విజయవాడ, మార్చి 25: కోస్తా ఆంధ్రలో అతిపెద్ద వాణిజ్య కూడలి విజయవాడలో గత 16రోజులుగా నూతన వస్త్రం దొరకటం దుర్లభవౌతోంది. అవసరానికి ఎక్కడైనా రెడీమేడ్ దుస్తులు కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది. వ్యాట్ రద్దుకు వ్యాపారులు చేపట్టిన ఆందోళన అటు కార్మికులను, ఇటు వస్త్ర వినియోగదారులను ఇబ్బందులపాలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)కు నిరసనగా రాష్టవ్య్రాప్తంగా వస్త్ర వ్యాపారులు ఆరంభించిన నిరవధిక బంద్ ప్రభావం నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలున్న వస్తల్రత, కృష్ణవేణి హోల్‌సేల్ మార్కెట్, సత్యనారాయణపురం, ఒన్‌టౌన్, పటమట, ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 2వేలకు పైగా రిటైల్, హోల్‌సేల్ వస్త్ర దుకాణాలు గత 16రోజులుగా మూతబడ్డాయి. దీనివల్ల రోజుకు కనీసం 100 కోట్ల రూపాయల టర్నోవర్ స్తంభించిపోవటంతో వ్యాపారులు కనీసం కోటి రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతున్నారు. వస్త్ర దుకాణాలు బంద్ కావటం వల్ల వేలాది మంది సిబ్బంది జీతాలు అందక డీలాపడ్డారు. ఎగుమతి, దిగుమతుల్లేక హమాలీలకు పనిలేకుండా పోయింది. సాధారణ రోజుల్లో ముఠా కూలీలు ఒక్కో బండిల్‌పై 15రూపాయల చొప్పున సంపాదిస్తారు. ఇలా కూలీలు రోజుకు కనీసం 10 లక్షల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు. వస్త్ర అమ్మకాలు లేకపోవటంతో వాటిపై ఆధారపడ్డ దర్జీలు, గుండీలు కుట్టేవారు, ఇస్ర్తి చేసేవారు ఇలా నగరంలో దాదాపు 5వేల మంది ఖాళీగా ఉండిపోవాల్సి వస్తోంది. దారపు ఉండలు, గుండీలు, ఇతరత్రా సామగ్రి విక్రయించే చిన్నాచితకా షాపులు సైతం మూతబడ్డాయి. వ్యాట్‌పై 16 రోజులుగా నిరవధిక బంద్ జరుగుతున్నా ప్రభుత్వం నేటివరకు చర్చలకు పిలవకపోవటంపై నిప్పులు చెరుగుతున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పన్ను అమల్లోకి రాబోతుండగా ఈలోపు వ్యాట్ ఎందుకని వస్త్ర వ్యాపారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చు నరసింహరావు, వ్యాట్ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 28న రాజమండ్రిలో జరిగే కీలక సమావేశంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే నిర్ణయాలు తీసుకోటానికి వస్త్ర వ్యాపారులు సమాయత్తవౌతున్నారు.
2వేల దుకాణాల్లో 16రోజులుగా అమ్మకాలు బంద్ * రోజుకు 100 కోట్ల టర్నోవర్ స్తంభన ఉపాధి కోల్పోతున్న వేలాది మంది కార్మికులు * 28న రాజమండ్రి మహాగర్జనలో తాడోపేడో
english title:
cloth merchants
Date:
Tuesday, March 26, 2013