...............
తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన సమయంలో వామపక్షాలు సాగించిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు ప్రజాదరణ పొందింది. కానీ నేడు సర్‌ఛార్జీ, సర్దుబాటుఛార్జీ అంటూ రకరకాల పేర్లతో ప్రతినెలా ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతున్నా వామపక్షాలు ఎక్కడా ఉద్యమించిన దాఖలాలు లేవు. ఏప్రిల్ ఒకటినుంచి మరోసారి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్ర భుత్వం రంగం సిద్ధంచేస్తున్నా అన్ని పార్టీలతోపాటు వామపక్షాలు కూడా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఉద్యమం చేస్తే తమతో కలిసి వచ్చే పార్టీలు ఎన్ని? దానివల్ల తమ పార్టీలకు కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి? అన్న లెక్కలు వేసుకుంటూ వామపక్షాలు కాలం గడుపుతున్నాయి.
.................
పేదల పక్షాన నిలిచి, వారి సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే పార్టీలుగా గుర్తింపుపొందిన కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా ఆ గుర్తింపును కోల్పోతున్నాయి. ఇతర రాజకీయ పార్టీలవలే వామపక్షాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ సీట్లను పెంచుకోవడానికి ఆరాటపడుతున్నాయి. ప్రజాపోరాటాలకు దాదాపుగా స్వస్తిపలుకుతున్నాయి. సైద్ధాంతిక పోరాటాలకు తిలోదకాలిచ్చిన కమ్యూనిస్టుపార్టీలు తమలోతాము మాట ల యుద్ధాలకు దిగుతున్నాయి. 1956 నుంచి 1962 ఎన్నికల వరకు రాష్ట్రంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు నిలుస్తారని ఎంతోమంది విశే్లషకులు భావించారు. కానీ కమ్యూనిస్టుల్లోని వరా గలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం సా దించాలన్న ఆవేశంలో చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఐక్యకమ్యూనిస్టుపార్టీ రెండు ముక్కలైంది. నాటినుంచి నేటివరకు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న తపన తో చేస్తున్న ప్రయత్నాలు రెండు పార్టీలను క్షీణింపచేశాయన్నది జగమెరిగిన సత్యం.
చీలిక తర్వాత అంతర్గతంగా ఉన్న విబేధాలను బయటకు పొక్కనీయకుండా తాము ఐక్యంగానే ఉన్నామని చెప్పుకునేవి. అందుకు తగ్గట్టుగానే ఐక్యపోరాటాలు చేసేవి. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పు లు సంభవించాయి.కాలక్రమంలో కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని కోల్పోయాయి. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేయలేని స్థితికి కమ్యూనిస్టుపార్టీలు చేరుకున్నాయి. ఒక ఎన్నికల్లో తెలుగుదేశంతోనూ, మరో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసే దుస్థితికి దిగజారాయి. అందుకే కమ్యూనిస్టుపార్టీలు తోక పార్టీలుగా మిగిలిపోయాయి. ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటారో, ఎందుకు విడిపోతారో తెలియని అయోమయ స్థితిలో కమ్యూనిస్టు పార్టీలు కూరుకుపోయాయి. ప్రజాపోరాటాలంటే ఆ పార్టీ కార్యకర్తలు మరచిపోయే స్థితికి చేరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజాదరణ ఉన్నప్పటికీ దాన్ని నిలుపుకోవడానికి కమ్యూనిస్టులు సిద్ధంగా లేరు. సి.పి.ఐ, సి.పి.ఎం.లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ పరువును తామే తీసుకుంటున్నాయి.
పుచ్చలపల్లి సుందరయ్య, రాజ్‌బహద్దూర్‌గౌర్, నర్రా రాఘవరెడ్డి, ధర్మభిక్షం, చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి మహోన్నత విలువలు కలిగిన నాయకులు నేడు క మ్యూనిస్టు పార్టీలలో కరువయ్యారు. అమెరికా పేరు వినబడగానే నిద్రలో సైతం సామ్రాజ్యవాదం అంటూ విమర్శలు గు ప్పించే కమ్యూనిస్టు నేతలు అనేకమంది వారి సంతానాన్ని ఉన్నత చదువులకోసం, ఉద్యోగాలకోసం అమెరికాకు పంపుతున్నారు. పిల్లలను చూసి రావాలన్న మిషతో, విహార యాత్రలకోసం నాయకులు తరచుగా వెళ్లేది అదే అమెరికాకే. కమ్యూనిస్టు దేశాలైన చైనా, రష్యా వంటి దేశాలకు వీరు వెళ్లరు. ఏదైనా పార్టీ సమావేశాలు ఉంటే తప్ప.
పేదల కష్టాలు, కన్నీళ్ల గురించి అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే వామపక్ష నేతలు పేదల పక్షాన పోరాటాలు చేసేందుకు ఏ.సి. కార్లలో వస్తారు. పెట్టుబడిదారి విధానంవల్లే పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేసే ఈ నేతలు తమ పార్టీకి చెందిన కొందరు నేతలు పెట్టుబడిదారులుగా మారి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నా నోరుమెదపరు. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగస్తులకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ నిరాహారదీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు తదితర ఆందోళనా కార్యక్రమాలు పార్టీల పక్షాన నిర్వహిస్తున్న సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడంలేదన్న విషయం గుర్తుకు రాకపోవడం శోచనీయం.
నేటితరం కమ్యూనిస్టు నేతలవల్ల దేశం లో క్రమంగా కమ్యూనిస్టులకు ఆదరణ తగ్గుతోంది. ప్రజా ఉద్యమాలను విస్మరించి, ప్రజాసమస్యలను పక్కనపెట్టి ఎన్నికల్లో తమకు మేలుకలుగుతుందని భావించిన సమస్యలపైనే ఉద్యమాలు చేస్తున్నారు. ఓట్లను పెంచుకొని, ఎక్కువ సీట్లను సాధించాలన్న తపనతో ఉద్యమాలు సాగించడంవల్లనే కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడానికి ప్రధాన కారణం. ఇక కమ్యూనిస్టుపార్టీల మధ్య ఐక్యత ఎండమావిలా మిగిలింది. ఇటీవల కాలంలో ఇరుపార్టీల రాష్ట్ర ముఖ్య నేతలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు.
ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ కోతలు, నీటిసరఫరా, కార్మిక కర్షక సమస్యలపై ప్రజల పక్షాన నిలిచి ఆందోళనలతో ప్రభుత్వం మెడలు వంచాల్సిన ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకోవాలన్న ఆరాటంతో రెండు పార్టీలు పాదయాత్రల్లో తీరికలేకుండా తిరుగుతుండగా, మరో రెండు పార్టీలు తెలంగాణ ఉద్యమం పేరు తో ప్రజాసమస్యలను పట్టించుకోలేనంత బిజీగా ఉన్నాయి. సి.పి.ఐ తెలంగాణ ఉద్యమంలో ఆందోళనలు చేస్తుండగా, సి.పి. ఎం. సమస్యలపై ప్రకటనలకే పరిమితం అవుతోంది. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన సమయంలో వామపక్షాలు సాగించిన ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు ప్రజాదరణ పొందింది. కానీ నేడు సర్‌ఛార్జీ, సర్దుబాటుఛార్జీ అంటూ రకరకాల పేర్లతో ప్రతినెలా ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం మోపుతున్నా వామపక్షాలు ఎక్కడా ఉద్యమించిన దాఖలాలు లేవు. ఏప్రిల్ ఒకటినుంచి మరోసారి భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్ర భుత్వం రంగం సిద్ధంచేస్తున్నా అన్ని పార్టీలతోపాటు వామపక్షాలు కూడా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి.
ఉద్యమం చేస్తే తమతో కలిసి వచ్చే పార్టీలు ఎన్ని? దానివల్ల తమ పార్టీలకు కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటి? 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి? అన్న లెక్కలు వేసుకుంటూ వామపక్షాలు కాలం గడుపుతున్నాయి. పైస్థాయి నాయకులు ఉద్యమాలను అటకెక్కించడంతో క్రిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సమస్యలపై వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రజల పక్షాన ఆందోళనలు నిర్వహించి ఆ సమస్యలు కనీసం కొద్దిమేర అయినా పరిష్కారం అయ్యేలా కృషిచేసేవారు. కొన్ని ప్రాంతాల్లో వామపక్ష నాయకులు సెటిల్‌మెంట్లు, పైరవీలు, పో లీస్ కేసులు పరిష్కారంచేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. తమ విషయం పార్టీ అధిష్ఠానంకు తెలిసినా పట్టించుకోకుండా ఉండేందుకు తాము సంపాదించిన దాంట్లో కొంత పార్టీ ఫండ్‌గా జమచేస్తున్నారన్న విమర్శలున్నా యి. నగర శివారు ప్రాంతాలు, జిల్లాల్లో అనేకమంది కమ్యూనిస్టుపార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారు.
ప్రజాసమస్యల పరిష్కారంకన్నా తమ బలం పెంచుకోవాలన్న ఆ పార్టీల ఆరాట ఫలితమే వామపక్షాలు ఉద్యమం బాటను వీడటానికి కారణం. పేదలకు స్వంత గూడు ఏర్పరచాలన్న లక్ష్యంతో గతంలో వామపక్షాలు సాగించిన పోరాటాల ఫలితంగానే అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరుచేసింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో సి.పి.ఐ నిస్వార్థంగా సాగించిన పోరాటం కారణంగానే వికలాంగుల కాల నీ ఏర్పడింది. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసి ఆ స్థలం పేదలకు చెందేలా నాటి కమ్యూనిస్టు నాయకులు కృషిచేసేవారు. కానీ నేడు కమ్యూనిస్టులు చేస్తున్న భూపోరాటాలవల్ల ఎక్కువగా లబ్దిపొందుతున్నది ఆ పార్టీల కార్యకర్తలేనన్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. గుడిసెలు వేసే సమయంలో ఉన్న పేదల పేర్లు పట్టాలు పంపిణీ చేసే సమయంలో ఉండటం లేదు. పేదల పేర్ల స్థానంలో ఆ పార్టీ కార్యకర్తల పేర్లు ఉంటున్నాయి. శామీర్‌పేట మండలంలో రెండేళ్ల క్రితం ఒక కమ్యూనిస్టు పార్టీ జరిపిన భూపోరాటంలో ఆ పార్టీ జిల్లా నాయకుడొకరు బినామీ పేర్లతో స్వంతం చేసుకొని ఆ తర్వాత పేదలకు అమ్ముకొని సొమ్ముచేసుకున్నాడని ఆరోపణలున్నాయి. అయినా ఆ పార్టీ అగ్ర నాయకత్వం పెదవి విప్పకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.
తప్పిదాలు సహజమే అయనా తక్షణమే సరి దిద్దుకోవాలి. మళ్ళీ వాటిని చేయ కూడదు. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ లు తమ అంతర్గత విబేధాలను, సీట్లకోసం ఆరాటాన్ని వదిలిపెట్టి ప్రజాఉద్యమాలు సాగించకపోతే అది వారుచేసే చారిత్రక తప్పిదమవుతుంది. ఈ తప్పిదానికి ఏ పాతికేళ్ల తర్వాతో ప్రజలకు క్షమాపణలు చెప్పినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆ పార్టీల ఉనికి చరిత్ర పుస్తకాలకే పరిమితమవుతుంది.