కడప , ఏప్రిల్ 2 : ఆర్టీసీని నష్టాల నుండి లాభాల బాటలో నడిపించే బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎకె. ఖాన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక రాయలసీమ జోనల్ వర్క్ షాపును సందర్శించిన ఆయనకు జోనల్ వర్క్ షాపు పరివేక్షణాధికారి సిహెచ్. విమల, బ్రహ్మానందరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వర్క్‌షాపులో కార్మికులు చేస్తున్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జోనల్ పరిధిలో కడప, కర్నూలు, అనంతపురం ఉన్నాయన్నారు. వీటిలో 168 మండలాలు, 2858 గ్రామాలున్నాయన్నారు. మొత్తం 31 డిపోలు పని చేస్తుండగా 2558 గ్రామాలకు నిత్యం బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటిలో 414 నైట్ సర్వీసులు తిరుగుతున్నాయన్నారు. అనంతరం ఆర్టీసీ డిపో ప్రాంగణంలోని క్రీడా ప్రాంగణాన్ని, ప్రయాణికులకు ఎసి వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. అలాగే ఆస్పత్రి ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డితో వైద్య పరీక్షలను చేయించుకున్నారు. గ్యారేజీ షాపులో అక్యుపెంచరీ రేటు పెంచిన డ్రైవర్లు, కండెక్టర్లకు 32 మందికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు అందించారు. ప్రస్తుతం తాను ఆర్టీసీ ఎండిగా విధులు స్వీకరించి 10 నెలల పాటే అయిందని, గత సంవత్సరం 600 కోట్ల నష్టం ఉండగా 350 కోట్ల వరకు వచ్చిందన్నారు. దీంతో 50 శాతాన్ని ఇప్పటికే తగ్గించామన్నారు. 2013-14 మార్చి 31 నాటికి ఆర్టీసీ లాభాలు లేకపోయినా కనీసం నష్టాలు లేకుండా నడిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరంలో 2 వేల బస్సులను ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కార్మికులకు కావాల్సిన వసతుల ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప రీజినల్ మేనేజర్ సుదేష్‌కుమార్, డిపో మేనేజర్ గిరిధర్‌రెడ్డి, ఆర్టీసీ రాష్ట్ర కార్మిక నాయకుడు సిహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
* రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ ఎకె. ఖాన్
english title:
ak khan
Date:
Wednesday, April 3, 2013