హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో త్వరలో నాలుగు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు, శ్రీకాకుళంలో ఒక సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఐటి శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి ప్రకటించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి, రంగారెడ్డి జిల్లాలో రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. 2020 నాటికి దేశంలో ఐటి రంగంలో 20 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్, మూడు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్లు ఆమె చెప్పారు. శుక్రవారం ఇక్కడ ఐటి రంగంలో పరిస్థితులు అనే అంశంపై ఫ్యాప్సీ నిర్వహించిన జాతీయ సదస్సును ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్-రంగారెడ్డిలో ఐటి పెట్టుబడుల ప్రాంతాన్ని 202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఐటి రీజియన్‌కు వచ్చే 12 సంవత్సరాల్లో 2.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 15 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. గత ఏడాది దేశం నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల ఐటి ఉత్పత్తులను ఎగుమతి చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్ రంగంలో రెండు వేల మంది పిహెచ్‌డిలను నియమించి పరిశోధన రంగాన్ని బలోపేతం చేస్తామని, దీనికోసం ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే వచ్చే రెండేళ్లలో 2.5 లక్షల గ్రామాలను ఐటితో అనుసంధానం చేసేందుకు 20 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రంలో ఒక డాటా సెంటర్ ఏర్పాటు 1,400 కోట్ల రూపాయలను ఖర్చుచేశామన్నారు. ఆధార్ కార్డుల వల్ల ఐటి రంగం బలోపేతమవుతుందని, 2014 నాటికి 60 కోట్ల మందికి ఈ కార్డును జారీ చేస్తామన్నారు.
దేశంలో 93 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, ఈ ఫోన్ల ద్వారా ఇ గవర్నెన్స్‌లో సంచలనమైన మార్పులను సాధిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా ఆరువేల కోట్ల రూపాయలతో ఒక లక్ష కామన్ సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 53 వేల కోట్ల రూపాయల ఐటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, 3.5 లక్షల మంది ఐటి రంగంలో ఉద్యోగం చేస్తున్నారన్నారు. 2020 నాటికి 400 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు మన దేశం నుంచి ఉత్పత్తి చేస్తామన్నారు. ఫ్యాప్సీ అధ్యక్షులు దేవేంద్ర సురానా మాట్లాడుతూ వచ్చే నాలుగు సంవత్సరాల్లో దేశీయ ఐటి రంగం సాలీనా 12 శాతం వృద్ధిరేటు నమోదు చేయనున్నట్లు చెప్పారు.
ఈ సదస్సులో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సంజయ్ జాజూ, ఫ్యాప్సీ సెక్రటరీ జనరల్ ఎంవి రాజేశ్వరరావు, సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ అయ్యదేవర, ఫ్యాప్సీ ఐటి కమిటీ చైర్మన్ డాక్టర్ అశోక్ కుమార్ కెడియా పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో శుక్రవారం ఫ్యాప్సీ జాతీయ సదస్సును ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కృపారాణి