(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ప్రతీ మూడు మాసాలకోసారి నిర్వహించాల్సిన జిల్లా సమీక్షా మండలి సమావేశం ఏడాదికోసారిగా మారింది. గత ఏడాది జులై 5న నిర్వహించిన జిల్లా సమీక్షా మండలి తర్వాత గురువారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఏరాసు ప్రతాపురెడ్డి, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జిల్లా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్ జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు తెలుగుదేశం పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా పిరియా సాయిరాజ్ హాజరవుతూ ప్రజాసమస్యలపై చిన్నపాటి ప్రశ్నలు అప్పుడప్పుడు సంధించేవారు. ఇప్పుడు ఆ సమస్యలు సైతం ఆ పార్టీ తరుఫున అడిగేవారే లేకుండా పోయారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్‌సీపీ నుంచి హాజరవుతున్నప్పటికీ, జిల్లా సమస్యలపై పెద్దగా ప్రస్తావించే పరిస్థితి కన్పించేది కాదు. ఈసారి డీఆర్‌సీలో ప్రతిపక్షపాత్ర ఒకే గొడుగు కిందనుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలపై పోరాడాల్సివున్నప్పటికీ, రాజధానిలో జరిగే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు సంఘీభావంగా అక్కడే ఉండిపోతారా? లేక జిల్లా ప్రజలకు అండగా నిలిచేందుకు డీఆర్‌సీకి వస్తారా?? అన్నది సందిగ్ధంగానే ఉంది. ప్రధానంగా స్థానిక ఎన్నికలను జులై వరకూ పొడిగించిన సర్కార్ ప్రజాసమస్యలు పరిష్కరించడానికి కొత్త వ్యూహాన్ని పన్నినతర్వాత తొలిసారిగా డీఆర్‌సీ సమావేశం జరగనుంది. ఈ నేపధ్యంలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రస్తావించి పరిష్కరించడానికి ఇదోక వేదికగా మార్చుకుంటారా..లేదా అన్నది శేషప్రశ్న. ఇప్పటికే గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు అంతంతగా హాజరవుతున్న ప్రజలు అనేక సమస్యలపై ఏకరవు పెడుతున్న అధికారుల నుంచి స్పష్టమైన భరోసా లభించడం లేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్థార్ కార్యాలయాల వద్ద నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో కూడా వేలాది మంది అర్జ్జీదారులు వివిధ సమస్యలపై చేసుకుంటున్న దరఖాస్తులను పరిష్కరించే నాధుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా తాగునీటి సమస్య జిల్లా అంతటా తీవ్రతరంగా ఉంది. అందులో ఉద్దానం ప్రాంతంలో అయితే ప్రజలు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఇక గిరిజనులైతే ఆ కొండల మధ్య సెలఏరులే దిక్కుగా మారింది. 164 గిరిజన గూడల్లో వాహానాలతో తాగునీరు సరఫరా చేయాలంటూ గత ఏడాది ఐ.టి.డి.ఎ. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది అమలుకు నోచుకోలేదు.
తొలిసారిగా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో..
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఏరాసు ప్రతాప్‌రెడ్డి డిఆర్సీ సమావేశాన్ని తొలిసారిగా గురువారం నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్, ఇతరత్ర కారణాలతో మూడు పర్యాయాలు డీఆర్‌సీ సమావేశాన్ని వాయిదా వేసారు. రెండు సంవత్సరాల క్రితం స్థానిక సంస్థలు రద్దైన తర్వాత ప్రజాసమస్యలపై చర్చించడానికి సరైన వేదికే లేకుండా పోయింది. అనంతరం జిల్లాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వల్ల కూడా పాలకులు జిల్లా అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు. సుదీర్ఘ విరామం తర్వాత గురువారం నిర్వహిస్తున్న డిఆర్‌సీ సమావేశంలోనైనా కనీసం తీసుకున్న అజెండా మేరకు సమస్యలపై సమీక్షించి పరిష్కరించడానికి చొరవ తీసుకుంటే అదే పదివేలని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తాగునీటి ఎద్దడికి ప్రణాళిక ఏదీ?
స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదల నిలిచిపోయాయి. ఇక పారిశుద్ధ్యంతోపాటు ప్రధానంగా తాగునీటి ఎద్దడి తీవ్రతరంగా ఉన్నా వాటిని పరిష్కరించడానికి కనీసం ప్రణాళిక కూడా రూపొందించకపోవడం విశేషం. గత నెలలో కలెక్టర్ తాగునీటిపై సమీక్ష నిర్వహించినప్పటికీ, ఈ వేసవి నుంచి నీటిఎద్దడి ఎలా గట్టేక్కిస్తామన్న ఊసేలేదు. ఇక గ్రామాల్లో బోరుబావులు పడకేస్తే వాటిని పరిష్కరించడానికి నిధుల లేమితో చేతులెత్తేస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో 256 గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దానం ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. విద్యుత్‌కోత పైపులైన్ల అంతరాయం, భూగర్భజలాలు అడుగంటడంతో రెండురోజులకు ఒక్కసారి కూడా తాగునీరు అందించే పరిస్థితి కానరావడం లేదు. ఇంతలో అక్కడ సిబ్బంది విధులు బహిష్కరణకు సన్నద్ధం అవుతుండడంతో ఆ ప్రాంతంలో తాగునీరు అందడం గగనంగా మారే పరిస్థితి కన్పిస్తుంది. ఏజెన్సీ గ్రామాల్లో అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడుతున్నారు. ఇప్పటికే భూగర్భజలశాఖ 10 మండలాల్లో నీటి మట్టాలు తగ్గినట్లు హెచ్చరించింది. మరో 124 గ్రామాలకు తాగునీటి సమస్య ఈ ఏడాది పరిష్కరించలేమంటూ తేల్చిచెప్పింది. ఇటువంటి పరిస్థితులపై డిఆర్‌సీలో నేతలు, అధికారులు ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారన్నది చూడాలి.
జలవివాదాల్లో సిక్కోల్
వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయా వంటి నదులతో ప్రతీ ఏడాది నదీపరివాహక ప్రాంతప్రజలు వరదలను ఎదుర్కొవడమే జిల్లా ప్రజల వంతుగా మారింది. వీటినుంచి రక్షించేందుకు నాగావళి, వంశధార నదులకు దాదాపు ఆరేళ్ల క్రితం 300 కోట్ల రూపాయలతో కరకట్టలు నిర్మిస్తామని అప్పట్లో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి వేసిన శంకుస్థాపనకు ఈ రోజుకు కూడా మోక్షం లేదు. వరదలు వచ్చే సమయంలో సమస్య పరిష్కరిస్తామన్న పాలకులు తర్వాత వారి జాడే ఉండడంలేదు. కనీసం ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో జలవివాదాలను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపకపోవడంతో అన్నీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనిని పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో సాగునీటి కష్టాలు ఎదురుకానునందున ఉద్యమాలకు దిగుతామని రైతాంగం హెచ్చరిస్తుంది. దీనిపై నేతలు సుస్పష్టమైన సమాధానం డిఆర్‌సీ నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది.
ఉపాధికి ఎదురుచూపే
ఉపాధి పథకం అమలులో జిల్లా ప్రథమస్థానంలో ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో వందకోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్లాయి. ఇప్పటికే జిల్లా అంతటా ఉపాధి లబ్ధిదారులకు కూలీ గిట్టుబాటు కావడంలేదని ఎన్ని ఆందోళనలు చేస్తున్నా వారి గోడును పట్టించుకునేవారు లేరు. ఇక మిగిలిన సమస్యల విషయానికి వస్తే విద్యుత్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రతీ ఏడాది కూడా అన్నదాతలకు వరి వంగడాలు అందజేయలేకపోతున్నారు. వచ్చే ఖరీఫ్‌కైనా పూర్తిస్థాయిలో విత్తనాలు అందజేయడానికి ఈ డిఆర్‌సీలో నిర్ణయాలు తీసుకోవల్సిన అవసరం ఉంది. ఇక వైద్యఆరోగ్యశాఖ విషయానికి వస్తే జిల్లాలో అనేక పి.హెచ్.సి.లలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఉన్నా ఆచరణలో లేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగిస్తున్నప్పటికీ సక్సెస్ పాఠశాలలకు నిధులు ఉన్నా అవసరం మేరకు భవనాలు లేవు. ఈ వేసవిలోనైనా వాటిని పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గ్రామాల్లో శతశాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న యంత్రాంగం కనీసం పాఠశాలల్లో నిర్మించడానికి చొరవ తీసుకుంటే మేలు జరుగుతుంది. డిఆర్‌సీలో మరి ఎటువంటి సమస్యలు పరిష్కరానికి పాలకులు చొరవ తీసుకుంటారో మరీ!!
పరీక్షల విభాగం ప్రక్షాళన
ఎచ్చెర్ల, ఏప్రిల్ 3: డిగ్రీ పరీక్షల నిర్వహణలో ప్రశ్నపత్రాలు మార్పిడి వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురికావడం పట్ల చాలాబాధగా ఉందని అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ భగవత్‌కుమార్ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టత లేకపోవడం వల్లే తప్పిదం జరిగిందని, అందుకు చాలా చింతిస్తున్నామన్నారు. మున్ముందు ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయనున్నట్టు తెలియజేశారు. సిస్టమేటిక్ కోడ్‌ను అమలు చేయడమే కాకుండా ప్రశ్నాపత్రాన్ని ఆమోదించేందుకు ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నిబంధనలతో కూడిన బుక్‌లెట్‌ను ప్రచురిస్తామని తెలిపారు. పుస్తక రూపంలో నియామవళిని రూపొందించి యు.జి., పి.జి విభాగాలను విభజించి పరీక్షల నిర్వహణ ప్రక్రియను చేపడతామన్నారు. ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లిన అంశంపై ముగ్గురు ఆచార్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిరంజీవులను తొలగిస్తామన్నారు. ఈ ప్రాంతంతో సంబంధం లేని అధ్యాపకులతో ప్రశ్నాపత్రాలను రూపొందించడం వల్లే పొరపాట్లు దొర్లాయని అంగీకరించారు. అంతేకాకుండా కొత్తవర్శిటీ కావడం, సిబ్బంది కొరత, సహాయకులను ఆ స్థాయిలో కేటాయించకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు.
వీసీకి డిగ్రీ అధ్యాపకుల వినతి
స్పాట్ వాల్యూషన్ రుసుము పెంచాలని డిగ్రీ అధ్యాపకులు వీసీ భగవత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం ఆయన చాంబర్‌లో డిగ్రీ అధ్యాపకులు వాయికుమార్, సురేఖ, శ్రీనివాసయాదవ్, నంద సూర్యనారాయణస్వామి తదితరులు కలిసి పేపర్‌కు ఎనిమిది రూపాయలు చెల్లిస్తున్నారని, దీనిని పెంచాలని కోరారు. పదేళ్ల నుంచి ఇదే రుసుము చెల్లిస్తున్నారని వివరించగా వీసీ సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామన్నారు.
ఎవరిదారి వారిదే..
ఆమదాలవలస, ఏప్రిల్ 3: విద్యుత్ చార్జీలతో పెంపుతో రాజకీయంగా లబ్ధి పొందాల్సిన ప్రతిపక్షాలు గ్రూపు రాజకీయాలతో చతికిలపడుతున్నాయి. నిన్నటివరకు తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి తమ్మినేని, ఆయన మేనల్లుడు కూన రవికుమార్‌లు ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకో, బైఠాయింపులతోపాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు, దివంగత నేత ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వంటి కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించడంతో కార్యకర్తలు, అభిమానులు సంకట పరిస్థితిని ఎదుర్కొన్నారు. అదే పరిస్థితులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తడంతో వైకాపాఅభిమానులు కూడా అంతర్మధనానికి గురవ్వాల్సి వస్తోంది. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు నియోజకవర్గాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టగా ఆమదాలవలసలో మాత్రం సమన్వయకర్తలు వేర్వేరుగా ఆందోళనలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేవరకూ ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కిల్లి రామ్మోహనరావు స్పష్టంచేశారు. బుధవారం ఇక్కడ సొట్టవానిపేట విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, కె.వి.సత్తెయ్య, కూన మంగమ్మ, సువ్వారి అనిల్, జరజాపు వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా పట్టణంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ సమన్వయకర్త బొడ్డేపల్లి మాధురి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎలక్ట్రికల్ ఎ.ఇ సురేష్‌కు వినతిపత్రం అందజేసి రైల్వేస్టేషన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సైలాడ దాసునాయుడు, గురుగుబెల్లి శ్రీను, ఎం.కూర్మారావు, దుంపల శ్యామ్, దన్నాన సత్యం, చింతాడ సత్యనారాయణ, సంపతిరావు కృష్ణ, జి.వేణు, చలపతి, పప్పల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
15 నుండి వార్షిక పరీక్షలు
* జిల్లా విద్యాశాఖాధికారి అరుణకుమారి
శ్రీకాకుళం (టౌన్), ఏప్రిల్ 3: జిల్లాలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్ధులకు ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశ్నాపత్రాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు పంపించామని ఒకటి నుండి ఎనిమిది తరగతులకు సంబంధించి ఎం ఇవోల నుండి పొందాలన్నారు. వార్షిక ప్రమోషన్ లిస్టులను గ్రేడింగ్ ఆదారంగా నమోదు చేయాలని, ప్రైవేట్‌గా హాజరగు విద్యార్థినీ, విద్యార్ధులకు పరీక్షలు ఇదే తేదీలలో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా టైంటేబుల్‌ను విడుదల చేశారు.
సిద్ధి వినాయకుని తాకిన సూర్యకిరణాలు
నరసన్నపేట, ఏప్రిల్ 3: మండల కేంద్రంలో శ్రీ విజయలక్ష్మీ, జ్ఞానసరస్వతీసమేత వరసిద్ధివినాయక ఆలయంలో వినాయక విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయి. బుధవారం ఉదయం 6.38 గంటలకు జరిగిన ఈ వింతను చూసేందుకు భక్తులు తండోపతండోలుగా చేరుకున్నారు. ఆలయ అర్చకులు భాస్కరభట్ల వాసుబాబు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించామన్నారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు భాస్కరభట్ల జగదీశ్వరశర్మ, ప్రభాకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
రెండుగా చీలిన బగ్గు కుటుంబం
* స్వామిబాబు భవితవ్యం ప్రశ్నార్ధకం
జలుమూరు, ఏప్రిల్ 3: తరాలు నుండి ఉమ్మడి కుటుంబంగా ఒకేమాట, ఒకేబాటగా ఎదిగిన బగ్గు కుటుంబం రాజకీయ పార్టీల పేరుతో చీలే పరిస్థితి తలెత్తింది. రాజకీయాల్లో కలిసి ఉన్న బగ్గు సోదరులులో ఒకరైన మాజీ ఎం.పి.పి బగ్గు రామకృష్ణ ఏడాది కిందట ధర్మాన ప్రసాదరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా నేడు ఆయన సోదరుడు బగ్గు లక్ష్మణరావు ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిరువురూ తొలినుంచీ టిడిపిలో ఉంటూ చెరో పార్టీలోకి వెళ్లారు. దీంతో మండలంలోనున్న తెలుగుతమ్ముళ్లు అంతర్మధనంలో పడ్డారు. అయితే రామకృష్ణతో కొందరు టిడిపి మాజీ సర్పంచ్లు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం లక్ష్మణరావుతో వైఎస్సార్‌సీపీలో ఎవరు చేరుతారా అన్న అంశంపై తమ్ముళ్లలో చర్చలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాన్ని వదిలి పేట ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శిమ్మ స్వామిబాబు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఈయన బగ్గు లక్ష్మణరావు స్వయాన అల్లుడు. అయితే ఈయన కూడా పార్టీలో కొనసాగుతారా లేదా అనుమానాలు మొదలయ్యాయి. నరసన్నపేటలో టిడిపి తరుఫున 1972లో బగ్గు సరోజినమ్మ, 1985లో జెడ్పీ అధ్యక్షునిగా, 1994లో శాసనసభ్యునిగా బగ్గు లక్ష్మణరావు పదవులు చేపట్టారు. 1999, 2004, 09లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణరావు ఓటమి చవి చూసినా 40 వేల పైచిలుకు ఓటర్లు బగ్గుకు మద్దతునిస్తూ వచ్చాయి. 2012లో మాత్రం బగ్గుతో ఉన్న పలువురు ఆయనకు దూరమయ్యారు. చివరకు ఆయనే ఆ పార్టీకి దూరమవ్వడం గమనార్హం. ఆయన వెనుక ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇక ఏ నిర్ణయం తీసుకుంటారా అని ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
కామర్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 3: డిగ్రీ పరీక్షల్లో బుధవారం నిర్వహించిన బి.కాం ద్వితీయ సంవత్సరం ఉన్నత గణాంకశాస్త్రం ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. 70 మార్కులకు ప్రశ్నాపత్రం ఉన్నప్పటికీ ఇందులో 30 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ప్రస్తుత సిలబస్‌కు పొంతనలేకుండా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3-బిలో పదిమార్కులకు సంబంధించిన ప్రశ్న తప్పులుదొర్లినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అలాగే 3-6లో నాలుగు మార్కుల ప్రశ్నతోపాటు సెక్షన్-సిలో మరికొన్ని తప్పులతో కూడినవిగా ఉన్నట్లు తెలిసింది. ప్రచురణ సమయంలో సంబంధిత నిపుణులతో పరిశీలించకపోవడం వల్ల అంకెలు తప్పులుగా పడ్డాయని పలువురు పేర్కొంటున్నారు. ఈవిషయమై వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్‌ను వివరణ కోరగా ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లిన అంశంపై ఆచార్యులతో కూడిన కమిటీని నియమించి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వయోచన
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 3: సోలార్ విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయన రాగోలు పంచాయతీ పరిధిలో ఉన్న ఆర్టీసి కాలనీ వద్ద ఎస్.డి.ఎఫ్ పది లక్షల రూపాయలతో సి.సి.రోడ్లకు, ఎమ్మెల్సీ గ్రాంటు నుండి 1.50 లక్షలతో బస్సు షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే వాకలవలస బి.సి.కాలనీలో ఎఫ్.డి.ఏ నిధులు ఆరులక్షల రూపాయలతో నిర్మించనున్న సి.సి.రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గూడెంలో 4.25 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసి కాలనీ వద్ద షిరిడీసాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు రావడంతో జనాభా పెరిగిందని, వారి అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాడకం పెరిగిందని, ఇది రాష్ట్భ్రావృద్ధికి సూచిక అని, వాడకానికి తగిన విద్యుత్ ఉత్పత్తి రాకపోవడంతో కొరత ఏర్పడుతోందని చెప్పారు. జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడిందని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అనే్వషిస్తోందని తెలిపారు. జలవిద్యుత్ ద్వారా ఒక యూనిట్ ఉత్పత్తికి 80 పైసలు పడుతుందని, అదే బొగ్గుద్వారా ఉత్పత్తి చేస్తే మూడు నుంచి నాలుగు రూపాయల వరకు అవసరమవుతుందన్నారు. జల, బొగ్గు, గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పాదన కంటే సోలార్ విద్యుత్ చిరకాలం అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. దీనిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు పీరుకట్ల విశ్వప్రసాద్, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బరాటం నాగేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, మాజీ ఎంపిపి చిట్టి జనార్ధనరావు, మాజీ జెడ్పీటిసి మూకళ్ల సుగుణ, ఆర్డీఒ గణేష్‌కుమార్, ప్రత్యేకాధికారి మునుకోటి సత్యనారాయణ, ఎంపిడిఒ ఆర్.వెంకట్రామన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
.........
వర్సిటీలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 3: విద్యార్థులకు మెరుగైన ఆన్‌లైన్ సేవలందించేందుకు 10 ఎం.బి.పి.ఎస్ సామర్ధ్యం గల ఇంటర్నెట్ సౌకర్యాన్ని అంబేద్కర్ యూనివర్శిటీకి కల్పించామని బిఎస్‌ఎన్‌ఎల్ జి.ఎం. హరిశ్చంద్రమహంతి స్పష్టంచేశారు. బుధవారం వర్శిటీలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మానవవనరుల శాఖ ఈ సౌకర్యాన్ని రాయితీతో కల్పించిందని వెల్లడించారు. ఏడాదికి లక్ష రూపాయలు హైస్పీడ్ సేవలకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ 75 శాతం రాయితీ మానవవనరుల శాఖ భరిస్తుందన్నారు. అలాగే ఐదుశాతం బిఎస్‌ఎన్‌ఎల్ చెల్లిస్తుందన్నారు. కేవలం 20 వేల రూపాయలు మాత్రమే ఏడాదికి చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి భగవత్‌కుమార్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో యూనివర్శిటీలన్ని ఇదే తరహాలో ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుని ఈ-క్లాస్‌లు నిర్వహిస్తాయన్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ-జర్నల్స్, ఈ-విజన్ వంటి మరిన్ని కార్యక్రమాలను భవిష్యత్‌లో విద్యార్థులకు అందించేందుకు కృషిచేస్తామన్నారు. సిడిసి డీన్ తులసీరావు మాట్లాడుతూ వర్శిటీ ఆవరణలో సెల్‌టవర్ ఏర్పాటు చేయాలని కోరగా పరిశీలిస్తామని జి.ఎం హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, డా.కామరాజు, అడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ జి.ఎంను దుశ్సాలువతో సత్కరించారు. జి.ఎం.తో పాటు ఎ.వి.యోగేశ్వరరావు, నగేష్ తదితరులున్నారు.
ఆరోగ్య శ్రీలో ‘కాక్‌లియర్’ చికిత్స
శ్రీకాకుళం (టౌన్), ఏప్రిల్ 3: జిల్లాలోని రెండు నుండి ఎనిమిదేళ్ల వయసు గల పిల్లలకు ఆరోగ్య శ్రీ ద్వారా కాక్‌లియర్ ఇంప్లాంటేషన్ చికిత్స ఏర్పాటుకు ప్రయత్నిస్తానని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. బుధవారం స్థానిక అఫీషియల్ కాలనీలోని సుమిత్ర మహిళా సంఘం నిర్వహిస్తున్న మూగ, చెవిటి పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న వృత్తి శిక్షణను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా బాలికలకు అందిస్తున్న స్పీచ్ థెరపీని ఆయన పరీక్షించారు. స్పీచ్ థెరపీ కోసం ఉపాధ్యాయురాలిని సురక్ష సంస్థ నియమించింది. బాలికల అభ్యుదయం గూర్చి పనిచేస్తున్న సురక్ష సంస్థను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా పిల్లల శిక్షణకు అవసరమగు పరికరాల కొనుగోలుకు అంచనాలు రూపొందించాలని, తదనుగుణంగా వాటిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాజీవ్ విద్యామిషన్, రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి నిధులనుండి వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా వినికిడి లోపం ఉన్న రెండు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు మాత్రమే ఆరోగ్య శ్రీ కింద కాక్‌లియర్ ఇంప్లాంటేషన్ చేస్తున్నారని, దానిని ఎనిమిది సంవత్సరాల వయసు వరకు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని స్పీచ్ థెరపీ ఉపాధ్యాయిని ఆర్.శైలజ కలెక్టర్‌కు తెలియజేయగా, అలాగే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. స్పీచ్ థెరపీ పరికరాలను పరిశీలించి, పనిచేయని యూనిట్లకు మరమ్మత్తులు చేయించాలని సూచించారు. ముందుగా వికలాంగుల శిక్షణ కోసం అందజేసిన కుట్టుమిషన్లు, ఫ్యాన్లును ఆయన వికలాంగులతోనే ప్రారంభింపజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి గొర్లె రాజ్‌కిషోర్, పాఠశాల డైరెక్టర్ వై.శ్రీదేవి, వికలాంగ సంక్షేమ సహాయ సంచాలకులు వై.లక్ష్మణరావు, సురక్ష సంస్థ కార్యదర్శి నిర్మలానంద పాల్గొన్నారు.
జిల్లాలో రూ.28 కోట్లతో రాజీవ్ ఐటిసి: కృపారాణి
కోటబొమ్మాళి, ఏప్రిల్ 3: జిల్లాలో 28 కోట్ల రూపాయలతో రాజీవ్ ఐటిసి కేంద్రాన్ని ఈ నెలాఖరులోగా నెలకొల్పనున్నట్లు కేంద్ర ఐటి సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి తెలిపారు. మండలంలో గంగారాం, పాతతలగాం గ్రామాల మధ్య గరీబుల గెడ్డపై 2 కోట్ల 4 లక్షల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 220 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు సీనియర్ లెక్చరర్‌లతో కంప్యూటర్లు ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే ఈ విధానం అమలు చేయడం రెండోదిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతో బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేందుకు ఒక ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. జిల్లాలో సిగ్నల్స్ లేని ప్రాంతాలను గుర్తించి 50 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఉందన్నారు. మండలంలో తర్లిపేట కొండపై 15 ఎకరాల్లో నీల్లిక్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేసి, దీని ద్వారా సుమారు 4 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి కోసం కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఆమదాలవలసలో 2 కోట్ల రూపాయలతో ఒక తపాలా భవనాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిలేదని, దేశవ్యాప్తంగా గుర్తించేందుకు పోస్టల్ స్టాంప్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. వితంతువులకు కుట్టుపని శిక్షణ, ఉపాధి అవకాశాలు కోసం రూ.50 లక్షలతో మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజల చిరకాల వాంఛ గంగారాం, పాతతలగాం మధ్య గరీబుల గెడ్డ వంతెన సమస్య నేటితో తీరిందన్నారు.
స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కృపారాణి పిలుపునిచ్చారు. నెహ్రూ, సోనియాగాంధీ కుటుంబాలు ఈ దేశ ప్రగతికి శ్రీరామరక్ష అని అన్నారు. టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో డాక్టర్ సెల్ కన్వీనర్ రామ్మోహనరావు, ఆర్డీవో విశే్వశ్వరరావు, పార్టీ నాయకులు మంజు, కృష్ణారావు, శ్రీదేవమ్మ, పేడాడ వెంకటరావు, ఆర్.మల్లయ్య, ఎ.రామరావు పాల్గొన్నారు.