శ్రీకాకుళం ఫిబ్రవరి 12: ప్రజా జీవితాన్ని చిత్రీకరించేది సాహిత్యం అని, జీవిత చరిత్రలు కథలు, నాటికలు ఇమిడి ఉంటాయని కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు మాస్టారు అన్నారు. కథానిలయం 15వ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగుకథ సేకరించాలనే లక్ష్యంతో కథానిలయం ఆవిర్భవించిందని, అన్ని ప్రాంతాల వారికి సహకరించాలని, అందరికీ ఉపయోగపడాలన్నదే తమ ఏకైక లక్ష్యం అన్నారు. కథ కోసం ప్రత్యేకంగా ఏర్పడిందని, వనరులు తక్కువగా ఉండడంతో కథకు మాత్రమే దీనిని కేటాయించామన్నారు. కథ ఇతర పరిశోధనలకు కాకుండా సంఘంలో ఏర్పడిన అంశాలతో పుడుతుందని, గ్రామీణ ప్రాంతాలు 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే ఎన్నో వాస్తవాలు తెలుస్తాయని, అది కూడా కథావస్తువుగా ఉపయోగ పడుతుందన్నారు. పత్రికల్లో వచ్చే అంశాలు, జరిగిన సంఘటన, అందులో మనుషులని మాత్రమే తెలియచెబుతుందని, కానీ ఆ ప్రాంతంలో ప్రజాజీవితం, సంఘటనకు గల కారణం ఇవన్నీ కథల ద్వారా తెలుస్తుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా కథలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కథలపై వ్యాసాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఎవరైనా, ఏదైనా అంశాన్ని రాయాలంటే అందుబాటులో ఉండే వనరులను ఉపయోగించుకోవడం ఎంతో అవసరమన్నారు. కథానిలయం శ్రీకాకుళంలోనే ఉందని కేవలం శ్రీకాకుళం వాసులకే పరిమితం కాదని, తెలుగు భాషాభిమానులు ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా వారందరికీ ఇది ఒక సమగ్ర పరిశోధనా గ్రంథాలయమని, ఇక్కడ లభించే కథాసాహిత్యం అందరూ వినియోగించుకోవచ్చన్నారు. దీని ఆశయాన్ని గుర్తించి ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సహకరిస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా వాసులు మాత్రం కథానిలయానికి సహకరించక పోవడం బాధాకరమన్నారు. కథానిలయం శ్రీకాకుళం ఆస్తి కాదని, తెలుగు సాహిత్య సమాజపు ఆస్తి అని ఆయన వెల్లడించారు. నా వేదనను అర్ధం చేసుకుని, కథానిలయానికి తమవద్ద ఉండే అతి విలువైన పాత పుస్తకాలు అందించాలని కారా మాస్టారు కోరారు. అట్టాడ అప్పలనాయుడు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో కథానిలయం కార్యదర్శి డాక్టర్ బి.వి. ఎ.రామారావునాయుడు, దాసరి రామచంద్రరావు, ఆర్నాద్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, చాగంటి తులసి, వివిన మూర్తి పలువురు సాహితీ వేత్తలు, రచయితలు పాల్గొన్నారు.
===================
సాంప్రదాయ పార్టీలకు నూకలు చెల్లు
* యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడు శివాజీరాజు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: సాం ప్రదాయ పార్టీలకు నూకలు చెల్లాయని యువసత్తా రాష్ట్ర అధ్యక్షుడు పి.శివాజీరాజు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పి ఆర్పీకి చెందిన యువకులు ఆదివారం లోక్‌సత్తా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలు వైన్స్, మైన్స్, సిండికేట్ చుట్లూ తిరుగుతున్నాయన్నారు. లోక్‌సత్తా పార్టీ మాత్రమే అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తుందన్నా రు. ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికార పక్షంతో కుమ్మక్కవుతుందని ఆరోపించారు. ప్రజలు, మేధావులు వౌనం వీడి ఒక అడుగు ముందుకు వేయాలన్నారు. అసమర్ధ రాజకీయాలతో రోజురోజుకు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతుంటే సమర్ధవంతమైన రాజకీయంతో డాక్టర్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో లోక్‌సత్తాపార్టీకి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు యువకిరణాలు, యువతరంగాలు అంటూ యువతను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. శివాజీరాజు సమక్షంలో బి.్ఫల్గుణరావు, డాక్టర్ కె.కృష్ణమూర్తి, ఐ.అక్కలనాయుడు, పి.సుధాకర్, ఎం. సాగర్, ఎ.సందీప్, లోకోష్, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, ఉమామహేష్, అనిల్‌కుమార్, చిన్న, కృష్ణ పార్టీలో చేశారు. పార్టీలో చేరిన వారికి లోక్‌సత్తా కండువాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె.పోలినాయుడు, రాష్ట్ర కార్యదర్శి డి.విష్ణుమూర్తి, యువసత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాం బాబు, జిల్లా కార్యదర్శి జగదీష్, కోశా ధికారి అప్పలరాజు, కృష్ణమూర్తిరెడ్డి, నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.
=============
సినీ రంగంలో సిక్కోలు ఖ్యాతి చాటుతా..
* వర్ధమాన నటుడు వంశీకృష్ణ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: తెలుగు సినీ రంగంలో వర్ధమాన నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తాను భవిష్యత్‌లో సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింప చేసేలా కృషి చేస్తానని హ్యేపీడేస్ ఫేం, వర్ధమాన నటుడు చాగంటి వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణానికి వచ్చిన ఆయన ఆదివారంపేట శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ బరాటం కా మేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఇష్టాగోష్టిలో వంశీకృష్ణ మాట్లాడారు. తనకు హ్యాపీడేస్ సినిమా గుర్తింపు ఇచ్చిన త రువాత కాల్‌సెంటర్, శుభప్రదం సినిమాల్లో మంచి పాత్రల్లో నటించే అవకా శం వచ్చిందన్నారు. త్వరలో నటించిన పేరెంట్స్ అనే చిత్రం విడుదల కా నుందన్నారు. తన తండ్రి ఉద్యోగ రీ త్యా ఇక్కడి స్టేట్‌బ్యాంకులో పనిచేసే సమయంలో కొన్నాళ్లు విద్యాభ్యాసం పూర్తి చేశానని, గుంటూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం కూడా విడిచి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లిన తనకు హ్యేపీడేస్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. రాఘవేంద్ర స్వామి ఆలయం ధర్మకర్త బరాటం కా మేశ్వరరావు మాట్లాడుతూ పట్టణవాసి వంశీ తెలుగు సినీ రంగంలో ఎదగడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో సిక్కోలు ఖ్యాతిని చాటాలన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో వంశీ తండ్రి బాపయ్య పంతులు, తెలుగు రచయితల వేదిక ప్రతినిధి కోనే శ్రీ్ధర్, జామి లక్ష్మణమూర్తి, నటుకుల రమణయ్య, ఫల్గుణరావు పాల్గొన్నారు.
‘పేరెంట్స్’ క్యాసెట్ ఆవిష్కరణ
వంశీ నటించిన నూతన చిత్రం పేరెంట్స్ ఆడియో క్యాసెట్‌ను రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆవిష్కరించారు. మార్చిలో ఈ సినిమా విడుదల కానుందని, కుటుంబ సమేతంగా అందరూ చూసే విధంగా ఈ సినిమాను రూపొందించామని, దీనికి తప్పకుండా అవార్డులు వస్తాయని వంశీ తెలిపారు.