ఎర్రగుంట్ల, ఏప్రిల్ 2 : రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టులో 600 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించ తలపెట్టిన 6వ యూనిట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని జెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్టు) రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం ప్రాజెక్టులో నిర్మాణపుపనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు నిర్ణయించిన మేరకు 2014 అక్టోబర్ నాటికి 6వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్ పనులతో పాటు సివిల్ పనులు చురుగ్గాసాగుతున్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో కూలింగ్ టవర్స్ డ్రాయింగ్స్ కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇఎస్‌పి ఎరక్షన్ పనులు ఈనెల 12న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే సెక్యూరిటీ కాంప్లెక్స్ గేట్ జూలై 31వ తేదీ నాటికి పూర్తి అవుతాయన్నారు. ఒక ఇన్‌స్పెక్టర్‌తో పాటు 15 మంది సిబ్బంది, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లను నియమించుకునేందుకు అనుమతులు వచ్చాయన్నారు. బాయిర్‌లో 4వ టైర్ పనులు నడుస్తున్నాయని ఈ నెలాఖరులోగా 600 టన్నుల క్రైన్ కూడా వస్తుందన్నారు. వ్యాగిన్ టిప్లర్, ట్రాక్ ఆఫర్ పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. జెన్‌కో ఆధ్వర్యంలో విజయవాడ, కొత్తగూడెం, కృష్ణపట్నం ప్రాంతాల్లో 800 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రామగూడెంలో 2 ఇంటు 660 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను భూపాల్‌పల్లెలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభం నుండి గట్టేక్కాలంటే ప్రతి సంవత్సరం కనీసం 2వేల మెగావాట్ల ఉత్పత్తిని పెంచుతూ పోవాలని విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతకు ముందు జెన్‌కో టెక్నికల్ డైరెక్టర్ యుబి క్రిష్ణమూర్తి, జెన్‌కో సిఇ రత్నబాబు, సిఇ సచ్చినందంతో పాటు అధికారులతో కలసి నిర్మాణం పనులను పరిశీలించారు. తర్వాత నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
* జెన్‌కో డైరెక్టర్ రాధాకృష్ణ
english title:
genco
Date:
Wednesday, April 3, 2013