అమలాపురం, మార్చి 28: దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో ఓఎన్జీసీ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతోందని ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ వాసుదేవా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో గల ములికిపల్లి 1 బావి వద్ద ఒఎన్‌జిసి, కెఆర్‌పిఇఎల్ సంస్థ భాగస్వామ్యంతో పరిమిత క్షేత్రాల నుండి గ్యాస్ ఉత్పత్తి, అమ్మకాలను సిఎండి వాసుదేవా గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే త్రిపురలో 726 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధమైందన్నారు. రెండవ దశ ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యధిక గ్యాస్ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా మూతపడిన క్షేత్రాల్ని మళ్లీ తెరిపించి, వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామన్నారు. జైసల్మార్‌లో ఈ తరహాలో మొట్ట మొదటి గ్యాస్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయగా, రెండవది కేజీ బేసిన్‌లోని పొన్నమండలో ఏర్పాటుచేశామన్నారు. ఈ ప్రాజెక్టు నుండి 8 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. కెజి బేసిన్ పరిధలో మరో ఐదు బావులను తవ్వవలసి ఉందన్నారు. ఒఎన్‌జిసి తన మొత్తం లాభంలో రెండు శాతం సిఎస్‌ఆర్ కార్యక్రమాలకు అందిస్తోందని ఆయన తెలిపారు.
*ఓఎన్జీసీ సిఎండి సుధీర్ వాసుదేవా
english title:
ongc
Date:
Friday, March 29, 2013