కడప, ఏప్రిల్ 2 : జిల్లా ఎదుర్కొంటున్న అనే సమస్యలతో పాటు తాగునీరు, విద్యుత్ సరఫరా మెరుగు పరచాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ఎమ్మెల్సీలు సతీష్‌రెడ్డి, గేయానంద్, ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డిని నిలదీశారు. మంగళవారం జిల్లా పరిషత్ సభా మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టిడిపి ప్రజాప్రతినిధులు లింగారెడ్డి, సతీష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా మెరుగు పరిచి, తాగునీటి సమస్య లేకుండా, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. కాబట్టి ప్రస్తుతం జిల్లాలో తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ట్రాన్స్‌కో ఎస్‌ఇని కోరారు. అందుకు ట్రాన్స్‌కో ఎస్‌ఇ సమాధానం ఇస్తూ ఉదయం 5 గంటలు, రాత్రి 2 గంటలు చొప్పున వ్యవసాయానికి సరఫరా చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తృప్తి చెందలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరానే చేయడం లేదని, అవసరమైతే ఇప్పుడే ఏ ప్రాంతానికైనా వెళ్లి తనిఖీ చేస్తామని విద్యుత్ అధికారులను నిలదీశారు. దీంతో మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి, రామచంద్రయ్య జోక్యం చేసుకుని దేశ వ్యాప్తంగా విద్యుత్ సమస్య ఉందని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ సమస్యను కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు కూడా పరిష్కరించలేవన్నారు. జిల్లాలో హైడల్ ప్రాజెక్టులు, గ్యాస్ ప్రాజెక్టులు కూడా నిలిచిపోయాయని, కేవలం ధర్మల్ ప్రాజెక్టులపై ఆధారపడి విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో 27 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, అయినప్పటికీ సంబంధిత అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకు కలెక్టర్ సమాధానం ఇస్తూ ఇప్పటికే బాధ్యులైన అధికారులను గుర్తించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వీరశివారెడ్డి కోరారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కోరిన వారికి పని కల్పించాలని కోరారు. అందుకు కలెక్టర్ మాట్లాడుతూ పని అడిగిన వారికీ పని కల్పించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ మాట్లాడుతూ బద్వేలు నియోజక వర్గంలో అట్లూరు, కాశినాయన మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణం శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ గేయానంద్, బచ్చల పుల్లయ్య, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బత్యాల చెంగల్రాయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇక పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పట్టని మంత్రుల వైఖరి నశించాలని గేటు ముందర భైఠాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహీధర్‌రెడ్డిని నేరుగా జడ్పీ కార్యాలయంలోకి వెళ్లేటట్లుగా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. ఈ తోపులాటలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.
* ఇన్‌చార్జి మంత్రిని నిలదీసిన టిడిపి ప్రతినిధులు * తాగునీరు, విద్యుత్ సరఫరాపై వెల్లువెత్తిన నిరసనలు * జడ్పీ ఎదుట వామపక్షాల ఆందోళన * తోపులాట.. అరెస్టులు * పలువురి అస్వస్థత
english title:
drc meeting
Date:
Wednesday, April 3, 2013