హైదరాబాద్, ఏప్రిల్ 1: ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కేటాయించిన భూములు వివాదాల కారణంగా అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని రక్షించడానికి న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం కేటాయించిన వేలాది హెక్టార్ల భూమి వివాదాల కారణంగా సాగులోకి రావడం లేదని చెప్పారు. సెర్ఫ్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) గిరిజన ప్రాంతాలతోపాటు ఇతరత్రా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేటాయించిన భూములకు న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పావలా వడ్డీ, స్ర్తినిధి, బ్యాంక్ రుణాలతోపాటు ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన పౌష్టికాహార కేంద్రాలు పటిష్టంగా పనిచేయడానికి కృషి చేయాలని సూచించారు. మహిశా సంఘాలకు అందిస్తున్న స్ర్తినిధి, బ్యాంక్ రుణాలతోపాటు వడ్డీలేని రుణాలు అందచేసే క్రమంలో సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో నిధులు దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ శాఖలు కింది స్థాయిలో సమన్వయంతో పనిచేసే విధంగా అధికారులు చొరవ చూపాలని మంత్రి చెప్పారు. మహిళా, శిశు సంక్షేమం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయం కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం, సిఇఒ రాజశేఖర్ పలువురు ఐఎఎస్ అధికారులు పాల్గొన్నారు.
మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
english title:
sunitha laxmareddy
Date:
Tuesday, April 2, 2013