నిజామాబాద్ , మార్చి 29: తొమ్మిదేళ్ల యుపిఏ ప్రభుత్వ పాలనతో విసుగు చెందిన దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ పాలనను కోరుకుంటున్నారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నల్లూరి ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. 2014ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు సంఘంలో బిజెపి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పల్లె గంగారెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యుపిఏ హయాంలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయన్నారు. ఉగ్రవాదుల వరుస దాడులను నియంత్రించకపోవడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల మోత, ధరల పెరుగుదల రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్న యుపిఏ, రాష్ట్ర సర్కార్‌ను గద్దె దించడమే ప్రజల లక్ష్యంగా ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలు మన దేశంలో దాడులకు వ్యూహ రచన చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నా, యుపిఏ సర్కార్ తేరుకోకపోవడం వారి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి మైనార్టీలో పడ్డాయని, పదవులను కాపాడుకునేందుకే నాయకులు పాకులాడుతున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మాణాలు డబ్బులు, పదవుల ఎరతో వీగిపోయేలా చేస్తూ కాలం వెల్లదీస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతుల ప్రభుత్వమంటూ ప్రకటనలు గుప్పిస్తున్న కిరణ్ సర్కార్ బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో కిరణ్ సర్కార్ మోసాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పాదయాత్ర పేరిట విశ్వాసం లేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బాబు హయాంలోనూ కరెంట్ కష్టాలు ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని, దీనిపై ఆందోళనకు దిగితే కాల్పులు జరిపించి అమాయకుల ప్రాణాలను బలిగొన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే మద్య నిషేదం విధిస్తామని నమ్మిస్తున్న చంద్రబాబు, మరోసారి అధికారం చేపడితే బెల్టుషాపులకు సైతం అధికారికంగా నిర్వహించేలా అనుమతులు ఇస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలిసి రాని తెరాస అధినేత కెసిఆర్ ఢిల్లీ చేరుకుంటున్నారని విమర్శించారు. ఉద్యమాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ నేతలతో తెర వెనుక చేతులు కలిపి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెరాస, టిడిపి పార్టీలకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు ఎన్ని వచ్చినా, ఆ పార్టీలకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలతోనే తెలంగాణ ఏర్పడుతుందని, ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ విషయంలో మోసం చేస్తున్న విషయం ప్రజలందరికి తెలిసిందేనని అన్నారు. బిజెపిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అర్బన్ శాసన సభ్యుడు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, బద్దం లింగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, గజం ఎల్లప్ప, శ్రీవాణి, ముక్కా దేవేందర్‌గుప్తాతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బిజెపి జాతీయ కార్యదర్శి నల్లూరి ఇంద్రసేనారెడ్డి
english title:
indrasena reddy
Date:
Saturday, March 30, 2013