దివ్యనగర్, మార్చి 29: రేషనలైజేషన్(క్రమబద్ధీకరణ) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసి పాఠశాలలను మూసివేయాలని చూడడం తగదని టీయూటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని టీ ఎన్‌జీ ఓ కార్యాలయంలో జరిగిన టీయూటీ ఎఫ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదిలోపు విద్యార్థులుంటే పాఠశాలలు మూసివేస్తామని పేర్కొనడాన్ని ఆయన తప్పు పట్టారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు పనిచేయడం కొరకు నూతన పోస్టులు సృష్టించవలసి ఉంటుందన్నారు. వీటిని తక్కువ చేయడం కొరకు చట్టంలో లేని విధానం ప్రకారం పిల్లలు లేరనే సాకుతో రాష్ట్రంలో మూడువేలకు పైగా పాఠశాలలు మూసివేసి అక్కడి విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించి ఇతర గ్రామాలకు చేరవేస్తామని చెప్పడం సంశయం కాదన్నారు. విద్యార్థులున్న చోటుకు ఉపాధ్యాయులను పంపి పాఠశాలలు మూసివేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. పీఆర్సీ గడువును ఆరు నెలలకు కుదించాలని డిమాండ్ చేశారు. వీవీలను ఏప్రిల్ 24 వరకు కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి.దేవన్న, వెంకటరమణారెడ్డి, మురళీ మనోహర్‌రెడ్డి, ధర్మరాజ్, సాహెబ్‌రావు, రఘువీర్‌పాణి, రవికిరణ్, కిషన్, రవికాంత్, సాయారెడ్డి, నారాయణ, పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యారంగం అభివృద్ధిలో శిశు మందిరాలదే కీలక పాత్ర
* పిఓ మహేష్
ఉట్నూరు, మార్చి 29: విద్యాభివృద్దితోపాటు సంస్కృతి, సంప్రదాయాల రక్షణ కోసం సరస్వతీ శిశు మందిరాలు చేస్తున్న కృషి అమోఘమని ఐటిడిఎ పిఓ మహేష్ అన్నారు. శుక్రవారం శిశుమందిర్ హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించగా పిఓ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నుండి ఆశించకుండా సరస్వతీ శిశు మందిరాలు అందులో పని చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు మాతృభాషలో బోధించడం గర్వించదగ్గ విషయమన్నారు. కొంతమంది ఏ మాత్రం కృషి చేయకుండానే ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారన్నారు. శిశుమందిర్ ఉపాధ్యాయులు 3 వేల నుండి 6 వేల రూపాయల లోపే వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా విద్యాబుద్దులు నేర్పుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రభాకర్‌రెడ్డి, సరస్వతీ విద్యాపీఠం క్షేత్ర సంఘటన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి పసర్తి మల్లయ్య పాల్గొన్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాలలు
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్దులు నేర్పేందుకు 200 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని సరస్వతీ విద్యాపీఠం క్షేత్ర సంఘటన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. సరస్వతీ శిశు మందిరాలు మాతృభాషకు ప్రాముఖ్యతనిస్తూ విద్యాబోధన జరుగుతుందన్నారు. శిశు మందిరాల్లో ఎంతో మంది విద్యార్థులు తక్కువ ఫీజుతో విద్యాబుద్దులు నేర్చుకుంటున్నారన్నారు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా 400 పాఠశాలలు పని చేస్తున్నట్లు తెలిపారు. విద్యారంగ సంస్థను అభివృద్ధి చేయడానికి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష, 6వ తరగతి నుండి ఇంగ్లీష్ భాషను బోధిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య, నాగాచారి పాల్గొన్నారు.