కర్నూలు , ఏప్రిల్ 2: విజయనామ ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తం గా రూ. 185 లకే 9 సరుకులతో కూడి న కిట్లను తెల్లరేషన్ కార్డుదారులందరికి పంపిణీ చేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. శ్రీ్ధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ నుండి పౌర సరఫరాల శాఖ కమిషనర్ సునీల్‌శర్మ, డైరెక్టర్ రవిబాబులతో కలిసి మంత్రి శ్రీ్ధర్‌బాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 11వ తేదీ హైదరాబాద్‌లో సిఎం కిరణ్ చింతపండు, పసుపు, గోధుమపిండి, గోధుమలు, ఉప్పు, కా రం, కంది బేడలు, పామోలిన్ ఆయిల్, చక్కెర వస్తువులతో కూడిన కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ అన్ని జిల్లాల్లో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పంపిణీ చేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అలాగే 16 నుంచి 24వ తేదీ వరకూ మండల కేంద్రాల్లో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సరుకులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖదేనని మంత్రి స్పష్టం చేశారు. సరుకులు తీసుకెళ్లేందుకు కార్డుదారులందరికీ ఉచితంగా సంచి కూడా అందజేస్తామన్నారు. ప్రతి నెల కార్దుదారులు 9 సరుకులు తీసుకోవాలన్న నియమం లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి పం పిణీ చేయలాల్సిన 9 సరుకుల కిట్లకు సంబంధించి 25 శాతం మాత్రమే స్టాక్ వచ్చిందని నివేదించారు. కార్యక్రమంలో జెసి కన్నబాబు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తాగునీటి పథకానికి రూ. 11.8 కోట్లతో ప్రతిపాదనలు
* కాంగ్రెస్ నేత నారాయణరెడ్డి
పత్తికొండ, ఏప్రిల్ 2: భూగర్భజలాలను అడుగంటిపోయి పత్తికొండలో నీటి ఎద్దడి ఏర్పడినందున ప్రజల దాహార్తి తీర్చడానికి రూ. 11.8 కోట్ల వ్యయంతో నీటి పథకం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నామని కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆశీస్సులతో పందికోనవద్ద రిజర్వాయర్ నుంచి నీటిని సమ్మర్‌స్టోరేజీకి తరలించి దానిద్వారా పత్తికొండ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ పథకం రూపకల్పన చేస్తామని చెప్పారు. శుక్రవారం సిఎం కిరణ్‌ను కలిసి పథకం ప్రతిపాదనలను అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది ఎల్లారెడ్డి, ఆస్పరి రవిచంద్ర, నూర్ బాషా, సోఫీ, గాంధీరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పట్టని మంత్రి
* శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శ
ఆత్మకూరు, ఏప్రిల్ 2: శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టిడిపి నియోజకవర్గం ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. పట్టణంలోని అర్బన్‌కాలనీ, ఇందిరా నగర్, మండల పరిధిలోని కరివేన గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్లకు మంగళవారం శిల్పా పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి కాలనీ వాసులు తమకాలనీల్లో బోర్లు మరమ్మతులకు గురయ్యాయని వాటిని బాగు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏరాసు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా దశాబ్ద కాలంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు పట్టటణంతో పాటు 13 గ్రామాలకు తాగునీటిని అందించే శాశ్వత పథకం పనులు నత్తనడకన సాగుతున్నా మంత్రి పట్టించుకోవడంలేదన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా శిల్పా సేవా సంస్థ ఆధ్వర్యంలో నీరు సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, గిరిరాజు, లక్ష్మణ్‌సింగ్, రామలింగారెడ్డి, నాగేంద్రరావు, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.