూలీతోనే జీవనం సాగించాల్సి ఉంటుంది. యజమానులు ఇచ్చిన అప్పుకు వడ్డీ చెల్లిస్తూ తక్కువ కూలీతో బతుకుబండి లాగాల్సిందే. ఈ అన్యాయాన్ని తట్టుకోలేక ఎదురు ప్రశ్నించిన వారు యజమానుల చేతిలోచావుదెబ్బలు తిన్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఒక్క ధర్మవరంలోనే 30 మంది వరకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. యజమానుల దౌర్జన్యానికి భయపడి తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతున్న అభాగ్యులు ఎందరో. తాజాగా బుధవారం రాత్రి ఇలాంటి అవమానాన్ని తట్టుకోలేకే రమేష్ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి నోరు విప్పినా, యజమానుల దౌర్జన్యాన్ని ప్రశ్నించినా తమకు కూడా అదే గతి పడుతుందని ఎవరూ నోరు విప్పడానికి సాహసించడం లేదు. యజమానుల ఆగడాల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నయా వెట్టి చాకిరీ వల్ల పలువురు నేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. చేనేత కార్మికుల సంక్షేమం కోసం పాటు పడతామని చెబుతున్న పాలకులు, చేనేత కార్మిక సంఘాలు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైల్వేలో నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా
గుంతకల్లు, మార్చి 23: ప్రస్తుత వేసవి కాలంలో రైల్వేలో జరిగే నేరాల నియంత్రణపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు రైల్వే జిఆర్‌పి ఎస్పీ పి.మునిస్వామి తెలిపారు. స్తానిక జిఆర్‌పి ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయనను కలసిన విలేఖరులతో రైల్వేలో నేరాల నియంత్రణపై జిఆర్‌పి పోలీసులు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలో ప్రస్తుత వేసవి కాలంలో అధికంగా చోరీలు చోటు చేసుకునే ప్రమాదం వుందన్నారు. ముఖ్యంగా ప్రయాణీకులు దీన్ని గమనించి కిటికి వైపు వున్న వారు అవసరమైతే గాలికి మాత్రమే ఏర్పాటు చేసిన కిటికీలను వినియోగించకోవాలన్నారు. గుంతకల్లు రైల్వే జిల్లా జిఆర్‌పి పరిధిలో ఖాళీలను 50 శాతం మేర భర్తీ చేయడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణ కోసం ప్లాట్ ఫారాలపై పోలీస్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేయడం జరిగిందన్నారు. గుంతకల్లు డివిజన్ పరిధిలోని తిరుపతి, రేణిగుంట, గుంతకల్లు తదితర ప్రయాణీకుల రద్దీ కల్గిన స్టేషన్‌లలో జిఆర్‌పి పోలీసులు ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సహకారంతో డాగ్ స్క్వాడ్‌లతో అకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాన స్టేషన్‌లలో ఇంటిగ్రెటెడ్ సెక్యూరిటి పటిష్టపరచడం జరిగిందన్నారు. డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్, సిసి కెమెరాల ద్వారా నేరస్థుల కదలికలను గుర్తించడం జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్‌లలో మరింత భద్రతను పటిష్ట పరచడానికి 2011లో సిసి కెమెరాలు, డో ర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్‌లు, లగేజ్ స్కానర్స్‌లు, వెహికల్ స్కానర్‌ల కోసం దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు పం పడం జరిగిందన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిసర ప్రాంతాలలో గల పగిడిరాయి, గాజువాక, పాణ్యం, మార్కాపురంతో పాటు మరికొన్ని స్టేషన్‌లలో జిఆర్‌పి పికెటింగ్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రైమ్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా లోకల్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరామన్నారు.
సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీ నృసింహుడు
కదిరి, మార్చి 23: పట్టణంలోని ఖాద్రీ నరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి ఖాద్రీ నరసింహుడు సింహ వాహనంపై తిరువీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై విశేషమైన అలంకరణలతో శ్రీవారు భక్తులను మైమరిపించారు. ముందుగా ఉదయం యాగశాలలో నిత్య హోమం, కైంకర్యములు నిర్వహించారు. తిరువీధులలో మంటపోత్సవం గావించారు. అనంతరం పుణ్యహవచనం చేసి వాస్తు, అగ్ని ప్రతిష్ఠ చేశారు. రాత్రి విశేష అలంకరణతో తిరువీధులలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనికి ముందు సింహ వాహన ఉభయదారులు ఎన్. లక్ష్మిదేవమ్మ, రుక్మిణమ్మ, కదిరివారు, ఎస్.ఎం.వి. నిరంజన్ బెంగళూరు, మాడిశెట్టి వీరయ్య, నిర్మలమ్మ, నరసయ్య, విజయలక్ష్మి, కదిరివారులను ఆలయ మర్యాదలతో ఉత్సవానికి తీసుకువచ్చారు. కాగా శ్రీవారి ఊరేగింపుముందు శ్రీలంక, తమిళనాడుకు చెందిన ప్రత్యేక వాయిద్య కళాకారులు వినసొంపుగా వాయిద్యాలను వాయించారు. ఇదిలా వుండగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో జానపద కళాకారులు, హరిదాసులచే ప్రత్యేక భక్తి గీతాలు, హరికథలను ఏర్పాటు చేశారు. సింహ వాహన ఉత్సవంలో తహశీల్దార్ నాగరాజారావు, బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీహరిప్రసాద్, నామా రాము, ఆదినారాయణ, నారాయణ, టి.వి. రమణ, మున్సిపల్ మాజీ చైర్మన్ నామా నాగరాజు, పలువురు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సింహ వాహనం సందర్భంగా కదిరి డిఎస్పీ కరిముల్లాషరీఫ్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్సై తబ్రేజ్, రూరల్ ఎస్సై విశ్వనాథ్‌రెడ్డి, మరికొంతమంది ఎస్సైలు, పోలీస్ సిబ్బంది శాంతి భత్రలను పర్యవేక్షించారు.
నేడు హనుమంత వాహనం...
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం హనుమంత వాహనం వుంటుంది. హనుమంతుడు తన భుజస్కందాలపై శ్రీవారిని ఊరేగించడం హనుమంత వాహన ప్రత్యేకత. రామావతారంలో రాక్షస సంహరణ అనంతరం రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజాలపై ఊరేగించడం జరుగుతుంది. అదేవిధంగా నరసింహ అవతారంలో శ్రీవారు హనుమంత వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు.
ముగిసిన చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ, మార్చి 23: పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ కరిబసవస్వామి గవి మఠంలో వెలసిన శ్రీ చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చంద్రవౌళీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి మూల విరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా విశేష పుష్పాలతో అలంకరించారు. అశ్వ వాహనంపై చంద్రవౌళీశ్వర స్వాములను ఊరేగించారు. వసంతోత్సవాలు నిర్వహించారు. మఠం ఆవరణలో ఆర్డీటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత 8వ పీఠాధిపతి శ్రీ జగద్గురు చెన్న బసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి బసవరాజేంద్ర స్వామి, ఆలయ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ ఏజెంట్ రాజన్నగౌడ్, ఆలయ సిబ్బంది నారాయణస్వామి, గోపి, ఓంకార్‌గౌడ్, శివశంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, మార్చి 23 : జిల్లాలోపరిశ్రమల అభివృద్దికి తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి. దుర్గాదాస్ అధికారులకు సూచించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలోభాగంగా పరిశ్రమల అభివృద్దిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మునిసిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు పారిశ్రామికాభివృద్దికి తగు చర్యలగు గైకొనాలన్నారు. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు అందిన వెంటనే తగు విచారణ చేపట్టి అర్హులైన నిరుద్యోగులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల స్థాపనలో మహిళలకు 20 శాతం, పురుషులకు 15 శాతం, ఎస్సీ మహిళలకయితే 40 శాతం, పురుషులకయితే 35 శాతం ఇన్‌వెస్ట్‌మెంట్ సబ్సిడీ అర్హత కలిగి ఉంటుందన్నారు. జిల్లా పరిశ్రమ అభివృద్ది కమిటీ సమావేశంలో భాగంగా 2010-15 సంవత్సరానికి గానూ ఐ ఐపిపి పథకం కింద సిల్క్ చీరల తయారీ, సిమెంటు ఇటుకల తయారీ, ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తయారీ, వాహనముల కొనుగోలు తయారీకి సంబంధించి ఎనిమిది మంది లబ్దిదారులకు పావలావడ్డీ కింద వడ్డీ మంజూరుకు 25 మంది లబ్దిదారులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలోజిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజరు ఆనందకుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, ఎపిఐఐసి జోనల్ మేనేజరు సుబ్బారావు, పరిశ్రమల కేంద్రం అసిస్టెంటు డైరెక్టరు రామమూర్తి, డిడి ప్రతాప్, పరిశ్రమల అసోసియేషన్ ఫ్యాప్సీ శేషాంజినేయులు, వివిధ పరిశ్రమలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా నరసింహస్వామి జెల్ది
బొమ్మనహాళ్, మార్చి 23 : ఉద్దేహాళ్ గ్రామ సమీపంలో వేదావతి నది ఒడ్డున శనివారం లక్ష్మీనరసింహస్వామి జెల్ది కార్యక్రమం నిర్వహించారు. వేదావతి నది ఒడ్డున ఓబులస్వామి, నరసింహస్వామి వారికి పన్నీటి స్నానాలు, పుష్పాభిషేకాలు వేద పండితుల వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని ఉద్దేహాళ్ నుండి, ఉప్పరాల వరకు మేళతాళాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు బొమ్మనహాళ్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
108 కోట్లతో తాగునీటి పథకాలు
ఉరవకొండ, మార్చి 23: జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి దాహార్తిని తీర్చడం కోసం రూ.108కోట్లతో పథకాలను చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం పట్టణ శివారులో వున్న లత్తవరం వద్ద ఈ నెల 24న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తాగునీటి పథకాల పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా రూ.11కోట్ల 8లక్షలతో ప్రతిపాదనలు పంపామన్నారు. మొదటి విడత కింద రూ.5కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. అందులో రూ.3కోట్లతో పైపులైన్, బోరు మరమ్మతులు, బోరు బావుల నుండి నీటి సరఫరా కోసం ఖర్చు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. డిఆర్‌జిఎఫ్ కింద రూ.2కోట్లు ఆర్‌డబ్ల్యూఎస్ రూ.2కోట్ల నిధులు, జనరల్ ఫండ్ కింద రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. శాశ్వత నీటి పథకాల కోసం ఉరవకొండకు రూ.56కోట్లు, సింగనమలకు రూ.40కోట్లు, వైటి చెరువుకు రూ.12కోట్లు నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టడానికి టెండర్లు వేస్తునట్లు ఆయన తెలిపారు.
నిరుద్యోగాన్ని పారదోలేందుకు చర్యలు తీసుకోండి
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, మార్చి 23 : జిల్లాలో నిరుద్యోగాన్ని పారదోలేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. దుర్గాదాస్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని రెవెన్యూభవన్‌లో డిఆర్‌డిఎ, మెప్మా, పరిశ్రమల శాఖల అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంనచి వచ్చిన యాజమాన్యం, పారశ్రామిక శిక్షణ సంస్థల ప్రతినిధులు, రాజీవ్ యువకిరణాల పథకం శిక్షణ కేంద్రాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా డిఆర్‌డిఓ ఆధ్వర్యంలోరాజీవ్ యువ కిరణాల పథకం ఆవశ్యకతను తెలిపే విధంగా ప్రాజెక్టు ప్రజంటేషన్‌ను ప్రదర్శించారు. అనంతరం జిల్లాలో రాజీవ్ యువ కిరణాల పనితీరు గురించి కలెక్టర్ కూలంకషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వి. దుర్గాదాస్ మాట్లాడుతూ కరవుప్రాంతమైన అనంతపురం జిల్లాలో చాలా మంది యువతీ యువకులు విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధి మార్గాలను అనే్వషిస్తుంటారని, అలాంటి వారికి రాజీవ్ యువ కిరణాలు పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లాలో రాజీవ్ యువ కిరణాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం 2012-13 సంవత్సరంలో11,805 మందికి గానూ 8504 మందికి ఉపాధి అవకాశాలను కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా డిఆర్‌డిఎ, ఐకెపి, పరిశ్రమల శాఖ, మెప్మా తదితర శాఖల సమన్వయంతో పరిశ్రమల్లో ఎలాంటి ఉద్యోగాలు కల్పించాలనే విషయాలను సేకరించాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన డిఆర్‌డిఓ పిడి కన్వీనరుగా ప్రతి నెలా మొదటి, మూడవ గురువారాల్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పారిశ్రామిక సంస్థలకు సరిపడే విధంగా నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా సమీక్షించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడియస్ జార్జిబెర్నార్డ్ షా, ఎపియమ్‌లు గోపాల్, మంజుల, హరి, జ్యోతి, నాగరాజు, రాణి, శ్యామ్ శేఖర్ లతోపాటు జిల్లాలోని పలు పరిశ్రమల ప్రతినిధులు, డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు, మెప్మా పిడి మల్లీశ్వరీదేవి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజరు ఆనంద్‌కుమార్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి పాల్గొన్నారు.