కోల్‌కతా, మార్చి 28: దివాన్ హౌసింగ్ (డిహెచ్‌ఎఫ్‌ఎల్)కు అనుబంధ సంస్థ అయిన డిహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యా హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీరేట్లను 0.2- నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ తగ్గింపుఅమలులోకి వస్తుంది .‘గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తున్న తొలి సంస్థ మాదే. మేం ఇప్పుడున్న వినియోగదారులకు, కొత్తవారికి గృహరుణాలపై వడ్డీరేట్లను 0.2 శాతం తగ్గిస్తాం.ప్రాధాన్యత రంగానికి చెందిన గృహపథకాలకు 10 లక్షల వరకు రుణంపై 0.3 శాతం రిబేటు ఉంటుంది’ అని డిహెచ్‌ఎఫ్‌ఎల్ వైశ్యా హౌసింగ్ ఎండి ఆర్ నంబిరాజన్ తెలిపారు. కొత్త పథకం ప్రకారం, 10 లక్షల రూపాయల వరకు 11 ఏళ్లపాటు రుణంపై వడ్డీరేటు 0.5 శాతం తగ్గింపు ఉంటుంది.
దీని ప్రకారం 2013.14 సంవత్సరంలో మా వ్యాపారం దాదాపు 50 శాతం పెరగవచ్చునని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గృహరుణాలు 345 కోట్ల రూపాయలు ఉంటుందని వచ్చే ఏడాదికి ఇది పెరిగి 520 కోట్లకు చేరవచ్చునని ఆయన తెలిపారు.
అదేబాటలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
న్యూఢిల్లీ, మార్చి 28: ఈ నెల 30 నుంచి రుణాలపై వడ్డీరేట్లను 0.1 శాతం వంతున తగ్గించాలని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిర్ణయించింది. దీంతో కనీస వడ్డీరేటు ప్రస్తుతం ఉన్న 9.7 శాతం నుంచి 9.6 శాతం ఉంటుంది. బిపిఎల్‌ఆర్‌కు కూడా తగ్గింపు వర్తించడంతో అది 18.10 శాతం ఉంటుంది. ఆర్‌బిఐ మార్చి 19న నిర్వహించిన ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు తగ్గించిన తర్వాత రుణాలపై వడ్డీరేట్లను తగ్గించిన తొలి బ్యాంక్ అని ప్రకటించింది.