వేంపల్లె, మార్చి 25: కడప వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటిలోని కెఎంకె పి1 పి2 మెస్‌లలో కలుషిత ఆహారం తిని 217 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురవడంతో వెంటనే ప్రాంగణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ఇందులో 40 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆక్సిజన్ ఇచ్చి పర్యవేక్షిస్తున్నారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమించడంతో కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రఘునాథరెడ్డి విచారణ చేపట్టారు. వివరాలిలావున్నాయి. మొదటి నుండి కెఎంకె మెస్‌లలో అందించే ఆహారంలో నాణ్యతపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. ఈ మెస్‌లో దాదాపు రెండు వేల మంది భోజనం చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఆహార నాణ్యతపై నిలదీస్తే సిబ్బంది వారిపై ఆగ్రహం వక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థుల్లో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన ఆ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీనితో విద్యార్థులంతా సోమవారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని బహిష్కరించారు. దీనితో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థులకు అందించిన ఆహారం నమూనాలను సేకరించారు. ఇందులో లోపాలు కనిపిస్తే మెస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో వెల్లడించారు. విద్యార్థులకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మెస్‌లో ఉన్న రా మెటీరియల్‌ను, వండిన పదార్థాలను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ యల్లమ్మ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు భోజనాన్ని బహిష్కరించడంతో ట్రిపుల్ ఐటి డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ సభ్యులు అత్యవసరంగా సమావేశమై చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ కృష్ణారెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు.
(చిత్రం) చికిత్సపొందుతున్న విద్యార్థులకు అధికార్ల పరామర్శ
* 217 మంది విద్యార్థులకు అస్వస్థత
english title:
iiit
Date:
Tuesday, March 26, 2013