ఇండియన్ పీనల్ కోడ్ 1860, సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నానికి ఒక ఏడాది స్వల్ప కారాగారవాసం లేదా ఫైన్ లేదా రెండూ విధించే అవకాశం వుంది. ఆత్మహత్య మహాపాతకాలలో ఒకటిగా తమ జీవితాలను తామే అంతం చేసుకోవాలని చేసే ప్రయత్నం నేరంగా పరిగణింపబడుతూ, చట్టప్రకారం నేరస్థులకు శిక్ష ప్రసాదిస్తోంది. జీవించే హక్కును ప్రసాదించిన రాజ్యాంగం బలవన్మరణాలను అరికట్టడానికి ఆత్మహత్య, నేరంగా శిక్షించే న్యాయం అందిస్తోంది. 1971నాటికే లా కమిషన్ ఆఫ్ ఇండియా, సెక్షన్ 309 రద్దుచేయవలసినదిగా సిఫార్సుచేసింది. 2008నాటికి 210వ నివేదికలో లాకమిషన్, ఆత్మహత్యా ప్రయత్నాన్ని నేరంగా పరిగణించవద్దని మళ్ళీ సూచించింది. వ్యక్తిగత అనుభవాలు, మానసిక విశే్లషణ, సాంఘిక, కుటుంబ సాంస్కృతిక వాతావరణ ప్రభావం, జన్యు సంబంధిత అనారోగ్య ఇతర సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే నిస్సహాయులను బతికించేవిధంగా ప్రోత్సాహం, అవకాశాలు, మద్దతు యివ్వాలని ప్రభుత్వ సంకల్పం. సెక్షన్ 306, ఆత్మహత్యలకు పురికొల్పేవారిపై చర్యలుతీసుకొనే అవకాశంకూడా కల్పిస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడే ఉద్రిక్త మానసిక ఉద్విగ్నతలో చట్టం శిక్షిస్తుందని భయపడే అవకాశం లేనందున సెక్షన్ 309 కేవలం ఆత్మహత్యలను అరికట్టలేదని స్పష్టవౌతోంది. పైగా వారిని నేరస్థులుగా పరిగణించి శిక్షలు విధించటం డబుల్ పనిష్‌మెంటు అవుతోంది. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలలో ఆత్మహత్యలను నేరంగా పరిగణిస్తున్నాయ. ఏదిఏమైనా ఆత్మహత్య మానసిక రుగ్మత. అది నేరం కాదు, నయం చేసే చికిత్స యివ్వాలి కానీ శిక్ష కాదు.
శాంతి, అహింసాప్రవక్తగా మాతృదేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ సత్యాగ్రహోద్యమానికి సారధ్యం వహించారు. ఆమరణ నిరాహారదీక్షను మహాత్ముడు ఎన్నడూ బ్రిటిష్ వారిని, సాధించటానికి రాజకీయ ఆయుధంగా ఉపయోగించలేదు. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యంలోని ఉపవాస విధానాన్ని, ప్రాయశ్చిత్త ఆత్మప్రక్షాళనకు సంబంధించిన తపోదీక్షగా గాంధీజీ నిరాహారదీక్షలు అనుసరించారు. 1924లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్‌లో, 1932 కమ్యునల్ అవార్డు వ్యతిరేకిస్తూ, 1933 అస్పృశ్యతపై, జరిపిన సత్యా గ్రహాలన్నీ మత విద్వేషం వంటి సామాజిక రుగ్మతలను నిరసిస్తూ చేపట్టినవే. ముఖ్యంగా సత్యాగ్రహికి ఆఖరి ఆయుధం నిరాహారదీక్షగా ఆచరించారు. 1923 సెప్టెంబరు 13న లాహోర్ జైలులో 63రోజుల ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణత్యాగం చేసిన జతిన్‌దాస్ బ్రిటిష్ ప్రభుత్వంపై రాజకీయ ఖైదీల సంక్షేమంకోసం జైలులో పోరాడిన త్యాగశీలి. స్వాతంత్య్రానంతరం ఆంధ్ర రాష్టస్రాధనలో పొట్టిశ్రీరాములు అమరులయ్యారు. స్వతంత్ర భారతదేశంలో మేథాపాట్కర్, అన్నాహజారే వంటి త్యాగధనులు ఎందరో నిరంతరం, నిరాహారదీక్ష ఆయుధంగా శాంతియుత ప్రజా పోరాటం కొనసాగిస్తున్నారు. మణిపురీ మహిళ ‘ఐరమ్ చాను షర్మిల’, సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం (ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ) రద్దుకోరుతూ 12 సంవత్సరాల ఆమరణ నిరాహారదీక్షను, జైలులో కూడా కొనసాగించటం ద్వారా మహాత్ముని ఆశయ జ్యోతిని నేడూ వెలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమె చేపట్టిన ఆమరణ దీక్షను ఆత్మహత్యాయత్నంగా భావించి అరెస్టుచేయటం, జైలు నిర్బంధంలో బలవంతంగా ముక్కుగొట్టాల ద్వారా ద్రవాహారాన్ని అందించి ఆమెను చావుబతుకుల మధ్య ఏళ్ళతరబడి కొట్టుమిట్టాడే దుస్థితి కల్పించటం బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో నాడు లాహోర్ జైలులో ఖైదీ జతిన్‌దాస్ పట్ల వ్యవహరించిన తీరుతెన్నులను గుర్తుచేస్తోంది. ప్రస్తుత స్వతంత్ర ప్రజాస్వామ్య పాలన, ఆత్మహత్యలకు, ఆమరణ నిరాహారదీక్షలకు మధ్యవున్న అంతరార్ధాన్ని గ్రహించి, శాంతియుత ఆందోళనలను ఉపశమింపచేసే సక్రమ కార్యాచరణ చేపట్టాలి.
ఇండియన్ పీనల్ కోడ్ 1860, సెక్షన్ 309 ప్రకారం
english title:
n
Date:
Monday, March 25, 2013