నిజామాబాద్ , మార్చి 29: జిల్లాలో ప్రభుత్వ భూములను తమ అధికార పలుకుబడితో కబ్జా చేసుకున్న భూబకాసురులపై జిల్లా యంత్రాంగం కొరఢా ఝళిపించేందుకు రంగం సిద్ధం చేసింది. కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. గత రెండు మాసాలుగా ఈతంతు కొనసాగుతోంది. గతంలో జిల్లా అధికారుల అండదండలతో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కొంతమందికి తాజా పరిస్థితులు వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను మర్యాదగా సర్కార్‌కు అప్పగించాలని, లేనిపక్షంలో కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సైతం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆందోళనకు గురవుతున్న కబ్జాదారుల్లో కొంతమంది స్వయంగా స్థలాలను వదిలేసి రెవెన్యూ అధికారులకు అప్పగిస్తుండగా, మరికొందరు తమతమ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. కబ్జాదారుల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడితో పాటు ఆయన అనుచరులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చర్యలు తీసుకోవాల్సిందేనని కలెక్టర్ ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. కబ్జ్భాములను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా వాటిని పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలకు జిల్లాకు చెందిన మంత్రి సుదర్శన్‌రెడ్డి సైతం అండగా నిలువడంతో అధికారులు తమ పనిని సులువుగా సాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గల 50ఎకరాలను కబ్జా చేసుకునేందుకు కాంగ్రెస్ నేత ముఖ్య అనుచరుడు గత కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేశాడు. అప్పట్లో తమ నేత ద్వారా సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచినా అధికారులు సహకరించలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో జిల్లా అధికారులు కబ్జాదారునికి వ్యతిరేకంగా వ్యవరించి ప్రభుత్వానికి నివేదికను అందచేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్రిస్టీనా జడ్.చోంగ్తూ ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 50ఎకరాలపై కోర్టులో బలమైన ఆధారాలు అందించడంతో పాటు రాష్ట్ర భూపరిపాలన శాఖకు ఆధారాలతో కూడిన నివేదికను సమర్పించారు. దీంతో న్యాయస్థానం భూబకాసురుడు కబ్జా చేసిన స్థలాన్ని అప్పగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అతడు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా నగర శివారులోని సారంగపూర్‌లో ఐఐఐటికి కేటాయించిన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన యువనేత అగ్రనేత అండదండలు ఉన్నాయన్న ధీమాతో ఆ స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయం అధికారులు నిర్వహించిన సర్వేలో బయటపడింది. వెంటనే సదరు నాయకునికి నోటీసులు జారీ చేయడంతో అతను నేతల చుట్టు ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండాపోవడంతో ఎట్టకేలకు స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన పరిస్థితి కలిగింది. ఇక నాగారంలోను కబ్జాదారులు పాగా వేసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ప్లాట్లుగా చేసి అడ్డదారుల్లో అమ్ముకున్నారు. దీనిపై అధికారులు కొరఢా ఝళిపించడంతో దాదాపు రెండు వందల పట్టాలు బోగస్‌గా తేలాయి. దీని వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు హస్తం ఉన్నట్లు తేటతేల్లం కావడంతో కలెక్టర్ అటువైపు దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ వచ్చారు. కలెక్టర్ చర్యలతో బోగస్ పట్టాల భాగోతం బయట పడింది. వీటితో పాటు నగర శివారులోని ముబారక్‌నగర్ ప్రాంతంలో గల 81సర్వే నంబర్‌లోని దాదాపు 500ఎకరాలను కబ్జాదారులు తమ ఆధీనంలోకి తీసుకుని, అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో తమ పేరిట పట్టాలు రూపొందించుకున్నారు. దీనిని సైతం కలెక్టర్ చొరవతో కబ్జాదారులకు చెక్ పెట్టి ప్రభుత్వపరం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినప్పటికీ, అప్పటి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారితీసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో పేదలకు భూములు పంచడానికి సెంట్‌భూమి లేదని అధికారులు నివేదిక పంపడంతో జిల్లాలో ఈ కార్యక్రమం జరగని విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి రక్షణగా కంచెలు ఏర్పాటు చేసి బోర్డులు అమర్చారు. ఇదే విధంగా జిల్లాలోని మరికొన్ని కబ్జా భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
ప్రభుత్వ భూములను స్వాధీనం చేయకుంటే క్రిమినల్ కేసులు * సీరియాస్‌గా పరిగణిస్తున్న కలెక్టర్
english title:
land grabbers
Date:
Saturday, March 30, 2013