నేరస్థుడుగా నిర్థారణ అయిన హిందీ చలనచిత్ర నటుడు సంజయ్‌దత్‌ను జైలులో నిర్బంధించాలా? వద్దా? అన్న చర్చ మాధ్యమాలలో పెద్ద ఎత్తున జరిగిపోతుండడం జగుప్సాకరమైన పరిణామం! 1993 మార్చిలో ముంబయిలో జరిగిన పనె్నండు వరుస పేలుళ్ళ కేసులో సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టు ఐదేళ్ళ శిక్ష విధించిన తరువాత మూడు రోజులుగా జరుగుతున్న ‘మీమాంస’ మరికొన్ని రోజులపాటు కొనసాగే ప్రమాదం ఉంది. ఏ నిందితుడైనా న్యాయస్థానాలలో దోషిగా ధ్రువపడిన తరువాత అతగాడు శిక్షను అనుభవించడం సహజ న్యాయ ప్రక్రియలో భాగం. అందువల్ల సంజయ్‌దత్ ఐదేళ్ళ జైలుశిక్షను అనుభవించడం ఆశ్చర్యకరం కాదు. అపూర్వమైన పరిణామమూ కాదు. ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం 2006 సెప్టెంబర్‌లో ఇతగాడికి విధించిన ఆరేళ్ళ జైలు శిక్షలో ఒక సంవత్సరం తగ్గినందుకు నిజానికి సంజయ్‌దత్ ఆనందించాలి. అక్రమ ఆయుధ నిరోధక చట్టంలోని ఇరవై ఐదవ నిబంధన మేరకు సంజయ్‌దత్‌కు పదేళ్ళ వరకూ జైలుశిక్ష విధించవచ్చు. ఎందుకంటే సంజయ్‌దత్ ఇంట్లో ‘ఎకె-56’ రకం మరతుపాకి లభించింది. దానికి అనుమతి లేదు. సాధారణ పౌరులు ఆత్మరక్షణ కోసం ఉపయోగించే చిన్న తుపాకులకు సైతం ‘అనుమతి’ ఉండాలి. ‘ఎకె-56’ రకం తుపాకులను బీభత్సకారులు కాని, వారిని ఎదుర్కొనే భద్రతా దళాలవారు కాని మాత్రమే ఉపయోగిస్తుంటారు. సంజయ్‌దత్ ఇలా చట్టాన్ని అమలు జరిపే పోలీసు కాదు, సైనికుడు కాదు. అందువల్ల సహజంగానే అతగాడు బీభత్సకారుడై ఉండాలి, లేదా ‘ఎకె-56’ రకం ఆయుధాన్ని అక్రమంగా ఉపయోగించే వారితోను, హత్యలు చేసే టెర్రరిస్టులతోను అతగాడికి సంబంధాలు ఉండి తీరాలి! సామాన్యుల బుద్ధికి సైతం స్పష్టమయ్యే అతి సరళమైన వాస్తవాలివి! అందువల్ల ముంబయి ప్రత్యేక న్యాయస్థానం సంజయ్‌దత్‌కు గరిష్ఠంగా పదేళ్ళ జైలుశిక్షను విధించకపోవడం ఆతగాడి అదృష్టం. విధించిన ఆరేళ్ళ శిక్షలో కూడ సుప్రీంకోర్టు ఏడాది తగ్గించడం మరికొంత అదృష్టం. ఈ అదృష్టం పట్టినందుకు ఆనందించవలసిన సంజయ్‌దత్ బహిరంగంగా ఆక్రోశాన్ని అభినయిస్తున్నాడు. ఇప్పటికే అనుభవించిన పద్ధెనిమిది నెలల జైలు శిక్ష పోగా, మిగిలిన మూడున్నరేళ్ళ శిక్షను పొందడానికి సిద్ధపడడం పశ్చాత్తాప భావానికి నిదర్శనం. కానీ సంజయ్‌దత్‌లో పశ్చాత్తాప భావం మచ్చుకైనా కనిపించడం లేదు. పశ్చాత్తాపం చెందడం సకల నేరాలకు నిజమైన ప్రాయశ్చిత్తం! సంజయ్‌దత్ తాను నేరం చేయలేదని, ఇప్పటికీ బుకాయిస్తున్నాడు! ప్రకటనలు చేస్తున్నాడు. ఇంటర్వ్యూలలో తాను నేరస్థుడు కాదన్న భ్రాంతిని కల్పిచడానికి యత్నిస్తున్నాడు.
సంజయ్‌దత్‌కు జరగవలసింది మాత్రమే జరిగింది. కానీ ఏదో జరగరానిది జరిగిపోయినట్టు ఆయన నటనను ప్రదర్శిస్తున్నాడు. ఒకవైపున తాను న్యాయస్థానాల తీర్పులకు కట్టుబడే రాజ్యాంగ బద్ధుడినని దేశభక్తుడినని ప్రకటిస్తున్న సంజయ్‌దత్ మరోవైపు తాను తప్పు చేయలేదని బుకాయిస్తున్నాడు. సుప్రీంకోర్టు సైతం ఇతగాడు నేరం చేసినట్టు నిర్ధారించిన తరువాత మళ్ళీ తప్పు చేయలేదని ఇతగాడు చెప్పుకు రావడం న్యాయస్థానాల తీర్పులను గౌరవించినట్టు ఎలా అవుతుంది? తాను తప్పు చేయకపోయినప్పటికీ న్యాయస్థానాలు అన్యాయంగా తనను శిక్షించాయన్న ఆరోపణ ఈ వైఖరిలో ధ్వనిస్తోంది! ఇది ఒకరకంగా న్యాయ ధిక్కారం! తెలిసో తెలియకో బీభత్సకారులతో తాను సంబంధాలను పెట్టుకున్నానని, సంజయ్‌దత్ చెప్పడానికి వీలులేదు. దేశ రాజకీయాల గురించి, జాతీయ హితం గురించి, సామాజిక నేరాల గురించి, ప్రమాదాల గురించి అవగాహన ఉన్న కుటుంబానికి చెందిన ప్రసిద్ధుడు సంజయ్ దత్! అందువల్ల ‘ఎకె-56’ వంటి మారణాయుధాలను ‘అమాయకం’గా ఇంట్లో ఉంచుకున్నానని చెప్పజాలడు. బుద్ధి పూర్వకంగానే దావూద్ ఇబ్రహీం వంటి పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్స హంతకులతో అతగాడు స్నేహ సంబంధాలు పెంపొందించుకున్నాడు. హాజీ మస్తాన్ వంటి సంఘ విద్రోహ ప్రచ్ఛన్న ముఠాలతో ముంబయి చలనచిత్ర సీమకు చెందిన అనేక మందికి సంబంధాలుండడం దశాబ్దుల వైపరీత్యం. 1980వ దశకం చివరిలో మరింత ప్రమాదకరమైన పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా విభాగం ‘ఐఎస్‌ఐ’ రంగ ప్రవేశం చేసింది. ‘ఐఎస్‌ఐ’ సహకారంతోనే ఎదిగిన ‘ఇబ్రహీం’ ముఠాతో సంజయ్ దత్‌కు స్నేహం కుదరడం తెలిసీ తెలియని చర్య కాజాలదు! బీభత్స ముఠాకు సహకరించడం వల్ల తనకు వ్యక్తిగతంగా ‘బలం’ పెరుగుతుందన్న స్పష్టమైన దుర్బుద్ధి సంజయ్ దత్ ప్రవర్తనకు ప్రేరకం! అందువల్ల తాను ఘోరమైన తప్పిదం చేశానని ఒప్పుకొని ఉంటే సంజయ్ దత్‌లో పరివర్తన వచ్చిందన్న భావం ఇతరులకు కలిగేది. 1993 నుండి ఇరవై ఏళ్ళలో ఎప్పుడూ ఇలా ఒప్పుకోక పోగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడ నేరాన్ని అంగీకరించకపోవడం అతగాడి వికృత చిత్తవృత్తికి, వంచనకు నిదర్శనాలు! ఇలాంటి వాడిని క్షమించాలన్న చర్చ మొదలు కావడమే దేశ వ్యతిరేక పరిణామం...
సంజయ్ దత్‌ను జైలుకు పంపరాదని, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ‘ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు’ మార్కండేయ కట్జూ వంటి న్యాయ కోవిదులు సైతం అర్భాటిస్తుండడం మరింత దౌర్భాగ్యకరమైన విపరిణామం. క్షమాభిక్ష పెట్టమని అభ్యర్థించే రాజ్యాంగపరమైన హక్కు నేరస్థులుగా ధ్రువపడిన వారందరికీ ఉంది! ఈ క్రమంలో మరణశిక్ష పడిన యాకుబ్ మెమెన్‌తో యావజ్జీవ నిర్బంధానికి గురైన హంతక బీభత్స కారులందరూ ‘క్షమా యాచన’కు దాఖలు చేసుకోవచ్చు. సంజయ్ దత్ కూడ దాఖలు చేసుకోవచ్చు. క్షమాబిక్షను పొందిన వారెవ్వరూ నిర్దోషులు కాజాలరు. నిర్దోషులు క్షమాభిక్షను కోరవలసిన అవసరం లేదు. అందువల్ల సంజయ్ దత్‌ను క్షమించాలని కోరుతున్న వారు అతగాడు నేరస్థుడని అంగీకరించక తప్పదు. అలాంటప్పుడు ‘ఆయన ఇప్పటికే ఎంతో వ్యధకు గురి అయినాడు..’ వంటి ప్రకటనలు హంతకులు జరిపిన బీభత్సకాండ ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన మూడు వందల పదిహేడు మంది కుటుంబాలకు ఇరవై ఏళ్ళుగా అనుభవించిన వ్యథ, చిత్తక్షోభ, ఆర్థిక అసౌకర్యం, భావోద్వేగాలు, కట్జూ వంటి వారికి పట్టడం లేదు. ఈ ఘోర మారణకాండ జరగడానికి ముందూ, ఆ తరువాత కూడ సంజయ్ దత్ దేశ వ్యతిరేక బీభత్స కారులతో కలిసి మెలసి ప్రవర్తించాడు. అందువల్ల అతగాడి ఇంటికి ఆయుధాలు చేరాయి. ఇలా పాకిస్తాన్ తొత్తులతో కలిసి విందులారగించిన సంజయ్ దత్‌కు బాధితుల భావోద్వేగాలు గుర్తుకు రాలేదు. తనదాకా వచ్చింది కాబట్టి ఆయన అన్యాయానికి గురి అయిన నిర్దోషి వలె ‘సజల నయనాల’ను ‘్భవోద్వేగాల’ను అభినయిస్తున్నాడు. ‘వారు నేను మరింతగా బాధపడాలని భావిస్తే తట్టుకోవడానకి వీలుగా మరింత బలంగా ఉండేలా ఇరవై ఏళ్ళు బాధపడినాను..’ అని ఆయన చెప్పడం న్యాయ ధిక్కారం. ‘వారంటే’ న్యాయ వ్యవస్థ మాత్రమే! సంజయ్ దత్ తీవ్రమైన నేరం చేశాడని సుప్రీంకోరర్టు స్పష్టంగా ప్రకటించింది. అలాంటి వాడిని క్షమించడానికి తార్కికమైన మానవతా పూర్వకమైన కారణం లేదు. కన్నీళ్ళు, భావోద్వేగాలు సంజయ్ దత్‌కే కాదు, సకల జీవరాశికి సహజం. కుందేళ్ళు, తోడేళ్ళు కూడ భావోద్వేగాలకు గురి అవుతాయి. బీభత్స కారుల, నేరుస్థుల ‘కంటతడిని’, ‘ముక్కుతడిని’ చూసి మోసపోవడం ప్రమాదకరం!!
నేరస్థుడుగా నిర్థారణ అయిన హిందీ చలనచిత్ర నటుడు
english title:
s
Date:
Monday, March 25, 2013