విశాఖపట్నం, మార్చి 28: స్వయం సహాయ సంఘాలకు మొబైల్ ఫోన్లద్వారా విస్తృత సేవలందించే సంచార శక్తి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్లు మరియు ఐటి శాఖల సహాయ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. రాష్ట్రం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ప్రాజెక్టుగా ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేసేందుకు నిర్ణయించినట్టు గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సంక్షిప్త సమాచారం రూపంలో మొబైల్ ఫోన్లద్వారా ఈసేవలు అందుతాయని తెలిపారు. మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు, ఆరోగ్య, సాంఘిక అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, వాతావరణ వివరాలు మహిళలకు మొబైల్ ఫోన్లద్వారా అందించడమే ఈపథకం ముఖ్యోద్దేశమని ఆమె తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 కోట్ల రూపాయల వ్యయంతో 227 సెల్‌టవర్లను ఏర్పాటు చేయనున్నామని, శ్రీకాకుళం జిల్లాలో నూరుశాతం గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సేవలు నిరంతరాయంగా అందేందుకు పైలెట్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. వన్‌నేషన్ వన్‌మొబైల్ నినాదంతో దేశవ్యాప్త ఉచిత రోమింగ్ సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని, వచ్చే మూడునెల్లలో ఈప్రతిపాదన కార్యరూపం దాల్చనుందని తెలిపారు. 2020 నాటికి ఐటి ఎగుమతులను 20 లక్షల కోట్ల రూపాయలకు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రెండు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో మరో రెండు ఎలక్ట్రానిక్ మేన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. 50 శాతం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంలో ఏర్పాటయ్యే క్లస్టర్ల ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వం ఎపిఐఐసి ద్వారా అవసరమైన స్థలాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వచ్చే జూన్ నుంచి రాష్ట్రంలో మొబైల్ మనీఆర్డర్ సేవలను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. అరసవల్లి, శ్రీకూర్మం పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఉగాది సందర్భంగా ప్రత్యేక తపాలాబిళ్ళలను విడుదల చేయనున్నట్టు ఆమె తెలిపారు.
గడపగడపకు పౌర సేవలు
గడపగడపనకు పౌర సేవలందించేందుకు ఇ-గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోనే పథమంగా విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలోని తానాం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కృపారాణి ఈ ప్రాజెక్ట్ పని తీరును గురువారం పరిశీలించారు. తానాం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన చేసిన ఇ-పంచాయతీ సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఇ-గవర్నెన్స్ విధానంలో సమాచార వ్యవస్థను సమాంతరంగా ప్రవేశ పెట్టారన్నారు. పలు పంచాయతీల కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
* కేంద్ర సహాయ మంత్రి కృపారాణి
english title:
krupa rani
Date:
Friday, March 29, 2013