హిందూపురం, ఏప్రిల్ 1: వందలాది కోట్ల రూపాయలతో శ్రీరామరెడ్డి తాగనీటి పథకాన్ని ప్రప్రథమంగా హిందూపురం పట్టణానికి అమలు పరచినా ఏమాత్రం ప్రయోజనం లేదని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు ఖాళీ బిందెలతో తరలివచ్చి అధికారులు, ప్రజాప్రతినిధుల వైఫల్యంపై కదం తొక్కారు. మండుటెండలో మహిళలు పిల్లా,పాపలతో సహా తరలివచ్చి దాదాపు గంటన్నర పాటు సద్భావనా సర్కిల్ వద్ద బైఠాయించారు. అదే విధంగా దున్నపోతులను నిరసన కార్యక్రమానికి తీసుకొచ్చి వినూత్నంగా ప్రదర్శించారు. దున్నపోతులపై అవినీతి మున్సిపల్ అధికారులు అంటూ రాయించారు. రహదారిపైనే భోజనాలు చేశారు. నవీన్ ఇంటి వద్ద నుండి జరిగిన ప్రదర్శన రైల్వే రోడ్డు, పెనుకొండ గుండా సద్భావనా సర్కిల్‌కు చేరుకొంది. దాహార్తిని తీర్చండి, నిర్లక్ష్యం వీడండి అంటూ వివిధ రకాల ప్లకార్డులను ప్రదర్శించారు. నీటి సమస్యను పట్టించుకోని మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు డౌన్‌డౌన్ అంటూ మహిళలు నినదించారు. ఎంతసేపటికీ మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులు అక్కడికి రాకపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. దీంతో పోలీసు అధికారులు జోక్యం చేసుకొని కమిషనర్ ఎస్‌వి శివారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ భాస్కర్‌రావులకు సమాచారం అందడంతో హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులను మహిళలు చుట్టుముట్టి నీటి సమస్యపై ఏకరవు పెట్టి నిలదీశారు. దీనికి తోడు నీటి సమస్య, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అస్తవ్యస్తం, పారిశుద్ధ్యం, పందులు, దోమల బెడద వంటి సమస్యలను కమిషనర్‌కు నవీన్‌నిశ్చల్ కూలంకుషంగా వివరించగా త్వరలోనే ఉన్నతాధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. అంతకుమునుపు రాస్తారోకోను ఉద్దేశించి నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ, శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో అవినీతి మితిమీరిపోయినందునే నాసిరకం పనులు జరగడంతో హిందూపురానికి నీరు నామమాత్రంగా కూడా అందడం లేదని, దీని వెనుక ఓ మంత్రి ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని హిందూపురంకు నామమాత్రంగా కూడా వర్తింప చేయకుండా కల్యాణదుర్గం, మడకశిరలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరామరెడ్డి హిందూపురంకు ఏమి చేశారని తాగునీటి పథకానికి ఆయన పేరు పెట్టడం తగదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు పేరును ఆ తాగునీటి పథకానికి పెట్టాల్సి అవసరం ఉందన్నారు.
వందలాది కోట్ల రూపాయలతో శ్రీరామరెడ్డి తాగనీటి పథకాన్ని
english title:
k
Date:
Tuesday, April 2, 2013