బనగానపల్లె, ఏప్రిల్ 2:మండల పరిధిలోని నందవరం చౌడేశ్వరీమాత తిరుణాల ఉత్సవాలు ఉగాది పండుగ తో ప్రారంభమవుతాయని, కావున వివి ధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సూచించారు. నందవరం అమ్మవారి ఆలయం వద్ద ఎమ్మెల్యే కాటసాని ఆల య కార్యనిర్వహణ అధికారి విఎల్‌ఎన్ రామానుజన్, నందవర్గం ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, ఎంపిడిఓ సి.వెంగన్న, తహశీల్దార్ శేషఫణి, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్లు, విద్యుత్ ఎఇ గర్జప్ప, ఫైర్ స్టేషన్ సిబ్బంది, తదితర శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ తిరుణాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ము ఖ్యంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, పోలీసుల బందోబస్తు ప్రధానంగా అవసరమని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా వుండాలని మంత్రి రఘువీరారెడ్డి అమ్మవారి తిరుణాలకు రానున్నారని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయం వద్ద సిసి కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు ఉపయోగిస్తామని ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కార్యనిర్వహణ అధికారికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కాటసానితో పాటు ఇతర శాఖల అధికారులు చౌడేశ్వరీమాతను దర్శించుకుని పూజలు చేశారు. గ్రామ పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి
* అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బాల
మంత్రాలయం, ఏప్రిల్ 2: విద్యార్థులు చక్కగా చదువుకొని విద్యాభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రాలయంలోని రామచంద్రనగర్‌లో రూ. 9లక్షలతో నిర్మాణం చేపట్టిన అదనపు గదులను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా బసాపురంలోని సర్వశిక్ష అభియాన్ కింద మంజూరైన రూ. 3 లక్షలతో అదనపుగదులను నిర్మించి ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించారు. అదేవిధంగా బసాపురంలో రూ. 4 లక్షలతో ప్రహరీ, రూ. 4 లక్షలతో అదనపు గదులను నిర్మించడానికి భూమి పూజ చేశారు. బసాపురంలో రూ. 10లక్షలతో నిర్మాణం చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వగరూరులో తీవ్ర నీటి ఎద్దడి ఉండడంతో రూ. 3లక్షలతో పైపులైన్, మోటర్లను వేయించడం జరిగింది. దీనిని కూడ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రారంభించారు. మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంఇఓ ఈరన్న, ప్రధానోపాధ్యాయులు జనార్ధన్, రామయ్య పాల్గొన్నారు.
‘పది’ పరీక్షల్లో జోరుగా మాస్‌కాపీయింగ్!
నందికొట్కూరు, ఏప్రిల్ 2: పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జోరుగా మాస్‌కాపీయింగ్ జరిగినట్లు సమాచారం. మంగళవారం ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి పరీక్ష జరిగింది. అయితే పరీక్ష ప్రారంభం అయిన 10 నిమిషాలకే పరీక్ష పేపర్‌ను బయటకు తెప్పించి, పాఠశాల సమీపంలోని ఓ జిరాక్స్ సెంటర్ వద్ద జిరాక్స్ చేయించి, వాటితో పాటు సమాధానం పేపర్లను పరీక్ష కేంద్రంలోకి పంపినట్లు తెలుస్తోంది. పరీక్ష పేపర్‌ను పాఠశాలలోని కింది స్థాయి సిబ్బంది చేత బయటకు తెప్పించినట్లు సమాచారం. ఈ కేంద్రంలో ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తుండడంతో జోరుగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని నిబంధనలు ఉన్నా తెరచి ఉంచడం, జిరాక్స్ చేయడం గమనార్హం. మాస్‌కాపీయింగ్ విషయమై పాఠశాల హెచ్‌ఎం సుక్రునాయక్‌ను వివరణ కోరగా తమ పాఠశాలలో మాస్‌కాపీయింగ్ లాంటివి ఏమీ జరగలేదని తెలిపారు.
రాఘవేంద్రుని సేవలో ప్రముఖులు
మంత్రాలయం, ఏప్రిల్ 2: రాఘవేంద్రస్వామి దర్శనార్థమై మంగళవారం కేరళలోని పాండిచ్ఛేరి పార్లమెంటరీ సెక్రటరీ వైద్యనాథన్, ఎమ్మెల్యేలు కల్యాణ సుందరం, కార్తిక్ ఎఎన్‌లు మంత్రాలయం వచ్చారు. వీరికి మఠం అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మదేవికి కుంకుమార్చన, మహామంగళహారతి పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి, సుశమీంద్రతీర్థుల బృందావనాలకు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి రిటైర్డు ద్వారపాలక ఆనంద్‌రావు స్వామివారి శేషవస్త్రం, ఫలమంత్రాక్షలు ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీపతాచార్, కిషన్‌రావు, వ్యాసరాజచార్యులు పాల్గొన్నారు.