విశాఖపట్నం, ఏప్రిల్ 3: విశాఖ నగర ప్రజల గొంతు తడిపేందుకు జివిఎంసి చేస్తున్న కసరత్తు వలన ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. రెండేళ్ల కిందట విశాఖ నగర ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది కాస్తంతలో జివిఎంసి నీటి ఎద్దడి నుంచి బయటపడగలిగింది. ఈ సంవత్సరం కూడా బొటాబొటిగా నీటిని సరఫరా చేస్తోంది. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థగా ఆవిర్భవించి ఏడేళ్ళవుతోంది. జివిఎంసి పరిధిలో సుమారు 20 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరి తాగునీటి అవసరాలను తీర్చేందుకు జివిఎంసి పెద్దఎత్తున ప్రతిపాదనలు తయారు చేసింది. వేల కోట్ల రూపాయలతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా సిద్ధం చేసింది. కానీ ప్రయోజనం ఏంటి? ఇవేవీ ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. కొన్ని వెళ్లినా వాటికి ఆమోదం లభించలేదు. దీనివలన ఏటా వేసవిలో దేవుడి మీద భారం వేసి కాలాన్ని నెట్టుకొస్తున్నారు జివిఎంసి అధికారులు.
నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం పాయకరావుపేట నుంచి అనకాపల్లి వరకూ సుమారు 12 రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. పోలవరం రిజర్వాయర్ సిద్ధమైతే, అక్కడి నుంచి విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ఓ ఆర్నెల్లు మళ్లించి, మరో ఆర్నెల్లపాటు ఈ ట్యాంకుల్లోకి నీటిని మళ్లించే ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకొని ఉండడంతో ఇప్పట్లో రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా గోదావరి నుంచి సుమారు 1900 కోట్ల రూపాయలతో క్లోజ్డ్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేశారు. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని ఏవిధంగా తెచ్చుకోవాలన్న ఆలోచన చేస్తోంది జివిఎంసి. అతి తక్కువ వడ్డీకి రుణాన్ని తీసుకువచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
జివిఎంసిలో 24 గంటలూ నీటి సరఫరా చేసేందుకు అధికారులు ఆరాటపడుతున్నా, అందుకు తగిన పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే, నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. రోజుకు 45 నిముషాల నుంచి గంటపాటు నీటి సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెపుతున్నా, కొన్ని ప్రాంతాల్లో అరగంటకు మించి నీరు సరఫరా కావడం లేదు. కోట్ల రూపాయలతో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం లభిస్తే కానీ, నగర ప్రజల తాగునీటి కష్టాలు తీరేట్టు లేదు.
రెవెన్యూ డివిజన్‌గా అనకాపల్లి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: త్వరలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించబోతోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. 11 మండలాలతో కలిసి విశాఖ రెవెన్యూ డివిజన్, 13 మండలాలతో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్, మిగిలిన మండలాలతో పాడేరు రెవెన్యూ డివిజన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లలో 13 మండలాలను విడగొట్టి అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌గా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో అనకాపల్లికి కూడా ఒక ఆర్డీఓ రానున్నారన్నమాట.
మహిళలు స్వీయరక్షణ సామర్థ్యం సాధించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: మహిళలు స్వీయరక్షణ సామర్థ్యం సాధించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులతి ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సెనేట్‌హాల్ నందు బుధవారం జరిగిన జయహోమహిళ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. ఇటీవల కాలంలో మహిళలపై చోటుచేసుకుంటున్న దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారిపై జరుగుతున్న దాడులను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. జయహోమహిళలో భాగంగా ఆంధ్రాయూనివర్శిటీ, అనుబంధ కళాశాల విద్యార్థులు గతనెల 8 నుంచి 14 వరకూ గ్రామాల్లో పర్యటించి మహిళలపై జరుగుతున్న దాడులు, నియంత్రణ వంటి అంశాలపై చేపట్టిన కార్యక్రమాలను ఈసందర్భంగా స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఎ సుబ్రహ్మణ్యం వివరించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వారిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జయహోమహిళ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు విసి జిఎస్‌ఎన్ రాజు చేతుల మీదుగా సర్ట్ఫికెట్లను అందజేశారు. కార్యక్రంలో జిల్లా ఎస్పీ జి శ్రీనివాస్, రెక్టార్ ప్రొఫెసర్ ఎవి ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు
* కాంగ్రెస్ పాలనపై బిజెపి విసుర్లు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని భారతీయ జనతాపార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కంభంపాటి హరిబాబు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విద్యుత్ కోతల్లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలు అంధకారాన్ని తెచ్చుకున్నట్టయిందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్లే విద్యుత్ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడుతోందని, తద్వారా కోతలు అమలు చేయకతప్పట్లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించడం బాధ్యతారాహిత్యమేనని ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ శాఖను పర్యవేక్షించేందుకు కనీసం మంత్రి కూడా లేకపోవడం దారుణమని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అసలు విద్యుత్ ఉండట్లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అటు పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడికక్కడ నిలచిపోగా, లక్షలాది మంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడుతున్నారని అన్నారు. ఇక వ్యవసాయరంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం మూడు గంటలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు.
8న బిజెపి ప్రజాచైతన్య సదస్సు
యుపిఎ పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరించే చర్యల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల