రాజమండ్రి, మార్చి 25: ‘కాంగ్రెస్ పార్టీ ముసలి దున్నపోతు..పిల్ల కాంగ్రెస్ కుర్ర దున్నపోతు. ఇప్పటికే ఒకసారి ప్రజలు ముసలి దున్నపోతుకు గడ్డి వేసి పాలు లేక బాధలు పడుతున్నారు. కాళ్లతో కుమ్ముతూ, కొమ్ములతో పొడుస్తోంది. మళ్లీ కుర్ర దున్నపోతుకు గడ్డి వేస్తే మరింత దారుణంగా కుమ్ముతుంది. పాడి గేదె లాంటి తెలుగుదేశం పార్టీకి గడ్డి వేస్తేనే ప్రజలకు పాలు లభిస్తాయి. దున్నపోతుకు గడ్డి వేస్తారో, పాడి గేదెలాంటి తెలుగుదేశం పార్టీకి గడ్డి వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ఆదివారం ఒక రోజు విరామం తరువాత సోమవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ఏడిదగ్రామం నుండి వస్తున్నా మీ కోసం పాదయాత్రను ప్రారంభించారు. మండపేట చేరుకోవటానికి ముందే ఆయన 2500 కిలోమీటర్లు పూర్తిచేశారు. మండపేటలో టిడిపి పైలాన్‌ను బాబు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలన్నారు. ఇప్పటికే బాగా బలిసి ఉన్న కుర్ర దున్నపోతు పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. టిడిమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, కౌలు రైతులకు కూడా రుణ మాఫీని వర్తింపచేసి, వారికి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. కౌలు రైతుల రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందన్నారు. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మద్యాన్ని నియంత్రిస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బిసి, అగ్రవర్ణాలకు చెందిన పిల్లలను ఉచితంగా చదివించి, ఉద్యోగాలు వచ్చే వరకు చదువును బట్టి, నెలకు కొంత మొత్తాన్ని అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కారణంగా సుఖపడాల్సిన సమయంలో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. తన ఆస్తులు ఏమిటో ప్రజల ముందుంచానని, దమ్ముంటే పిల్ల కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులను బయటపెట్టాలని చంద్రబాబు సవాల్ విసిరారు.
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలిచ్చే విధంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఒక కార్యకర్త లేచి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలివ్వటం లేదని చెప్పినపుడు బాబు స్పందించారు. ప్రస్తుతం ఇలాంటి విధానం ఏదీ రాష్ట్రంలో లేదని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత అలాంటి విధానాన్ని రూపొందిస్తామని అన్నారు. విద్యార్థుల్లో తమ భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు చేయాలని భావిస్తుంటే, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ పట్ల సరయిన అవగాహన ఉండటం లేదన్నారు. అందువల్ల పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల్లో కెరీర్ పట్ల అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని అమలుచేస్తామన్నారు. మాలలకు ఎక్కువ అన్యాయంచేసింది రాజశేఖర్‌రెడ్డేనని ఆరోపించారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ముందు వెనుకటి తరాలను చూసి, మంచి చెడులను బేరీజు వేసుకున్న తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. నిత్యావసర సరుకులను డోర్‌డెలివరీ చేయిస్తే అక్రమాలు తగ్గుతాయని, వృద్ధులకు ఎంతో మేలు కలుగుతుందన్న సూచన పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ సూచనను పరిగణలోకి తీసుకుంటున్నామని, ఎలా అమలుచేస్తే బావుంటుందో పరిశీలించి విధానాన్ని రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నడుస్తోందని, ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇంట్లో పనులను కొడుకులు లేదా భార్యలకు అప్పగించి పూర్తి సమయం పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
కౌలు రైతులకిచ్చే రుణాలకు ‘దేశం’ ప్రభుత్వమే గ్యారంటీ *2500 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర
english title:
chandra babu
Date:
Tuesday, March 26, 2013