జమ్మలమడుగు, ఏప్రిల్ 2: సాక్షాత్తూ రాష్ట్ర చేనేత జౌళి శాఖామాత్యులు తమ ప్రాంతానికి వస్తున్నాడన్న వార్త నేతన్నలకు కోటి ఆశలను కలిగిస్తోంది. వ్యవసాయ రంగం తరువాతదైన చేనేత రంగం కొట్టుమిట్టాడుతోంది. రెక్కాడినా డొక్కాడని చేనేత రంగం నేడు సంక్షోభంలో అల్లాడుతోంది. కనీసం నాలుగువేళ్లు నోట్లోకి వెళ్లడానికి పనులు చేసుకుందామన్నా కరెంటు కష్టాలు వీరి దుస్థితిని వెక్కిరిస్తున్నాయి. దీంతో నేతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకందక వారి కష్టాలు వర్ణనాతీతం. చేనేతల ఉద్దరిస్తామన్న సాకుతో ఏర్పాటైన సహకార సంఘాలు చేనేత దయనీయ పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 109 చేనేత, 69శిల్కు సహకార సంఘాలు నడుస్తున్నాయి. వీటిలో 162 సంఘాలు రుణ సదుపాయాన్ని పొందాయి. 2009 నుండి పరిశీలిస్తే చేనేత సహకార సంఘాలకు రూ.11.66 కోట్లు, కోఆపరేటివ్ సంఘాలకు రూ.1.60కోట్లు, శిల్కు సహకార సంఘాలకు రూ. 4కోట్ల రూపాయల చొప్పున రుణమాఫీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోనే వున్న 72 సంఘాలకు గాను 2013 సంవత్సరంలో 8 సంఘాలకు రూ.2.45కోట్లు రుణం మంజూరైంది. ఒక్కో సంఘం కింద సుమారు వంద మంది చేనేతలు లబ్ధిపొందుతున్నట్లు వున్నా ఎక్కడా ఆచరణలో కనిపించడం లేదు. దీంతో సహకార సంఘాలపై చేనేతల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా వున్న చేనేతల వ్యక్తి గతరుణాలు రూ.8కోట్లు మంజూరైతే మాఫీ అవుతాయని మేథావులు చెబుతున్నారు. అయితే సంఘాలపై వున్న ప్రేమ చేనేతలపై ప్రభుత్వానికి లేదన్న విమర్శలు లేకపోలేదు. ఇటువంటి తరుణంలో వస్తున్న చేనేత శాఖామాత్యులు చేనేత రంగంపై ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారోనని పలువురు చేనేతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
* నేడు రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి జి.ప్రసాద్ రాక
english title:
handlooms minister
Date:
Wednesday, April 3, 2013