హైదరాబాద్, మార్చి 29: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే తెలుసా? అని చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రశ్నించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోరుతూ టిడిపి ఎమ్మెల్యేల బృందం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ ఆవరణలో సాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారానికి నాలుగవ రోజుకు చేరుకుంది. కొంతమంది ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు, ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచించారు.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం దీక్షా శిబిరాన్ని సందర్శించిన చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజాస్వామ్యం అంటే తెలుసా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే తెలిస్తే, ప్రజాస్వామ్య యుతంగా దీక్ష జరుపుతున్న ఎమ్మెల్యేలను పరామర్శించి వారి డిమాండ్లను పరిష్కరించే వారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల దీక్ష పట్టదు,ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి, అక్కడ సరైన సమాధానం రాకపోవడం, సమస్య పరిష్కారం కాకపోవడం వల్లనే దీక్ష జరుపుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు కొత్త డిమాండ్లు ఏమీ చేయడం లేదని, విద్యుత్‌పై ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఏం చెప్పిందో దాన్ని అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నట్టు తెలిపారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మిగులు విద్యుత్ ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేక పంటలు ఎండుతున్నాయి, పరిశ్రమలు మూత పడుతున్నాయని అన్నారు. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని లోకేశ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే దిగిరావాలని, డిమాండ్లు ఆమోదించి, ఎమ్మెల్యేల దీక్ష విరమింపజేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఉద్యమాన్ని ఉధృతం చేయాలి: రాఘవులు
దీక్ష జరుపుతున్న టిడిపి ఎమ్మెల్యేలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదనలను ఉప సంహరించుకునేంత వరకు ఉద్యమిస్తామని అన్నారు.
పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణించినట్టు డాక్టర్లు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఎంపిలు సిఎం రమేష్, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, సీతక్క, ఉమా మహేశ్వర్‌రావుల ఆరోగ్యం క్షీణించింది. షుగర్ లేవల్స్ పడిపోవడం వల్ల పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణించినట్టు డాక్టర్లు తెలిపారు. స్పీకర్ అనుమతితో ఎమ్మెల్యేలను ఏ క్షణంలోనైనా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉందని టిడిపి ఎమ్మెల్యేలు తెలిపారు.
నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు శుక్రవారం సంఘీభావం తెలుపుతున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్.