గుంటూరు, మార్చి 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందనే వాదన కేవలం ఎండమావేనని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరం ఆవరణలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పి పూర్ణచంద్రరావు అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజాచైతన్య సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మమతా బెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, చంద్రబాబు నాయుడు, మాయావతి వంటివారు తృతీయ ఫ్రంట్‌గా రూపుదాల్చి కేంద్రంలో చక్రం తిప్పుతారనేది కల్ల అన్నారు.
కొందరు రాజకీయ పార్టీల నాయకులు మతగ్రంథాలు చేతపట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం తగదన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మత మార్పిడులను నిషేధించే చట్టం తెస్తామని, విదేశీ మతాల ప్రచారాన్నీ అడ్డుకుంటామని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రస్తుతం దేశంలో అసమర్థ ప్రధానిగా మన్మోహన్‌సింగ్ పేరొందారని, అధికారమంతా సోనియా చలాయిస్తోందని విమర్శిస్తూ ఆమె కనుసన్నల్లో ప్రధాని పనిచేయడం దేశప్రజల దురదృష్టమన్నారు. గతంలో దేశంలోకి ఎఫ్‌డిఐల అనుమతికి నిరాకరించిన మన్మోహన్‌సింగ్ ప్రధాని అయ్యాక ఎఫ్‌డిఐలను యథేచ్ఛగా అమలు చేయడం వెనుక సోనియా హస్తం ఉందని ఆరోపించారు. తీవ్రవాదం, నక్సలిజం, వేర్పాటువాదం తీవ్రరూపం దాల్చాయని, హైదరాబాద్‌లో మతోన్మాదులను పెంచి పోషించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని దుయ్యబట్టారు. 25లక్షల కోట్ల నల్లధనాన్ని 100 రోజుల్లో బయటకు తీస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దానిగురించి పట్టించుకోక పోవడాన్ని చూస్తే అవినీతికి ఎలా కొమ్ముకాస్తుందో అర్థమవుతుందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ రాష్ట్రం దేశంలోనే ప్రథమంగా నిలిచేవిధంగా కృషిచేసిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సదస్సులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* బిజెపి నేత వెంకయ్య నాయుడు
english title:
third front
Date:
Tuesday, March 26, 2013