ద్వారకాతిరుమల, మార్చి 24: శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతీ ఆండాళ్ అమ్మవార్ల దివ్యమూర్తులను నేరుగా తాకుతూ అరుదైన సూర్య కిరణార్చన ఘట్టం ఆదివారం చిన వెంకన్న ఉపాలయంలో ఆవిష్కృతమైంది. లక్ష్మీపురంలోని శ్రీ జగన్నాధ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎన్నో కట్టడాలు అడ్డు ఉన్నా వాటిని ఛేదించుకుని ఏటా ఫాల్గుణ మాసంలో ఈ సూర్యకిరణాలు స్వామివారు, అమ్మవార్లను తాకటం ఎంతో విశేషంగా చెప్పవచ్చు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి ముందు దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో సూర్యకిరణాలు దివ్యమూర్తులను తాకుతుండగా, ఈ ఏడాది ద్వాదశి రోజైన ఆదివారం తాకటం ప్రారంభమయ్యాయి. సౌరమాన పంచాంగాన్ని అనుసరించి సాయం సంధ్యవేళ ఈ సూర్యకిరణాలు గర్భాలయంలోనికి ప్రవేశించి, ముందుగా మకర తోరణం మీదుగా శ్రీనివాసునిపై ప్రసరించటంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వరుడు సూర్య కిరణ శోభతో దేదీప్యమానంగా వెలుగొందారు. అనంతరం ఆ సూర్యకిరణాలు ఉభయ దేవేరులైన పద్మావతీ అమ్మవారిపైనా, ఆ తర్వాత ఆండాళ్ అమ్మవారిపైనా ప్రసరించటాన్ని వీక్షించిన భక్తజనులు పరవశించారు.
సనాతన ధర్మాన్ని హిందువులంతా ఆచరించాలి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆఖిల భారతీయ భౌతిక ప్రముఖ్ బాగయ్య
ఉంగుటూరు, మార్చి 24: సనాతన ధర్మాన్ని ప్రతీ ఒక్క హిందువూ ఆచరించి కాపాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆఖిల భారతీయ భౌతిక ప్రముఖ్ భాగయ్య అన్నారు. ఆదివారం ఉంగుటూరు శివారు కొత్తగూడెం గ్రామం విస్తరించి ఉన్న గోక్షేత్రంలో 8వ శ్రీరామ జపయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక సభకు గోక్షేత్ర నిర్వహకుడు అశోక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భాగయ్య మాట్లాడుతూ మనం ధర్మాన్ని ఆచరించలేక ధర్మాన్ని విమర్శిస్తున్నామని, ధర్మం చెడి పోలేదన్నారు. ఎన్నో పుణ్యాల ఫలమే మానవజన్మ అన్నారు. మానవ జన్మ కుటుంబ వ్యవస్థలో మూలమన్నారు. ఈ వ్యవస్థలోనే గుర్తింపు లభిస్తుందని అన్నారు. అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలించాలని అందులోనే ధర్మం ఉందని చెప్పారు. దళితులు, గిరిజనులకు రాముడు, కృష్ణుడు తదితర భగవంతుల గొప్పతనాన్ని వివరించే వారే కరవయ్యారని అన్నారు. దిగజారిపోయిన అలవాట్లను మార్చుకుని ధర్మాన్ని కాపాడాలని అన్నారు. కనిపించే దేవుడు సూర్యుడని, ప్రకృతి తల్లి లాంటిదని ఆయన వివరించారు. ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అంతస్థుల తేడాలు విడిచినప్పుడే అసలైన హిందువు కాగలడన్నారు. ఆవుని ప్రతీ ఒక్కరూ పూజించాలని, వట్టిపోయిన ఆవు నుండి వచ్చే మలమూత్రాదుల వల్ల కూడా రూ.2వేలు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. సేంద్రియ వ్యవసాయమే దేశానికి మూలమన్నారు. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిలో దేశం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. సోమనాధ మందిరాన్ని కాపాడిన రీతిలోనే అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో పార్లమెంటు సభ్యులపై వత్తిడి తీసుకురావలసిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. చర్మకారులు, హరిజన, గిరిజనులు కలిసి హిందూ ధర్మం కోసం పాటుపడాలన్నారు. పాలకొల్లుకు చెందిన పరబ్రహ్మ షణ్ముఖానందాశ్రమం పీఠాధిపతి జ్యోతిర్మయానంద భారతి మాట్లాడుతూ ప్రతీ ఇల్లు ఆశ్రమంగా మార్చుకున్నప్పుడే సమస్యలు తొలగుతాయన్నారు. గోమాతను పూజించాలన్నారు. శ్రీరామ జయజయ జయజయ రామ అని నోరారా జపించినప్పుడు, తాళం వేసేందుకు చేతులు పూర్తిస్థాయిలో వచ్చినప్పుడే మనకు అఖండ శక్తి లభిస్తుందన్నారు. శ్రీరామ జయరామ జయజయ రామ అనే భగవన్నామ స్మరణ భక్తులచే అనిపించారు. ఈ దశలో గోక్షేత్రం రామ నామంతో మార్మోగింది. డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామ పదానికి మంచి శక్తి ఉందన్నారు. సభలో వాసవీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు గ్రంధి సత్యనారాయణ, మానవత సంస్థ జిల్లా అధ్యక్షుడు అప్పాక రాంబాబు తదితర్లు వేదిక అలంకరించి మాట్లాడారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నిర్వాహకులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కృష్ణుడు, రుక్మిణిల విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు. తొలుత వందలాది మంది దంపతులచే శ్రీరామ జప యజం నిర్వహించారు. మహిళలు నిర్వహించిన కోలాటం, సంగీత విభావరి ఆకట్టుకున్నాయి. గోవుల చుట్టూ ప్రదక్షిణలుచేసి, పూజలు చేశారు. అంచనాలకు మించి భక్తులు రావటంతో భోజనాల వద్ద గతెన్నడూ లేనివిధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులను నాచుగుంట రేవు, ఉంగుటూరు సెంటర్ల నుండి నిర్వాహకులు ఏర్పాటుచేసిన వాహనాల్లో భక్తులను తరలించారు.
క్షయవ్యాధి నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు:కలెక్టర్
ఏలూరు, మార్చి 24 : జిల్లాలో క్షయవ్యాధి సోకిన వారిని గుర్తించి వారికి సకాలంలో వైద్యాన్ని అందించి పూర్తిస్థాయిలో నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధిపై ప్రత్యేక వైద్య పద్దతిని అందించడం ద్వారా 93 శాతం నివారణ రేటును సాధించినప్పటికీ నూరుశాతం ఫలితాలు సాధించేందుకు వైద్యాధఙకారులు చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే క్షయ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అంకితభావంతో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాను క్షయ రహిత జిల్లాగా ముందుంచాలని సూచించారు. క్యాన్సర్, క్షయ వ్యాధి, షుగర్, బ్లడ్ ప్రెషర్ వంటివి మనుషులను అకస్మాత్తుగా మరణానికి గురిచేస్తాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించేందుకు కూడా ప్రత్యేక వ్యాధి నిర్ధారణ శిబిరాలను జిల్లాలో నిర్వహిస్తామన్నారు. సకాలంలో క్షయ వ్యాధిని గుర్తించి ఎండి ఆర్ పద్దతిలో వైద్యాన్ని అందించడం ద్వారా ఈ వ్యాధిని దూరం చేయవచ్చున్నారు. ప్రతీ గ్రామంలో ఇంటింటికీ సర్వే నిర్వహించి క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి సకాలంలో వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులు, డాట్ ప్రొవైడర్లకు కలెక్టర్ సూచించారు. ప్రతీ మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో క్షయ వ్యాధి నివారణ కేంద్రాలున్నాయని వాటి ద్వారా క్షయ వ్యాధిగ్రస్తులు వైద్యం పొందాలన్నారు. ప్రభుత్వం క్షయ వ్యాధి నివారణకు ఎంతో ఖరీదైన మందులను రోగ నివారణకు అందుబాటులో ఉంచుతున్నదని వాటిని క్రమం తప్పకుండా వేసుకుని రోగులు వ్యాధి నుండి ఉపశమనం పొందాలన్నారు. ఎ ఎన్ ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శకుంతల మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి ప్రాధమికంగా రెగ్యులర్ వైద్య విధానం ద్వారా ఆరు నెలలపాటు చికిత్స చేయడం జరుగుతుందన్నారు. జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి డాక్టర్ ఆర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం అయిదు క్షయ వ్యాధి కేసులను పూర్తి స్థాయిలో నిర్మూలించగలిగామని చెప్పారు. డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ క్షయ వ్యాధి సూక్ష్మక్రిములు మనిషి తుమ్మినప్పుడు సన్నని తుంపర్లు ద్వారా గాలిలోకి వ్యాపిస్తాయని వాటిని ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు క్షయ వ్యాధి సోకే అవకాశముందన్నారు. ప్రతీ మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో క్షయ వ్యాధి మందులు ఉంచడం జరిగిందని ఆరు నెలల నుండి ఎనిమిది నెలలు వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే క్షయ వ్యాధిని నివారించవచ్చునన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులకు సేవలందించి క్షయ వ్యాధి నివారణకు తమ సహకారాన్ని అందించడంలో ముందున్న కె కీర్తి, వై సరళారాణి, పూర్ణావతి, సాయి శైలజ, జె రాజామణి, శాంతకుమారిలకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన కలిగించే కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంపై అవగాహన కలిగించకే ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ దుర్గా మల్లేశ్వరరావు, డాక్టర్ మద్దేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘ సభ్యులు ఆర్ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
ధ్రువపత్రాలు విధిగా తీసుకురండి: కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఎస్‌పి సూచన
ఏలూరు, మార్చి 24 : కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు చేసిన అభ్యర్ధులు ఇంతకుముందు ధ్రువపత్రాలు సమర్పించని వారు సోమవారం జరగనున్న దేహదారుఢ్య పరీక్షలకు విధిగా ధ్రువపత్రాలు తీసుకురావాలని ఎస్‌పి ఎం రమేష్ స్పష్టం చేశారు. ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైన అనంతరం అభ్యర్థులు దరఖాస్తులు చేసిన సమయంలో కొంతమంది కుల ధ్రువీకరణ, క్రీమీలేయర్, విద్యార్హత పత్రాలను త్వరలో అందిస్తామని చెప్పారని, అలాగే పరుగుపందెం జరిగిన సమయంలో అందిస్తామని చెప్పిన కొంతమంది ఆ విధంగా చేయలేదన్నారు. వారంతా విధిగా సోమవారం నాటి పరీక్షలకు ఈ ధృవపత్రాలను విధిగా తీసుకురావాలని చెప్పారు.