రైల్వేకోడూరు, ఏప్రిల్ 2: రైల్వేకోడూరు మండలం బుడుగుంటపల్లె గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి కూలిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన విధితమే. అయితే సోమవారం మధ్యా హ్నం నుండి మంగళవారం రాత్రి వరకు బావిలో పూడుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు మంగంపేట ఎపిఎండిసి ఆధ్వర్యంలో 2 భారీ యంత్రాలు మరో వంద మంది మైనింగ్ కార్మికులతో యుద్ధప్రాతిపదికపై పనులు సాగుతున్నప్పటికీ ఒక్క మృతదేహాన్ని కూడా వెలికితీయలేదు. అయితే బావిలోని నీళ్లలోపల మృతదేహాలు 24 గంటల పైగా ఉండడం, బావి మట్టిపెళ్లలు విరిగి లోనకు కూలడంతో మంగళవారం రాత్రి వరకు మృతదేహాలకు సంబంధించి విడివిడిగా పలురకాల అవయవాలు మాత్రమే యంత్రాల ద్వారా బయటకు తీస్తున్నారు. బావిలోని మృతదేహాలకు సంబంధించి ఒక తల, చెయ్యి, కాలు మాత్రమే విడివిడిగా వెలికి తీశారు. బావిలోపల బురదలో మృతదేహాలు నాని బాగా ఉబ్బిపోయి విడివిడిగా అవయవాలు మాత్రమే వస్తున్నాయే తప్ప పూర్తి ఆకారంతో ఏ ఒక్క మృతదేహాన్ని తీయలేని పరిస్థితి నెలకుంది. నాలుగు భారీ యంత్రాలు, 10 ట్రిప్పర్లు, వంద మందికి పైగా మైనింగ్ కార్మికులు, ప్రాజెక్టు మేనేజర్ కేదార్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో పనులు చేస్తున్నప్పటికీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా విడివిడిగా బురదలో కూరుకుపోయిన శవాల నుండి పలు రకాల అవయవాలు వస్తున్నాయి. మరో 12 గంటల తర్వాత అన్ని మృతదేహాలను వెలికితీస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పనులు జరుగుతుంటే మరోవైపు బావికి దగ్గరలోని అంచుమట్టి బావిలోకి పడిపోతోంది. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావ్, రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, మంగంపేట మేనేజర్ కేదార్‌నాథ్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎడి భాస్కర్‌రావ్, తహశీల్దార్ రామచంద్రయ్య, సిఐ రమాకాంత్, ఎస్సైలు హజీవల్లీ, మధుబాబు ఆధ్వర్యంలో ఆయా శాఖలకు సంబంధించిన మరో వంద మందికి పైగా మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.
ధనవంతులు, బంధువులకే వైకాపా టిక్కెట్లు
* ఎమ్మెల్యే వీరశివారెడ్డి
కడప , ఏప్రిల్ 2 : ధనవంతులు, బంధువులకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కట్టబెట్టుతుందని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఇందిరా భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైకాపా తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీల్లో ఒక్కరు కూడా హాజరుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రజల ఓట్లతో గెలిచిన వీరికి వారి బాగోగులు పట్టవా అని ప్రశ్నించారు. ఎర్రం నాయుడు వియంకుడు వైకాపాలో ప్రాథమిక సభ్యత్వం లేకపోయినా ఎమ్మెల్సీ సీటు ఇచ్చారన్నారు. అలాగే బద్వేలు, కోడూరు, రిజర్వేషన్ల టిక్కెట్లు తప్ప మిగిలిన వన్నీ తమ బంధువులకే కట్టబెడతారని జోస్యం చెప్పారు. ఇక డిఆర్‌సి సమావేశంలో మంత్రులు సి.రామచంద్రయ్య, డిఎల్. రవీంద్రారెడ్డి విద్యుత్ కార్యాచరణపై అవగాహన లేకుండా మాట్లాడడం తగదన్నారు. అలాగే సిఎం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అనడం బాగోలేదన్నారు. పేదలపై భారం పడకుండా ఉండేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి పదే పదే చర్చలకు పిలుస్తున్నారన్నారు. సబ్ కమిటీ వేసి అందులో చర్చించి పేదలపై భారం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్యుత్ చార్జీలు కేవలం రెగ్యులేటర్ కమిషన్ నిర్ణయమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాజోలి వీరారెడ్డి పాల్గొన్నారు.