ఒంగోలు, మార్చి 25: ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లాజడ్జి ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య జరిగిన ఘర్షణలో చల్లా సాంబశివరావు (32) అనే అటెండర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సుమారు 1.30 సమయంలో జరిగింది. ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సూర్యనారాయణ అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చీమకుర్తికి చెందిన చల్లా సాంబశివరావు, మార్కాపురానికి చెందిన తుంబేటి వెంకటేశ్వర్లు (35) అనే అటెండర్లు జిల్లా జడ్జి ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తున్నారు. వీరిరువురూ ఆదివారం రాత్రి జడ్డి వద్ద పనిని ముగించుకొని జడ్జి బంగళాకు బయట ఉన్న ఒక రూంలో నిద్రపోయారు. తుంబేటి వెంకటేశ్వర్లు అనే అటెండర్‌ను జడ్జి బంగళా నుండి కోర్టుకు బదిలీ చేశారన్న విషయంపై మృతుడు చల్లా సాంబశివరావు మరో అటెండరైన వెంకటేశ్వర్లు మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగినట్లు సిఐ తెలిపారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తుంబేటి వెంకటేశ్వర్లు ఇనుప రాడ్‌తో సాంబశివరావుతలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు సిఐ తెలిపారు. వెంకటేశ్వర్లు అక్కడి నుండి బయటకు వెళ్ళి ఒక కాయిన్ బాక్స్ నుండి డ్యూటీలో లేని మరో అటెండర్ కొండలరావుకు ఫోన్ చేసి అటెండర్ సాంబశివరావుకు కరెంట్‌షాక్ కొట్టడంతో మృతి చెందాడని, వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను తీసుకు రావాలన్నాడు. దీంతో అటెండర్ కొండలరావు జడ్జి ఇంటికి వచ్చి చూడటంతో అప్పటికే సాంబశివరావు మృతిచెంది ఉండటాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈలోగా జిల్లాజడ్జి కూడా బయటకు వచ్చి ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావంటూ కొండలరావును ప్రశ్నించినట్లు తెలిపారు. కొండలరావు జరిగిన విషయాన్ని జడ్జికి వివరించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు.
- ఒకరి మృతి -
english title:
one killed
Date:
Tuesday, March 26, 2013