ఆదిలాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేసి బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడ్డ అన్న ఎన్‌టి రామారావు ఆశయాల స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో పునర్‌వైభవం సాధించడమే ముందున్న లక్ష్యమని టిడిపి నేతలు పేర్కొన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. టిడిపి కార్యకర్తలు ఉత్సాహంగా ఉదయం పార్టీ జెండాలను పలు చోట్ల ఆవిష్కరించిన అనంతరం ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి ఇంచార్జి పాయల శంకర్ మాట్లాడుతూ 60 యేళ్ల కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందని, పేదల గురించి కనికరం లేకుండానే కరెంటు ఛార్జిలు, పన్నుల భారాన్ని మోపుతూ నియంతలా వ్యవహరిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలనపై ప్రజలు ఎవగించుకుంటున్నారని, కరెంటు కోతలు, సర్దుబాటు చార్జిలపై ఆందోళన చేస్తున్న టిడిపి ప్రజాప్రతినిధులను హైదరాబాద్‌లో అరెస్టు చేయడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరించకుండా కరెంటు ఛార్జిలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్‌టిఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం, రుణాల మాఫీ, పేదలకు పక్కా గృహాలు తదితర ఆశయాలనే స్ఫూర్తిగా తీసుకొని పార్టీ తరపున కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు గోక గణేష్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ పునర్ వైభవం కోసం పాటుపడాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అల్లూరి రాజారెడ్డి, గిమ్మ సంతోష్, మల్లన్న, రవికాంత్‌గౌడ్, మునిగెల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
బాసర అమ్మవారి భక్తులకు ధరాఘాతం
* ఆలయంలో నిర్వహించే పూజ, వసతిగదుల రేట్ల పెంపు
* రేపటి నుండి అమలు..
బాసర, మార్చి 29 : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువుదీరిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి నిలయంలో నిర్వహించే అభిషేక, ప్రత్యేక అక్షరాభ్యాస, అర్చన పూజలతో పాటు వసతిగృహ ధరలు పెరిగినట్లు ఆలయ ఈ ఓ ముత్యాలరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమీష్నర్ ఆదేశానుసారం పెరిగిన పూజ, వసతిగృహాల ధరల రేట్లు ఈ నెల 31వ తేదీ నుండి అమలులోకి రానున్నట్లు భక్తులు గమనించాల్సిందిగా ఈ ఓ తెలిపారు. అమ్మవారి అభిషేక ధర ప్రస్తుతం రూ.100 ఉండగా 31 నుండి రూ.200లు, ప్రత్యేక అక్షరాభ్యాసం రూ.500 ఉండగా రూ.1000, అక్షరాభ్యాసం రూ.50 ఉండగా రూ.100, కుంకుమార్చనకు రూ.20కి బదులుగా రూ.50, శీఘ్ర దర్శనం రూ.20 ఉండగా రూ.50, సత్యనారాయణ వ్రతం రూర.50 ఉండగా రూ.100, నిత్య చండీహోమం రూ.516 ఉండగా రూ.1116, పల్లకిసేవ రూ.50 ఉండగా రూ.200, వాహన పూజ బస్సు, లారీ, ట్రాక్టర్ రూ.125 నుండి రూ.200, కారు, జీపుకు రూ.100 నుండి 150, స్కూటర్, మోటార్ సైకిల్‌కు రూ.50 నుండి రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయానికి చెందిన వసతిగదులు ద్వారకా తిరుమల, వేములవాడకు చెందిన వసతిగృహాలు గతంలో ఒక్కో గదికి రూ.500 ఉండగా రూ.1000, రాజన్న నిలయం రూ.500ల నుండి రూ.1500లు, విజయవాడ, కనకదుర్గ, యాదగిరి దేవస్థానానికి చెందిన శ్రీశైలం దేవస్థానం చెందిన అతిథిగృహాల గదులకు రూ.500లు ఉండగా రూ.800లకు పెంచినట్లు ఆయన వివరించారు. ఈ ధరలు ఈ నెల 31 నుండి అమలులోకి వస్తాయని, భక్తులు గమనించాలని ఆయన కోరారు.
ఏప్రిల్ 1న వామపక్షాల దీక్షలు
* ప్రభుత్వ అసమర్థతే విద్యుత్తు సమస్యకు కారణం: ఎమ్మెల్యే గుండ మల్లేష్
మంచిర్యాల, మార్చి 29: రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్తు సమస్య తలెత్తిందని బెల్లంపల్లి ఎమ్మేల్యే గుండ మల్లేష్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యుత్తు సమస్య తీవ్రతరమైందని ద్వజమెత్తారు. రోజురోజుకు విద్యుత్తుచార్జీలను పెంచుతూ, సర్‌చార్జీల పేరుతో సామన్యప్రజల నడ్డి విరుస్తుందన్నారు. విద్యుత్తు కోతలు విధించడమే కాకుండా అప్రకటిత కోతలను విధించడంతో వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి సర్‌చార్జీలను పెంచనున్న నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో 1 నుంచి దీక్షలను, 9న రాష్ట్ర బంద్‌ను పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భద్రి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కలవేన శంకర్, సంయుక్త కార్యదర్శి కత్తరశాల పోచం, మండల కార్యదర్శి లింగమూర్తి, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.