Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆదోనిలో వ్యాపారుల సమ్మె

$
0
0

ఆదోని, ఏప్రిల్ 3: రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఆదోని వ్యవసాయ మార్కెట్ బుధవారం దలారీ వ్యాపారులు సమ్మె చేయడంతో పత్తి మార్కెట్, వేరుశెనగ, వాము, ఆముదం మార్కెట్లు పూర్తిగా మూతపడ్డాయి. మార్కెట్లో ఉన్న దాదాపు 120మంది దలారీ వ్యాపారులు సమ్మె చేయడంతో మార్కెట్‌యార్డులో వ్యాపార లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు రూ. 50కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. దలారీ వ్యాపారుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు సమ్మె విరమించేది లేదని వ్యాపార సంఘం నాయకులు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం జరిగే లైసెన్స్ రెన్యూవల్‌లో ప్రభుత్వం అనేక నిబంధనలను విధించిందని, అందుకు నిరసనగా దలారీ వ్యాపారులు సమ్మె చేస్తున్నారని వ్యాపార సంఘం నాయకులు పేర్కొన్నారు. వాస్తవానికి మార్చి 31లోగా దలారీ వ్యాపారుల లైసెన్సులు రెన్యూవల్ కావాల్సి ఉంది. ప్రభుత్వం మొట్టమొదట రూ. 10లక్షల బ్యాంకు గ్యారంటీ, రూ. 2లక్షల డిపాజిట్ చేస్తేనే లైసెన్స్‌లు ఇస్తామని జిఓ జారీ చేశారు. ఆ జిఓను వ్యతిరేకిస్తూ గతనెల దలారీ వ్యాపారులు సమ్మె నిర్వహించారు. వ్యాపారుల సమ్మెతో ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ, డిపాజిట్లు లేకుండా రెన్యూవల్ చేయమని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆ ఉత్తర్వుల్లో వ్యాపారులు బాండ్ రాసి ఇవ్వాలన్న నిబంధన, ఇతర నిబంధనలను కూడ వ్యాపారులకు వ్యతిరేకంగా ఉన్నట్లు వ్యాపార సంఘం నాయకులు స్పష్టం చేశారు. అందువలన తిరిగి బుధవారం దలారీ వ్యాపారులు నిరవధిక సమ్మెను చేపట్టారు. వాస్తవానికి ప్రభుత్వం చేసిన ఉత్తర్వుల్లో రైతులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీలు, డిపాజిట్లు లేకపోవడంతో గతంలో చాలామంది దలారీ వ్యాపారులు రైతులతో కొనుగోలు చేసిన సరుకులకు సొమ్ము చెల్లించకుండా ఐపీ పెట్టిన సంఘటనలు ఆదోని మార్కెట్లో ఎన్నో జరిగాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిన వ్యాపారుల రాజకీయ ఒత్తిడి, వారు ఐక్యమత్యంతో సమ్మె చేయడం వలన ప్రభుత్వం వ్యాపారులకు తల వంచుతూ రైతులను విస్మరిస్తోందని రైతు సంఘం నాయకులు లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం చేసిన రెండవ ఉత్తర్వుపై కూడ వ్యాపారులు సమ్మె చేయడంతో మార్కెట్‌యార్డులో వ్యాపారాలు నిలిచిపోయాయి.
వైద్యాధికారులకు కలెక్టర్
షోకాజ్ నోటీసులు
కర్నూలు, ఏప్రిల్ 3: విధులకు గైర్హాజరైన బ్రాహ్మణకొట్కూరు వైద్యాధికారిణి నాగలక్ష్మిదేవి, ప్రాతకోట వైద్యాధికారిణి శ్రీలక్ష్మి, పగిడ్యాల వైద్యాధికారి సారయ్యలకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బుధవారం కలెక్టర్ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయగా ఉదయం 9.50 గంటలు అయినప్పటికీ బ్రాహ్మణకొట్కూరు వైద్యాధికారిణి నాగలక్ష్మిదేవి హాజరు కాలేదు. దీంతో రిజిస్టర్‌ను తనిఖీ చేసి ల్యాబ్ టెక్నీషియన్ మల్లికార్జున గౌడ్, ఎపిఎంఓ సుబ్రమణ్యం, వైద్యాధికారిణికి షోకాజ్ నోటీలు జారీ చేయాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. వీరితో పాటు ప్రాతకోట, కొణిదేల వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. పిహెచ్‌సిలపై ఎస్‌పిహెచ్‌ఓ సరస్వతీ పర్యవేక్షణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల సక్రమంగా నిర్వహించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
గాజులదినె్న ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్
గోనెగండ్ల : మండల పరిధిలోని గాజులదినె్న ప్రాజెక్టును బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. గాజులదినె్న ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయి డెడ్‌స్టోరేజీకి చేరింది. దీంతో ఆయన జిడిపి అధికారులతో మాట్లాడుతూ ఈనెల 28లోగా ఎల్లెల్సీ ద్వారా నీరు పంపిణీ చేసి జిడిపికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆ నీటిని కేవలం తాగడానికే మాత్రమే ఉపయోగించేవిధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. ఎవరైనా రైతులు పొలాలకు అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
విద్యుత్ భారం బాబు, కిరణ్‌లదే..
* వైకాపా నేత ఎస్వీ మోహన్‌రెడ్డి
కల్లూరు, ఏప్రిల్ 3: చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు కారణమని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బుధవారం వైకాపా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు పరచకపోవడంతోనే ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకవైపు గ్రామస్థాయి నుంచి మెట్రో నగరాల వరకూ విద్యుత్ కోతలు విధిస్తూ, మరోవైపు సర్‌చార్జీ వసూలు చేస్తున్న కాంగ్రెస్ లాంటి పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ముఖ్యంగా విద్యార్థులను, రైతులను కష్టాలకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉపాధి లేక వ్యవసాయ రైతులు వలస వెళ్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, నిత్యావసరాల ధరలను నియంత్రణలో ఉంచాలని, లేనిపక్షంలో వైకాపా ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ధర్నాలో నాయకులు నిర్జూరు రాంభూపాల్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, మహిళా నాయకురాళ్లు రమాదేవి, నారాయణమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిజర్వాయర్ సాధిస్తాం:ఎంపి
బండి ఆత్మకూరు, ఏప్రిల్ 3: రాయలసీమకు తలమానికమైన కెసికెనాల్ కాలువ భవితవ్యం మసకబారకుండా కెసి ఆయకట్టు రైతులు రెండు పంట లు సాగుచేసుకునే విధంగా ప్రభుత్వంపై వత్తిడిపెంచి అబ్దులాపురం రిజర్వాయర్ సాధిస్తామని నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డి అన్నారు. బుధవారం బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్ ఆనకట్ట వద్ద 20 రోజులపాటు ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డు చైర్మన్ పలసాని బాల్‌రెడ్డి పాదయాత్ర చేపట్టి ముగింపుసదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి కెసికెనాల్ కింద లక్షలాది ఎకరాలు సాగునీటితో రెండు పంటలు పండించుకునేవారని, తుంగభద్ర నీటివాటను సగానికి సగం అనంతపురం జిల్లాకు తరలించడంతో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై 150 కిలోమీటర్ నుండి 306 కిలోమీటర్ల వరకు కెసికెనాల్ ఆయకట్టు అధారపడాల్సి వచ్చిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డికి కెసి ఆయకట్టును రక్షించేందుకు ఎగువన రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే స్పందించారని అయితే ఆయన అకాల మరణం తో రిజర్వాయర్ ఏర్పాటు కాలేదన్నారు. కెసి రైతుల నాయకులందరు అందరిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వేపనులు చేయించేందుకు కృషిచేస్తానన్నారు. ఇంతవరకు కెసికెనాల్ రైతులు ఇంత ఐక్యంగా ఎప్పుడు ముందుకు రాలేదని రిజర్వాయర్ సాధనతో భావితరాలకు జీవనోపాధి కల్పించినవారు అవుతామన్నారు. కెసి సాగునీటి శాశ్వ త హక్కుకోసం, అబ్దులాపురం రిజర్వాయర్ నిర్మించాలని కోరుతూ 400 కిలోమీటర్లు, 20 రోజులు పాదయాత్ర చేసిన ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డు చైర్మన్ పలసాని బాలిరెడ్డి మాట్లాడుతూ కెసి రైతులు ఐక్యంగా ఆయకట్టుకు సాగునీరు సాధించుకునేందుకు రైతుల ప్రో త్సాహంతో ఎండను లెక్కచేయకుండా పాదయాత్ర పూర్తిచేశామన్నారు. పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ముందుకువచ్చి కెసికెనాల్ ఎగువ భాగంలో రిజర్వాయర్ నిర్మించి ఆయకట్టు స్థిరీకరణకు కృషిచేయాలన్నారు. ఎంపి ఎస్పీవైరెడ్డి, రైతునాయకులు సిద్దంరెడ్డి రామిరెడ్డి ప్రత్యేక చోరవతో తాను పాదయాత్ర చేపట్టానని, 20 రోజుల పాదయాత్రను కెసిరైతుల నుండి సంపూర్ణ సహకారాలు అందాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో కెసి ఆయకట్టు కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం ఉద్యమం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బెక్కెం రామసుబ్బారెడ్డి, నాగేంద్రారెడ్డి, నంద్యాల, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు చైర్మన్లు విజయశేఖర్‌రెడ్డి, సుంకిరెడ్డి, పేరం సుబ్బారెడ్డి, లాలిస్వామి, కనికల రంగయ్య, బాబులాల్, కొండామోహన్‌రెడ్డి, పద్మావతి, లాయర్ కృష్ణారెడ్డి, గూబగుండం వెంకటసుబ్బారెడ్డిలతో పాటు ఆయకట్టు మండల పరిధిలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సోమన్న ఆచూకీ తెలిపే వరకూ ఉద్యమం ఆగదు
* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కెయి
డోన్, ఏప్రిల్ 3: క్రిష్ణగిరి సహకార సంఘం సిఇఓ సోమన్న ఆచూకీ తెలిపేంత వరకూ తమ ఉద్యమం ఆగదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెయి కృష్ణమూర్తి హెచ్చరించారు. పట్టణంలోని కెఇ స్వగృహంలో బుధవారం ఎమ్మెల్యే విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కోట్ల తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. సోమన్న అదృశ్యమై 40 రోజులు దాటినా పోలీసులు ఇంతవరకూ ఆచూకీ కనుగొనడంలో విఫలం చెందారన్నారు. ఇకపోతే డిసిసి అధ్యక్షులు బివై రామయ్య చౌకబారు ప్రకటనలు మానుకోవాలని సూచించారు. విద్యుత్ చార్జీల పెంపు వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వాతలు పెట్టి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపిపిలు కెయి మద్దిలేటి, టిఇ శేషఫణి గౌడు, పట్టణ టిడిపి అధ్యక్షులు కోట్రికె ఫణిరాజ్, టిడిపి మండల అధ్యక్షులు కొత్తకోట శ్రీనివాసులు, ఆలంకొండ నబిసాహెబ్ పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని
వైకాపా ధర్నా
ఆత్మకూరు, ఏప్రిల్ 3: విద్యుత్ కోతలు, చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ పట్టణంలోని గౌరీసెంటర్‌లో బుధవారం వైకాపా ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైకాపా గౌరవాధ్యకురాలు వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో చేపట్టిన దీక్షకు మద్దతుగా వైకాపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా నాయకులు ఏరువ రామచెంద్రారెడ్డి, రమేష్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ చార్జీలు ఇంతగా పెంచిన దాఖలాలు లేవన్నారు. సిఎం కిరణ్ అసమర్థత వల్లే ఈ దుస్థుతి నెలకొందన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విద్యుత్ కోతల వల్ల చిన్న పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు తిరుపమయ్య, శివప్రసాద్‌రెడ్డి, గోకారి, జయకృష్ణ, కాళహస్తి పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ద్యేయం
ఓర్వకల్లు, ఏప్రిల్ 3: మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని శకునాల గ్రామంలో రూ. 13 లక్షల ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్డు, మురికినీటి కాలువల నిర్మాణానికి రూ. 4 లక్షలు మంజూరు చేశామన్నారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకుని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఎంపికైన సింగిల్‌విండో చైర్మన్లు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. అంతకుముందు మండల పరిధిలోని తిప్పాయపల్లె గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని గ్రామంలోని భూసమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ నాగతిరుపాలు, డిసిసి ప్రధాన కార్యదర్శి ప్రభాకరరెడ్డి, ఎంపిడిఓ చంద్రశేఖరరెడ్డి, కాంగ్రెస్ నేతలు పాలకొలను వేణుగోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు.
పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి
కర్నూలు టౌన్, ఏప్రిల్ 3: ఉపాధి పనుల కోసం దరఖాస్తు చేసుకున్న కూలీలకు 15 రోజుల లోపు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎపిడి లక్ష్మన్న తెలిపారు. కల్లూరు ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటరాముడు ఆధ్వర్యంలో కూలీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిడి మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు పని కల్పించాల్సి బాధ్యత మేట్‌లపై వుందన్నారు. పూర్తిస్థాయిలో పనులు కల్పించేందకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నేతలు నాగేశ్వరరావు, ఎపిఓ రాజారావు, ఇసిలు భరత్, ఫీల్డ్‌అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
మార్కెట్‌లో కుందేళ్ల మాంసం
* యథేచ్చగా వణ్యప్రాణుల వేట
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 3: అడవుల్లో ఉన్న కుందేళ్లను వేటగాళ్లు పట్టుకొచ్చి వాటిని ఎమ్మిగనూరు మార్కెట్లో చౌకగా కిలో రూ. 50 లకే విక్రయించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మార్కెట్లో మాంసానికి ధరలు ఎక్కు వ ఉండడంతో వేటగాళ్లు అడవుల్లో వెళ్ళి వణ్యప్రాణులైన కుందేళ్లను యథేచ్చగా వేటాడి పట్టుకొచ్చి మార్కెట్లో బహిరంగంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. కిలో రూ. 50లు ఉండడంతో మాంసం ప్రియులు ఒక్కొక్కరు రెండేసి కుందేళ్లను రూ. 100 లు ఇచ్చి పట్టుకెళ్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని వణ్యప్రాణులైన కుందేళ్ల విక్రయాలు, వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రెవెన్యూ సదస్సుల అర్జీలను
3 నెలల్లో పరిష్కరించాలి
* ఎమ్మెల్యే కెయి కృష్ణమూర్తి
డోన్, ఏప్రిల్ 3: రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను 3 నెలల్లో పరిష్కరించాలని, లేకపోతే రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే కెయి కృష్ణమూర్తి హెచ్చరించారు. మండల పరిధిలోని ఉడుములపాడులో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. ఉడుములపాడులోని ఎస్సీ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో తహశీల్దార్ పుల్లయ్య, ఎంపిడిఓ అమృతరాజ్, వ్యవసాయ శాఖ అధికారి నరసింహులు, ఇంజినీర్, మాజీ ఎంపిపిలు, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో 200 సీట్లు సాధిస్తాం..
కోడుమూరు, ఏప్రిల్ 3: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 200 అసెంబ్లీ కైవసం చేసుకుని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ జిల్లా నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పాతబస్టాంత్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల హరి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల నేడు సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితులు లేవని విచారం వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధిని కాలరాసిన కిరణ్ ప్రభుత్వంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని విమర్శించారు. అలాగే సిబిఐ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలికుతుందని, వీరి అండ దండలతో పాలన సాగించే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిని బుద్ధి చెబుతారన్నారు. ప్రజల అభిమానంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాస్తారోకోలో నాయకులు అమడగుంట్ల సుదర్శనం, కృష్ణారెడ్డి, రేణుకమ్మ, రాంబుబు, గిరిప్రకాష్‌రెడ్డి, వెంకట శివుడు, డీలర్ కృష్ణారెడ్డి, కెయి రాఘవేంద్రగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, లాయర్ ప్రభాకర్, బ్రహ్మయ్య యాదవ్, లింగారెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఏకాంబరం, రామిరెడ్డి, పాపిరెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి
* ఎమ్మెల్యే మీనాక్షీనాయుడు
ఆదోనిటౌన్, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సిఎం అయితేతప్పా రాష్ట్ర ప్రజలకు సమస్యలు తీరవని, అభివృద్ధి జరగదని ఎమ్మెల్యే మీనాక్షీనాయుడు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని దొడ్డనగేరి గ్రామస్థులు 50మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు సంఘీభావంగా టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. బోయ ముత్తయ్య, రంగస్వామి, ఉరుకుందు, గొల్ల శివానంద, శీనుతోపాటు మరికొంతమందికి పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. గ్రామాల్లో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శివప్ప, గోపాల్‌రెడ్డి, దేవేంద్రప్ప, వేణుగోపాల్‌రెడ్డి, బసాపురం రామస్వామిలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు
14న మంత్రుల భూమిపూజ
* ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె, ఏప్రిల్ 3:మండల పరిధిలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయం ప్రాకారం నిర్మాణ పనులకు ఈ నెల 14వ తేదీ రూ. 93 లక్షల వ్యయంతో దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఆ మేరకు బుధవారం ఎమ్మెల్యే నందవరం ఉత్సవాల గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ అమ్మవారి జ్యోతి మహోత్సవ ఘట్టం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు మంత్రులు హాజరై, ఆలయం వద్ద జరిగే అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారన్నారు. అలాగే ఆలయం వద్ద తోగటవీర సంఘం వారు సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన 32 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అమ్మవారి ఆలయానికి తూర్పు దిశన రాజగోపురం వుందని, మిగతా 3 దిక్కుల కూడా రాజగోపురాలు నిర్మించనున్నారని, ఇందుకు భక్తులు సహకరించాలన్నారు. అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అందుకు తగ్గట్లుగా దేవాదాయ, విద్యుత్, పోలీసు, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే, నందవరం వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పిఆర్ మురళీమోహన్‌రెడ్డి విడుదల చేశారు.
సంక్షేమ కార్యక్రమాలపై
విస్తృత ప్రచారం చేయండి
* 5 నుంచి జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
* సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమాండ్ పీటర్
కర్నూలు, ఏప్రిల్ 3:ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తత్ర ప్రచారం కల్పించాలని సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమాండ్ పీటర్ జిల్లాల జెసిలు, ఎజెసిలకు సూచించారు. బుధవారం ఆయన హైదరాబా ద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కళాజాత బృందాల రూట్ మ్యాప్, విద్యార్థుల ఉపకార వేతనాలు, హాస్టళ్ల పనితీరు తదితర అంశాలపై రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు కవితాప్రసాద్, సమాచారశాఖ డైరెక్టర్ సుభాష్‌గౌడ్‌లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ ఈ నెల 5న జగ్జీవన్‌రామ్, 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం, ఇతర సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు 23 జిల్లాలకు 23 ఉత్తమ కళాజాత బృందాలను ఎంపిక చేసి పంపిస్తున్నామన్నారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రంలోగా అన్ని జిల్లాలకు 15 మంది సభ్యులతో కూడిన కళాబృందం చేరుకుంటుందన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకూ అన్ని నియోజకవర్గాల్లో సమీప గ్రామాల్లో పర్యిటించేలా సంక్షేమశాఖ డిడి, సమాచార శాఖ డిపిఆర్‌ఓలు సంయుక్తంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 5వ తేదీ సిఎం కళాజాత బృందాలను రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. షెడ్యూల్ ప్రకారం నిర్ధేశించిన గ్రామా ల్లో నిర్వహించే కళాజాత బృందాల కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అన్ని గ్రూపుల సభ్యులను ఆహ్వానించాలన్నారు. ప్రతి రోజూ 3 గ్రామాల చొప్పున కళాజాత బృందాలు కార్యక్రమాలు నిర్వహిస్తారని, గ్రామ ప్రజలందరూ కార్యక్రమాలకు హాజయ్యేలా టాం టాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, ఇతర ప్రచార సామాగ్రిని పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 5న ఖమ్మం, వరంగల్, 8న కర్నూలు, 9న ప్రకాశం, 10న ఆదిలాబాద్, 11న హైదరాబాద్, 12న నల్గొండ, 13న తూర్పుగోదావరి, 14న నెల్లూరు చిత్తూరు జిల్లాలో సిఎం పర్యటన ఉం టుందన్నారు. అనంతరం విద్యార్థుల ఉపకార వేతనాలు, వసతి గృహాలు, ఉత్తమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్, ఆధార్‌నమోదు కేంద్రాలు తదితర అంశాలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎజెసి రామస్వామి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లీలాకుమార్, సంక్షేమశాఖ డిడి సారయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి గిరిధర్ పాల్గొన్నారు.
కిరణ్ సర్కారుకు బుద్ధి చెప్పండి
* వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్, ఏప్రిల్ 3: విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యునిపై పెనుభారం మోపిన కిరణ్ సర్కారుకు బుద్ధి చెప్పాలని నియోజకవర్గం వైకాపా ఇన్‌చార్జి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యుత్ చార్జీల పెంపుపై బుధవారం పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా బుగ్గన మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం జరగాలంటే జగన్ సిఎం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పి, జగన్‌కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీరాములు, నాగభూషణంరెడ్డి, నాయకులు కన్నపుకుంట రామచంద్రారెడ్డి, ముర్తుజావలి, చంద్రారెడ్డి, ఖాజావలి, సుంకన్న, రామమద్దయ్య, రవి పాల్గొన్నారు.

* మూతబడిన వ్యవసాయ మార్కెట్
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>