కడప , ఏప్రిల్ 2 : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలు ఎత్తివేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత నెల 31వ తేదీ నుంచి చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లంపురెడ్డి హరినాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోసుల శ్రీనివాసులరెడ్డి మంగళవారం విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచబోమని చెబుతూనే ఎఫ్‌ఎస్‌ఎ పేరిట చార్జీల వడ్డింపు ద్వారా ప్రజలపై భారం మోపడం విడ్డూరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 12 గంటలు నుంచి 16 గంటలు విద్యుత్ కోత విధిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ప్రజల తాగునీటి అవస్థలు వర్ణణాతీతమన్నా రు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు పరిశ్రమల యాజమానులు, కార్మికులు కోతల కారణంగా అనేక బాధలు పడుతున్నారన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, అలాగే విద్యుత్ కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్‌సి సమావేశంలో ఉన్న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బిజెపి నాయకులు వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తర్వాత ఇన్‌చార్జి మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు బిజెపి నాయకులు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
సిపిఎం కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషం
* జిల్లా కార్యదర్శి నారాయణ
కడప , ఏప్రిల్ 2 : సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో శాంతియుతంగా డిఆర్‌సి సమావేశం హాల్ దగ్గర ధర్నా చేస్తున్న నేతలు, కార్యకర్తలపై స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీచార్జి, ఆరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి నారాయణ ఆరోపించారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్య, కరవు సహాయ చర్యలు, పెంచిన విద్యుత్ చార్జీలు విద్యుత్ కోతలకు తదితర సమస్యలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారితో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి చర్చించకుండా అరెస్టు చేయించడం బాధాకరమన్నారు. లాఠీచార్జీ, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే సహించేదిలేదని తీవ్రంగా హెచ్చరించారు.