ఆదిలాబాద్, మార్చి 29: జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ కళాశాలలో (రిమ్స్) రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆసుపత్రి గదుల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతపై ఎమ్మెల్యే జోగు రామన్న ఆగ్రహంవ్యక్తం చేశారు. రిమ్స్‌లో కొందరు సిబ్బంది, డాక్టర్లు, సర్జన్లు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తూ రోగుల బాధలను పట్టించుకోవడం లేదని అసంతృప్తివ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుండా సొంత మనుగడ కోసం రాజకీయాలు చేసే వారు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. రిమ్స్‌లో వైద్యుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే జోగు రామన్న ఉదయం 3 గంటల పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అలజడి రేపారు. వివిధ వార్డులను కలియ దిరుగుతూ రోగుల ఇబ్బందులను స్వయంగా ఆరాతీశారు. విధులకు ఢుమ్మా కొడుతూ రాజకీయాలు చేస్తున్న డాక్టర్లు, ప్రొఫేసర్లు తమ ప్రవర్తన మార్చుకొని రోగులకు సేవలు అందించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఇటీవల డైరెక్టర్ రవీందర్‌రెడ్డిని తొలగించాలని కోరుతూ ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బంది, మరి కొందరు ప్రొఫేసర్లు ఆందోళన చేసిన నేపధ్యంలో జోగు రామన్న స్వయంగా పరిస్థితులను ఆరాతీసి సిబ్బంది, వైద్యుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని బాగుపర్చాలనే ఉద్దేశ్యం వుంటేనే ఇక్కడ వుండాలని, లేని పక్షంలో రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి పోవాలని సూచించారు. రిమ్స్‌లో అడుగడుగునా దుర్వాసన రావడం, అపరిశుభ్రత, చెత్తచెదారం పెరిగి పోవడం, రోగుల గురించి పట్టించుకొనే వారు లేక పోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ చంద్రపై ఆగ్రహంవ్యక్తం చేశారు. సర్కారు మంజూరు చేస్తున్న నిధులను కొందరు స్వాహా చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారని, ఈ విషయమై నిలదీస్తే రోడ్డెక్కి రాజకీయాలు చేయడం సహజంగా మారిందని విమర్శించారు. సానిటేషన్ విషయంలో కాంట్రాక్టర్లు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని అన్నారు. ఒక రోగి ఎమ్మెల్యేతో మాట్లాడుతూ తాను 3 రోజులుగా ఆసుపత్రిలో మంచం పట్టి బాధపడుతున్నా సిబ్బంది, డాక్టర్లు పట్టించుకోవడం లేదని తన బాధ చెప్పుకొందామన్నా వినడం లేదని ఆవేధనవ్యక్తం చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే పంపించాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ ఇక్కడికి పేద రోగులే వస్తారని, ప్రైవేట్ ప్రాక్టీస్ దందాపైనే లక్షలు సంపాదిస్తూ రిమ్స్ ఆసుపత్రిని పూర్తిగా విస్మరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్ల పనితీరుపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. 3 గంటల పాటు ఆసుపత్రిలో అసౌకర్యాలపై ఎమ్మెల్యే ఆరాతీసి సిబ్బంది వేతనాల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, అవసరమైతే ప్రజలతో కలిసి ఆందోళనలో పాల్గొంటానని జోగు రామన్న స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ సైన్స్ కళాశాలలో (రిమ్స్) రోగులు
english title:
rims
Date:
Saturday, March 30, 2013