న్యూఢిల్లీ, మార్చి 24: ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీలకు (ఒఎంసి) ప్రభుత్వం నగదు సబ్సిడీగా మరో 25వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించనుంది. ఆటో, వంటగ్యాస్ తదితర చమురు ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నందున నష్టపరిహారంగా ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వం నిర్దారించిన ధరలకు చమురు కంపెనీలు డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ విక్రయిస్తునందున నష్టాలు పొందుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) కంపెనీలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంతవరకు 55 వేల కోట్ల రూపాయలు నగదు సబ్సిడీ అందచేసింది. ‘వచ్చే నెలలో మరో 25 వేల కోట్ల రూపాయలు వారికి చెల్లిస్తాం’ అని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ చెప్పారు. మూడు చమురు కంపెనీలు 2012-13 సంవత్సరంలో చమురు ఉత్పత్తుల అమ్మకాల వల్ల 161,343 కోట్ల రూపాయలు నష్టపోయాయి. ఈ మొత్తంలో సుమారు 60 వేల కోట్ల రూపాయలు ఒఎన్‌జిసి తదితర చమురు సంస్థలు చెల్లిస్తాయి. ఇప్పటికి ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వగా ఇంకా 21వేల కోట్లరూపాయలు పరిహారం చమురు కంపెనీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనుందని ఆయన వివరించారు. ఇక్కడ ఏర్పాటైన ఎడిటర్స్ సదస్సులో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడుతూ, ప్రభుత్వం వంటగ్యాస్‌తో సహా చమురు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటు ధరల్లో సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు.
ఎడిటర్స్ సదస్సులో మాట్లాడుతున్న వీరప్ప మొయిలీ