నంద్యాల , ఏప్రిల్ 2: వర్షాభావ పరిస్థితుల వల్ల కెసికెనాల్ ప్రాంతాల రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వలేకపోయామని రాబోయే రోజుల్లో అలా జరగకుండా తాను, ఎంపి ఎస్పీవైరెడ్డి రైతులకు అండగా ఉండి చుస్తామని నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల మండలంలోని కొత్తపల్లె గ్రామంలో రూ. 8 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఎంపి ఎస్పీవైరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి నిధులతో నిర్మించిన మినరల్‌వాటర్ ప్లాంట్, సిసిరోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి, నందిగ్రూప్ అఫ్ సంస్థ ఎండి శ్రీ్ధర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎల్‌పిఓ ప్రభాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ దురదృష్టశాత్తు అనుకున్నత మేర రెండు పంటలకు సాగునీరు అందించలేకపోవడంతో తాము బాధపడుతున్నట్లు తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కొత్తపల్లె సమీపంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేస్తామని హామీ ఇచ్చానన్నారు. దీంతో రూ. 2.50 కోట్లతో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 12 లక్షలతో సిసి రోడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే అబండతాండలో రూ. 5 లక్షలతో సిసిరోడ్లు నిర్మించామన్నారు. గ్రామంలోని బిసి కాలనీలో తాగునీటి ఎద్దడి లేకుండా ఎస్‌ఎస్ ట్యాంకు పైపులైన్ నిర్మాణానికి రూ. 18 లక్షలు మంజూరు చేశారు. ఎస్సీ కాలనీలో, బిసి కాలనీలో ఎమ్మెల్యే సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో అర్హులైన వారందరికి పొట్టెళ్ళను, గొర్రెళ్ళను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ కాలనీలో పాఠశాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. జడ్పీ హైస్కూల్ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. అభండతాండలో స్మశాన స్థలం వెంటనే ఇవ్వాలని తహశీల్దార్‌ను అదేశించారు. రాజకీయాలకు అతీతంగా కక్ష్యలు కారాణ్యాలు మరిచిపోయి గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షులు పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గ్రామాల్లోని దళితవాడలన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, తహశీల్దార్ సిహెచ్ మాలకొండయ్య, ఎంపిడిఓ ప్రజ్యోత్‌కుమార్, పిఆర్‌డిఇ సూర్యచంద్రారెడ్డి, ఎఇ వీరకుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ శ్రీనివాసులు, ఎఇ పుల్లయ్య, ఇఓఆర్‌డి దౌలా, ఎఓ చెన్నయ్య, ఆర్‌ఐ రామనాథరెడ్డి, వెలుగు సిసి సుందరం, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, కాంగ్రెస్ నాయకులు దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపిపి భాష్యం జగదీశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పర్యటనలో అపశృతి
కొత్లపల్లె గ్రామంలోని ఎమ్మెల్యే పర్యటనలో పూలమాలలతోపాటు టపాకాయలు పేలుస్తుండగా నిప్పురవ్వలు చేలరేగి గడ్డివాములపై పడడంతో గ్రామానికి చెందిన నాగలింగేశ్వర్‌రెడ్డి, విశేశ్వర్‌రెడ్డిలకు చెందిన 30 ఎకరాల గడ్డివాములు మంగళవారం అగ్నికి అహుతి అయ్యాయి. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం ఎమ్మెల్యే అన్నారు.
కౌలు రైతుకు రుణాలు
గూడూరు, ఏప్రిల్ 2: రెవెన్యూ సదస్సుల్లో కౌలు రైతులను గుర్తించి వారి కి గుర్తింపు కార్డులు అందజేసి రుణా లు ఇస్తామని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్ కా ర్యాలయ ఆవరణలో మంగళవారం డిప్యూటీ తహశీల్దార్ కుశ్రా అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సమస్యలు, పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులు, తదితర సమస్యలను అప్పటికప్పుడే అధికారులు పరిష్కరిస్తారన్నారు. శ్మశానవాటిక స్థలం అన్యాక్రాంతమైందని ప్రహ రీ నిర్మించాలని కొందరు ముస్లింలు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ పట్టణంలో శ్మశానవాటికల వివరాల గురించి ఆరా తీయగా హిందూ శ్మశానవాటికకు 11 ఎకరాలు, ముస్లింలకు 6 ఎకరాలు కేటాయించామని డిప్యూటీ తహశీల్దార్ కలెక్టర్‌కు వివరించారు. అలాగే పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా వుందని పట్టణ ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి 3 రోజు ల్లో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ చక్రధర్, ఎంపిడిఓ లలితాబాయ్, ఆర్‌ఐలు, విఆర్‌ఓ పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని
బిజెపి ఆధ్వర్యంలో ధర్నా
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 2: పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తొలుత నాలుగు రోడ్ల కూడలిలో బిజెపి కార్యకర్తలతో ధర్నా నిర్వహించి, అనంతరం ర్యాలీగా తహశీల్దార్ కార్యాల యం చేరుకుని కార్యాలయం సిబ్బందికి నియోజకవర్గం కన్వీనర్ బోరెడ్డి లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో బిజెపి ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల, రైతుల నడ్డి విరిచేవిధంగా విద్యుత్ చార్జీలు, భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచారన్నారు. అలాగే ఇష్టం వచ్చినట్లు విద్యుత్ కోతలు విధిస్తూ, చార్జీలు పెంచుతున్నారన్నారు. ధర్నాలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రుద్రయ్య, జిల్లా కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓబయ్య, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొర్నిపాడు. చాగలమర్రి మండల అధ్యక్ష, కార్యదర్శులు మురళీధర్‌గౌడ్, జయరాముడు, కృష్ణయ్య, సుబ్బరాయుడు, బాలలింగమయ్య, రుద్రవరం కన్వీనర్ రామలింగం పాల్గొన్నారు.