న్యూఢిల్లీ, మార్చి 24: స్టాక్ మార్కెట్లు ఈ వారం ఇంకా ఒడిదుడుకుల మధ్యే కొనసాగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా భావిస్తున్నారు. హోలీ పండుగ సెలవలు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారం పూర్తి కానుండడం, రాజకీయ అస్థిరత తదితర కారణాల దృష్ట్యా ఈ నెల చివరి వారం మార్కెట్ ఒడిదుడుకులతోనే సాగే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. ఇలా ఉండగా గత వారం యుపిఎ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన డిఎంకె పార్టీ మద్దతు ఉపసంహరించుకోడంతో దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులకు తోడు, అంతర్జాతీయంగా యూరో ఉద్దీపన పథకం వల్ల సైప్రస్‌లో పరిణామాలు, ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చునన్న అంచనాలతో మదుపరులు ఆచి తూచి అడుగువేయవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సైప్రస్ ఉద్దీపన పథకానికి సరిపోయే నిధుల వ్యవహారం సోమవారం తేలవచ్చునని, గురువారం ఫూచర్, ఆప్షన్ల గడువు పూర్తవుతాయని ఈ పరిణామాలు గమనించే మదుపరులు ఆచి తూచి వ్యవహరిస్తారు కనుక వారమంతా ఒడిదుడుకులతో సాగవచ్చునని వారు చెబుతున్నారు. దీనికి తోడు స్మాల్, మీడియం క్యాప్ షేర్లు నష్టాలలోనే కొనసాగే పరిస్థితులున్నాయి. ఇక బుధవారం హోలీ సందర్భంగా, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లు సెలవు పాటిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులతో సాగడం, ద్రవ్యలభ్యత ఏ మేరకు ఉంటుందోనని మదుపరులు వేచి చూసే ధోరణి వహించవచ్చు. కొన్ని కంపెనీల షేర్లకు కొనుగోలు మద్దతు లభించవచ్చునని, తద్వారా మార్కెట్ కొంత కరెక్షన్‌కు గురయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ఎలా కొనసాగుతాయోనన్న అనుమానాలు మదుపరులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వలె పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుందో లేదో, దాని పరిణామాలు విదేశీ సంస్థాగత పెట్టుబడులను ప్రభావితం చేయవచ్చునని కొందరు భావిస్తున్నారు. ఇలా ఉండగా గత వారం సెనె్సక్స్ దాదాపు 692 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 221 పాయింట్లు కోల్పోయింది. దేశీయ పరిస్థితులు, అంతర్జాతీయంగా సైప్రస్ సంక్షోభం మార్కెట్ సెంటిమెంట్‌ను మాత్రం బలంగా దెబ్బతీసాయి. దీని ప్రభావం ఈ వారం కూడా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
2వేల కోట్ల షేర్లను కొన్న ఎల్‌ఐసి
న్యూఢిల్లీ, మార్చి 24: జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 2వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ రంగ సంస్థలలో షేర్లను కొనుగోలు చేయడంతో 2012-13 సంవత్సరంలో ఎల్‌ఐసి ప్రభుత్వ రంగ సంస్థలలో దాదాపు 10 శాతం వాటాను కైవశం చేసుకుని 23,900 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టినట్లయింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మార్చి 31 వరకు ఎన్‌బిసిసి, హెచ్‌సిఎల్, ఎన్‌టిపిసి, ఆర్‌సిఎఫ్, నాల్గొ, ఆయిల్ ఇండియా, ఎన్‌ఎండిసి, సెయిల్‌తో సహా మొత్తం 8 సంస్థలలో వాటాను విక్రయించి పెట్టుబడులను ఉపసంహరించింది.