రైల్వేకోడూరు, ఏప్రిల్ 2 : కలియుగ వైకుంఠ దైవం తిరుమలేశుని దర్శించుకునేందుకు బయలుదేరిన రెండు కుటుంబాల సభ్యులు మార్గమధ్యంలోనే అనంత లోకాలకు చేరుకున్నారు. లారీ రూపంలో వచ్చిన మృత్యును వారిని పొట్టనపెట్టుకుంది. అయితే ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. మంగళవారం ఉదయం కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో గంటలోపు శ్రీవారి సన్నిధికి చేరే ఈ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే రెండు కుటుంబాలకు చెందిన వీరు శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం సాయంత్రం ఇన్నోవా వాహనంలో బయల్దేరారు. మంగళవారం ఉదయం రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని చెన్నై నుండి వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఇన్నోవాలో ప్రయాణించిన మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన పాపిశెట్టిరాములు, రాములు భార్య యశోద, కుమారుడు బాలకిషన్, అతని భార్య చంద్రిక, కుమారుడు హరీష్, జోగిపేటకు చెందిన దేవరశెట్టి లక్ష్మీనరసింహులు , అతని భార్య జ్యోతి, కుమారుడు కార్తీక్, ఇన్నోవా డ్రైవర్ సంతోష్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. బి.లక్ష్మీనరసింహులు కూతురు శ్రేష్ఠ తీవ్రంగా గాయపడింది. బాలిక ఇన్నోవా వాహనం వెనుకవైపు కూర్చోవడంతో ప్రాణాలతో బయటపడింది. వెంటనే బాలికను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సిఐ రమాకాంత్, ఓబులవారిపల్లె ఎస్సై సుబ్బారావు వారి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీలో ఇరుక్కున్న ఇన్నోవా వాహనాన్ని వెలికితీశారు. ఇన్నోవా నుజ్జునుజ్జుకావడంతో మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. దీంతో వాటిని తీసేందుకు కొద్దిసేపు అవస్థలు పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న మృతుల బంధువులు విమానం ద్వారా రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి రైల్వేకోడూరు వచ్చారు. తహశీల్దార్ రామచంద్రయ్య, ఎంవిఐ దామోదర్‌నాయుడు, విఆర్వో సూర్యనారాయణ, గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
* కుక్కలదొడ్డి వద్ద ఇన్నోవా, లారీ ఢీ * తొమ్మిది మంది దుర్మరణం * మృతులు మెదక్ జిల్లా వాసులు * ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి
english title:
innova
Date:
Wednesday, April 3, 2013