నిర్మల్, మార్చి 29: పోలీసులు అనగానే ప్రజల్లో ఓ రకమైన అపోహ ఏర్పడుతోందని, అటువంటి అపోహలకు తావులేకుండా ప్రజలతో పోలీసులు సత్సంబంధాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. శుక్రవారం నిర్మల్ సబ్ డివిజనల్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిర్మల్ పోలీస్ సబ్ డివిజనల్ పరిధిలోని పోలీసుల పనితీరు తదితర అంశాలపై చర్చించడం జరిగిందని అన్నారు. నేరాల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు ప్రజా సమస్యలపై కూడా పోలీసులు దృష్టి సారించి పరిష్కారానికి తమవంతు కృషి చేయాలన్నారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్‌లను ఏర్పాటుచేస్తున్నామని, కేంద్రాల్లో మహిళా కానిస్టేబుళ్ళను నియమించడం జరుగుతుందన్నారు. దీంతో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను రిసెప్షన్ కేంద్రాల్లో వివరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజలు వివిధ సమస్యలు, వివాదాలపై ప్రతినిత్యం పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోందని, అయితే పోలీసులే నేరుగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలతో సమావేశాలను ఏర్పాటుచేసి అక్కడికక్కడే పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరిస్తూ వివాదాల జోలికి వెళ్ళకుండా వారిని చైతన్యం చేసేందుకు కృషిచేయాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్, దొంగతనాల నియంత్రణపై దృష్టి సారించాలని సమావేశంలో సూచించినట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యతో పోలీసు శాఖకు సంబంధం ఉంటుందని, తద్వారా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులే ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు సైతం చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అన్నారు. రాత్రివేళల్లో గస్తీ బృందాలను పెంచడంతోపాటు ఇళ్ళకు తాళాలు వేసి ఎటైనా వెళ్ళాల్సిన అవసరం వస్తే పక్కింటివారికి చెప్పడంతోపాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నిర్మల్ డీఎస్పీ వి.శేష్‌కుమార్, సీఐలు బీఎల్‌ఎన్ స్వామి, రఘు, వేణుగోపాల్ పాల్గొన్నారు.
* జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
english title:
tripathi
Date:
Saturday, March 30, 2013