జగ్గయ్యపేట, ఏప్రిల్ 3: ఎన్‌ఒసి సర్ట్ఫికెట్‌లు ఇవ్వడంలో విధానాలు సక్రమంగా లేకపోవడం వల్ల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, దీన్ని నివారించేందుకే కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశామని కొంత ఆలస్యం అయినా దీనివల్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ప్రముఖ కాంగ్రెస్ నేత నూకల కుమార్‌రాజా నివాసంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో 13810 గ్రామాల్లో రెవెన్యూ కార్యాలయాలు ప్రారంభించామని, గత నెల 12న ప్రారంభించిన ఈ సదస్సుల్లో 7లక్షల 7వేల 283 అర్జీలురాగా లక్షా 89వేల 233 అర్జీలు పరిష్కారం అయ్యాయని, 22వేల 715 అర్జీలు తిరస్కరించినట్లు తెలిపారు. 4,95,335 అర్జీలు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించిన ఆయన రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీ మూడు నెలల్లోగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. గత ఏడాది 75లక్షల ఎకరాలు పేదలకు పంచామని, అవి వారి వద్దే ఉన్నాయా అన్యాక్రాంతం అయ్యాయా అన్న తమ విచారణలో 4లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించామని, వాటిలో రెండున్నర లక్షల ఎకరాలు తిరిగి అర్హులకు అప్పగించినట్లు వివరించారు. కౌలు రైతులకు ప్రత్యేక చట్టం చేశామని, రైతుకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా 8నెలల్లో కోటి 40లక్షల సర్ట్ఫికెట్‌లను కార్యాలయాలతో సంబంధం లేకుండా అందజేశామన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆధార్ నెంబర్ క్రోడీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 4కోట్ల 30లక్షల రెవెన్యూ రికార్డుల్లో 4కోట్ల 23లక్షల రికార్డులు కంప్యూటరీకరించామని వివరించిన ఆయన ప్రజలకు ప్రశ్నించే అవకాశం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా తెలిపారు. పట్టణానికి విచ్చేసిన మంత్రి రఘువీరారెడ్డికి ఎన్‌ఎస్‌పి కార్యాలయం వద్ద ఎంపి లగడపాటి రాజగోపాల్ స్వాగతం పలుకగా కుమార్‌రాజా నివాసం వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాటిబండ్ల వెంకట్రావు, ఇంటూరి చిన్నా, ఆకుల శ్రీకాంత్, ధూళిపాళ లక్ష్మణరావు, కర్నాటి అప్పారావు, కనపర్తి శేషగిరిరావు, జొన్నాభట్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు
అవనిగడ్డ, ఏప్రిల్ 3: మండల పరిధిలోని దక్షణ చిరువోల్లంక శివారు ఒడుగువారిపాలెం లంక భూముల్లో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు గ్రామస్థులు తహశీల్దార్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ తవ్వకం పనుల పరిశీలనకు తహశీల్దార్ మైనర్‌బాబు వెళ్ళగా దాదాపు 50 ఎకరాల్లో ఇప్పటికే కొన్ని ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా మరికొన్ని చెరువుల్లో సాగు కోసం నీటిని నింపి సిద్ధం చేశారు. ఇక మిగిలిన భూముల్లో జెసిబి వాహనంతో చెరువులు తవ్వుతుండగా రెవెన్యూ అధికారులు బుధవారం అడ్డగించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏవిధమైన అనుమతులు లేకుండా దాదాపు 50 ఎకరాల్లో చెరువుల తవ్వకాలు జరుగుతుండటం వెనుక జిల్లా అధికారుల హస్తం కూడా వుండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. కొన్ని చెరువుల్లో నీటిని నింపి సాగుకు సిద్ధం చేయటాన్ని గుర్తించిన తహశీల్దార్ జెసిబి వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఏమేరకు అక్రమ తవ్వకాలు జరిగిందీ సర్వే చేయిస్తామని తెలిపారు. కాగా ఇటీవలే అక్రమ తవ్వకాలను అనుమతించినందుకు కోడూరు, నాగాయలంకలోని అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అక్రమ తవ్వకాలు నిలవకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కలిదిండి మండలంలో...
కలిదిండి : కలిదిండి మండలంలో అనుమతులు లేకుండా పంట భూములను చేపల చెరువులుగా తవ్వుతూ పట్టుబడ్డ వాహనాలకు రెవెన్యూ అధికారులు బుధవారం భారీ జరిమానా విధించారు. మండలంలోని కొండంగి, అమరావతి సరిహద్దున అనుమతులు లేకుండా 22ఎకరాల పచ్చని పంట పొలాలను కొందరు రైతులు చేపల చెరువులుగా మార్చుకుంటున్నారు. దీనిపై ఆయకట్టు రైతు గుర్రం శివప్రసాద్ గుడివాడ ఆర్డీవోకు ఫిర్యాదు చేయటంతో స్పందించిన ఆర్డీవో ట్రాన్స్‌పోర్టు సిబ్బందితో గత శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పాల్గొన్న అధికారులు చెరువుల తవ్వకాలు సాగిస్తున్న రెండు పొక్లెయిన్‌లు, రెండు డోజర్లను సీజ్ చేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులు పొక్లెయిన్‌కు 25వేలు, డోజర్‌కు 30వేల రూపాయల చొప్పున లక్షా 10వేల రూపాయల జరిమానా విధించారు. దీనిపై తహశీల్దార్ ఎస్ క్షీరసాగర్ మాట్లాడుతూ అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదని హెచ్చరించారు.
పెడనలో షర్మిలకు ఘన స్వాగతం
పెనడ, ఏప్రిల్ 3: మరో ప్రజాప్రస్థానంలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిల నిర్వహించిన పాదయాత్ర విజయవంతమైంది. బందరు మండలం బొర్రపోతుపాలెం నుంచి పెడన పట్టణంలోకి అడుగిడిన షర్మిలకు రామరాజు ఛానల్ వద్ద పార్టీ సమన్వయకర్తలు డా. వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఇక్కడికి వచ్చేసరికి పాదయాత్ర 1500 కిలోమీటర్లు ముగిసిన సందర్భంగా 18 అడుగుల దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అలాగే 100 మంది వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న 108 వైఎస్ విగ్రహాలను వివిఆర్ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. 14వ వార్డు కార్యకర్తలు ఏర్పాటు చేసిన పార్టీ జెండా స్థూపాన్ని బస్టాండ్ వద్ద ఆవిష్కరించారు. ఇదే సెంటరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దాదాపు గంటసేపు ఆమె ప్రతిపక్ష, అధికార పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేనేత, కలంకారీ పరిశ్రమల్లోని సమస్యలను కూడా ప్రస్తావించారు. చేనేత నూలును వివిఆర్, నాగలిని ఉప్పాల షర్మిలకు బహూకరించారు. తొలుత ఉప్పాల, వివిఆర్ యూత్ నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొంకేపూడి వరకు సాగిన పాదయాత్ర ముగిసింది. ఇక్కడే షర్మిలకు రాత్రి బస ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కేంద్ర పాలక మండలి సభ్యులు డా. కుక్కల నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శ్యామలాదేవి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మావులేటి వెంకట్రాజు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు పాల్గొన్నారు. ఇలావుండగా 15రోజుల నుంచి పడిన కష్టానికి ఫలితం దక్కటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
వివాదం రేపిన ఫ్లెక్సీ!
పెడన, ఏప్రిల్ 3: పట్టణంలో వైఎస్‌ఆర్‌సిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది. షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా పట్టణానికి చెందిన భట్ట దివాకర్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యే జోగి రమేష్, సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఫొటోలతో పాటు దివంగత ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఫొటోలు కూడా ఉన్నాయి. ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటోను వాడుకోవటంపై పట్టణ టిడిపి బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పట్టణ టిడిపి అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, తెలుగుయువత అధ్యక్షుడు బెజవాడ నాగరాజు, ఎన్టీఆర్ అభిమానులు జితేంద్ర, దాదా, రఫీ తదితరులు వైఎస్‌ఆర్‌సిపి నాయకుడి చర్యను విలేఖర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటే ఎన్టీఆర్ ఫొటో పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇలావుండగా షర్మిల పాదయాత్రకు హాజరైన వేలాది మంది ప్రజలు ఈ బ్యానర్ గురించి చర్చించుకోవటం కనిపించింది.
48మంది బాలికలకు అస్వస్థత
రెడ్డిగూడెం, ఏప్రిల్ 3: రంగాపురం గ్రామంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన చిన్నారులు పలుమార్లు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మండల పరిధిలోని రంగాపురంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థినులు గతనెల 18న నిమ్మఉప్పుతో తయారుచేసిన పులిహోరను తిని 30మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక శాసనసభ్యులతోపాటు ఉన్నతాధికారులు సైతం అప్రమత్తమై విద్యార్థినులకు ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. తాజాగా బుధవారం 48మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురికాగా బాధితులందరిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్‌డిఓ విచారణ: సమాచారం తెలుసుకున్న నూజివీడు ఆర్‌డిఓ సుబ్బారావు హూటాహూటిన కస్తూర్బా పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. వినియోగించిన రాగుల పిండి, నూనె తదితర శాంపిల్స్‌ను సేకరించారు. కాగా బాధితులకు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన వాహనాలు అందుబాటులో లేకపోవటంతో ఆర్‌డిఓ సుబ్బారావు తన వాహనంలో పలువురు విద్యార్థినులను తనవెంట తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారు. గతంలో, నేడు కలుషిత ఆహారం కావటానికి కారణం రాగులజావేనన్న అనుమానం అధికారుల్లో కల్గుతుంది. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి నూజివీడు ఆర్‌డిఓ సుబ్బారావు పచారిసరుకులు పరిశీలిస్తున్న సమయంలో రాగులజావ ప్యాకెట్‌పై తయారుచేసిన తేది లేకుండా మూడునెలలుకు కాలం చెల్లినట్లుగా ఉంది. అంతేకాకుండా తయారు తేది స్కెచ్ పెన్‌తో కనబడి, కనబడనట్లు రాసి ఉండటం అనుమానాలకు బలం చేకూరుతుంది. దీనిపై అనుమానం వచ్చిన ఆర్‌డిఓ శాంపిల్స్ నిమిత్తం ప్యాకెట్‌ను స్వాధీనపరుచుకున్నారు. దీనికి తోడు పాఠశాలలో వంటకు పచారి సరుకుల వివరాలు, అవి వాడుతున్న షాపు వివరాలు తహశీల్దార్ భాగ్యరాజు పాఠశాల స్పెషలాఫీర్ నుండి తెలుసుకొన్ని నమోదు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ భాగ్యరాజు, ఎంపిడివో మోహనరావు తదితరులు పాల్గొన్నారు. మెలికలు తిరిగి అమ్మో కడుపులో నొప్పి అంటూ చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సుమారు గంట వరకు ఎటువంటి వాహనాలు సమకూర్చకపోగా 108వాహనముకు సమాచారం ఇవ్వకపోవటం విశేషం.
రెండోరోజు కొనసాగిన షర్మిల పాదయాత్ర
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 3: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం రెండోరోజు కొనసాగింది. ఉదయం 8గంటలకు స్థానిక తెలుగు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆమె పాదయాత్ర ప్రారంభించారు. లక్ష్మీ టాకీసు సెంటరులోని రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు. అక్కడి నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర కొనసాగించారు. మాచవరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుండి బొర్రపోతుపాలెం గ్రామానికి చేరుకున్నారు. భోజన విరామానంతరం బొర్రపోతుపాలెం గ్రామంలో నడుచుకుంటూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేయగా షర్మిళ ప్రసంగించకుండా వెళ్ళిపోయారు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రచ్చబండ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినా ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం కార్యకర్తలను నిరాశ నిస్పృహలకు గురిచేసింది. షర్మిల రచ్చబండలో పాల్గొంటారని పెద్దఎత్తున ప్రచారం చేయటంతో పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది మహిళలు సభాస్థలికి చేరుకుని ఆమె కోసం ఎదురుచూశారు. కానీ రెండు నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. ంది విద్యార
120మంది విద్యార్థులకు లీటరున్నర పాలేనా?
రెడ్డిగూడెం, ఏప్రిల్ 3: సుమారు 120మంది విద్యార్థులకు లీటరున్నర పాలు కలిపి రాగులజావ కాసారా? ఎంత దారుణం అంటూ ఎమ్మెల్యే ఉమ కస్తూర్బా పాఠశాల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం తిని బుధవారం అస్వస్థతకు గురైన విద్యార్థులను నూజివీడులో పరామర్శించిన అనంతరం ఆయన రంగాపురంలోని కస్తూర్బా పాఠశాలను పరిశీలించారు. ఉదయం విద్యార్థులకు తయారుచేసిన రాగులజావలో 120మంది విద్యార్థులకు అవసరమైన రాగులజావలో 12లీటర్ల పాలు కలపవల్సి ఉండగా కేవలం ఒక్కలీటరున్నర పాలను మాత్రమే కలిపామంటూ స్పెషల్ ఆఫీసర్‌తోపాటు వంట ఏజెన్సీ నిర్వాహకులు చెప్పటంతో కొద్దిసేపు నిశబ్దం నెలకొంది. అనంతరం తేరుకున్న ఆయన దీనిలో మినరల్ వాటర్ వినియోగించారా అని అడగగా లేదు బావిలో నీరు వాడామంటూ వంట నిర్వాహకులు చెప్పటంతో ఆగ్రహం చెందిన ఆయన పిల్లల జీవితాలతో ఆడుకుంటారా? అదే మీపిల్లలకు అయితే అలాగే వండిపెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహించేలా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తానని, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.
విద్యుత్ తీగలు తాకి ట్రాక్టర్‌లోని వరిగడ్డి దగ్ధం
తోట్లవల్లూరు, ఏప్రిల్ 3: పొలాల్లో, డొంకల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. బుధవారం భద్రిరాజుపాలేనికి చెందిన ఓ రైతు తన ట్రాక్టర్‌లో వరిగడ్డిని లోడు చేసుకు వస్తుండగా పెనమకూరు జెడ్పీ డొంక రోడ్డులో విద్యుత్ తీగలు తగిలి మంటలు రేగాయి. దీంతో మంటలను గమనించిన రైతులు వెంటనే తాళ్ళు కోసేసి వరిగడ్డిని డొంకలో పడవేశారు. దాంతో ట్రాక్టర్‌కు ప్రమాదం తప్పింది. వరిగడ్డి మంటల్లో చేతిపంపు కాలింది. కాగా విద్యుత్ సిబ్బంది లూజు విద్యుత్ లైన్లను సరిచేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వేసవిలో గాలులకు విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఎక్కడ ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళనతో వున్నట్లు రైతు మరిర్రెడ్డి బసివిరెడ్డి, మరికొందరు రైతులు పేర్కొన్నారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైఎస్‌ఆర్‌సిపి రాస్తారోకో
కూచిపూడి, ఏప్రిల్ 3: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూచిపూడి, పెదపూడి ప్రధాన కూడలిలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు చేసిన నినాదాలతో గ్రామాలు మారుమోగాయి. అనంతరం పెడనలో జరుగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు మద్దతుగా 150 మోటారు బైక్‌లు, ఆటోలపై వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్ళారు. వైఎస్‌ఆర్‌సిపి కన్వీనర్ చిమటా రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి తాతా రామదాసు, రాజులపాటి మురళి, ఎస్‌సి సెల్ నాయకులు అయ్యంకి ఆనందరావు, వెంపటి సత్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డలో ధర్నా
అవనిగడ్డ : విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రజల పక్షాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం దాదాపు 200 మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని, నియంత పోకడలు అవలంభిస్తుందని విమర్శించారు. ధర్నాలో కె నరసింహారావు, పృధ్వీరాజు, ఎస్ వెంకటేశ్వరరావు, తోట ప్రసాద్, దామోదరరావు, చండ్ర వెంకటేశ్వరరావు, అర్జా నరేంద్రకుమార్, పి మాధవరావు నాయకత్వం వహించారు.
కలిదిండిలో...
కలిదిండి : విద్యుత్ కోతలకు నిరసనగా వెంకటాపురం సబ్ స్టేషన్ వద్ద బుధవారం వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ చార్జీల భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ ఎఇ బాపిరాజుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పోసిన చెంచురామారావు, ఎస్‌కె చాన్, ఆయనాల బ్రహ్మాజీ, మంగిన భాస్కర్, కందుల వెంకటేశ్వరరావు, విజయ్ పాల్గొన్నారు.
జూన్ మాసాంతానికి వినియోగంలోకి పులిచింతల
* ఎమ్మెల్సీల ఆశాభావం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 3: కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వచ్చే జూన్ మాసాంతంలోపు పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదని, దీనివల్ల వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో వరి నాట్లు ఆరంభించుకోవచ్చన్న ఆశాభావం కృష్ణా, గుంటూరు జిల్లాల శాసనమండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య, కెఎస్ లక్ష్మణరావు, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, బొడ్డు నాగేశ్వరరావు, టిజివి కృష్ణారెడ్డి వ్యక్తం చేశారు. బుధవారం పులిచింతల ప్రాజెక్టును సందర్శించి వచ్చిన వీరు విలేఖరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా 120 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణంకు ప్రభుత్వం 380 కోట్ల రూపాయలు కేటాయించిందని, అయితే పనులు నత్తనడకన నడుస్తున్నాయని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టుకు మాత్రం 17 గేట్లను బిగించారన్నారు. విద్యుత్ ఉత్పాదన కూడా ఆరంభమైతే ఈ రెండు జిల్లాలు ఎంతగానో అభివృద్ధి చెందగలవన్నారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంను త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ తాము త్వరలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలువనున్నట్టు వారు చెప్పారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలు కేటాయించారని, ఇందులో వంద కోట్లు బాధితుల పునరావాసం కోసం, మరో వంద కోట్లు ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కేటాయించారని అన్నారు. బాధితులకు సరైన రీతిలో పునరావాసం కల్పించాలని కోరారు. కుమ్మరి శాలివాహన సహకార సమాఖ్య కోసం ఎంతగానో కృషిచేసిన ఐలాపురం వెంకయ్యను ఆ సంస్థకు చైర్మన్‌గా నియమించాలని ఇటీవల శాసనమండలిలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ఈసందర్భంగా తెలిపారు.
నేడు పెడనకు వేదవ్యాస్
పెడన, ఏప్రిల్ 3: కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ గురువారం తొలిసారిగా పెడన పట్టణానికి వస్తున్నారు. ఇప్పటివరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్యే జోగి రమేష్ వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యవహారాలు, మున్సిపల్ సమస్యలు, ఇతర అంశాలపై పట్టణ కాంగ్రెస్ ప్రముఖులతో వేదవ్యాస్ చర్చించనున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటకం ప్రసాద్, ఉపాధ్యక్షులు మాదాసు బాబూరావు తెలిపారు.
నీటిబాంబుపై కస్సుమన్న కమ్యూనిస్టులు
అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 3: విజయవాడ నగర పాలక సంస్థ పెంచిన నీటి చార్జీల పెంపుపై వామపక్ష పార్టీల కనె్నర్ర చేసాయి. పెంచిన నీటి చార్జీలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీ నగర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ జిఎస్ పండాదాస్ చాంబర్‌ను ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులకు, కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాటలు, వాగ్వాదాలు జరిగాయి. కమిషనర్ ఛాంబర్ ముందు బైఠాయించిన ఆందోళనకారులు ఆయన తీరుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. వామపక్ష ఆందోళనతో కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగ, సిబ్బంది ఏమి జరుగుతుందో, జరగబోతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురైనారు. సిపిఐ నగర కమిటీ కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు నేతృత్వంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కార్యాలయం రణరంగంగా మారింది. నాయకుల ఆందోళన సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు ఎసిపి సత్యనారాయణ పర్యవేక్షణలో కృష్ణలంక పోలీసు అధికార సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో పెనుగులాటలు జరిగాయి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు వ్యవహరించిన పాశవిక ధోరణిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైనాయి. నాయక, కార్యకర్తలతోపాటు మహిళా నాయకులను సైతం అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన చర్యలలో సహనం కోల్పోయిన పోలీసులు అతి క్రూరంగా వారిని బూటుకాళ్లతో తొక్కుతూ, మోకాళ్ళతో డొక్కల్లో పొడుస్తూ అతి బలవంతంగా ఈడ్చుకెళ్ళిన వైనంను పరిశీలిస్తే విపక్ష పార్టీ నేతల ఆందోళనలపై ప్రభుత్వ యంత్రాగం అనుసరిస్తున్న వైఖరి స్పష్టమవుతోంది. వయస్సుపైబడిన నేతలతోపాటు కార్యదర్శి స్థాయి నేతలను సైతం శత్రు శవాలను ఈడ్చికెళ్ళినట్లు ఈడ్చుకెళ్లి వాహనాల్లో విసిరేసిన వైనం గర్హినీయంగా ఉంది. ఆందోళన చేసిన వారిని విడివిడిగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మధ్యాహ్నం తరువాత విడిచిపెట్టడం జరిగింది. ఛాంబర్ ముందు బైఠాయించిన నాయకులపై నగర పోలీసులు అనుసరించిన వైఖరిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమై పోలీసు జులం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. పోలీసులకు ఆందోళన కారులకు జరిగిన తోపులాటలు, పెనుగులాటలలో పలువురు నేతలు గాయాల పాలవ్వగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న నేతలను వ్యక్తిగత పూచికత్తుపై పోలీసులు విడిచిపెట్టారు.
అణిచివేతలతో ఉద్యమాలను ఆపలేరు
* శంకర్, బాబూరావు
తొలుత ఛాంబర్ ముందు బైఠాయించిన సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా పెంచిన నీటి చార్జీలను ఉపసంహరించుకోవాలన్న విపక్ష నేతల ఆందోళనలను అణిచివేయడానికి పాలకులు అవలంభించిన నిర్బంధాలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాయే కానీ ఆగిపోవని హెచ్చరించారు. నగర పాలక సంస్థ కమిషనర్ పండాదాస్ నీటి చార్జీలను పెంచిన వైనం అప్రజాస్వామికమని, స్పెషలాఫీసర్ పాలనలో ఉన్న విజయవాడ కార్పొరేషన్‌లో కమిషనర్ స్థాయిలో నీటి చార్జీలు పెంచే అధికారం లేదని పేర్కొంటూ కనీసం స్థాయి సంఘం మీటింగ్‌లోనైనా కనీస చర్చ కూడా జరుపకుండా కమిషనర్ చార్జీల పెంపు ప్రకటన చెల్లదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను మంజూరు చేయించుకోలేక ఖజానా రాబడి కోసం ప్రజలపై భారాలు మోపుతున్న వైనం గర్హినీయమన్నారు. స్పెషలాఫీర్ పాలనలో అధికారులను అడ్డంపెట్టుకుని ఈవిధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పాలన విధానాలపై నగర కాంగ్రెస్‌పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెదవి విప్పకపోవడం అత్యంత శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు స్పెషలాఫీసర్ అధికారులను అడ్డంపెట్టుకుని తెర వెనుక పాలన నడుపుతున్నారని విమర్శించారు. వారి సూచనల ప్రకారమే నీటి చార్జీలు పెరిగాయని, ఈవిషయంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైన మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, యలమంచలి రవి తోపాటు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని పేర్కొన్నారు. తక్షణమే పెంచిన నీటి చార్జీలను తగ్గించకుంటే ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి కాంగ్రెస్ అధికారుల పాలనకు చరమగీతం పాడతామని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జి కోటేశ్వరరావు, డివి రమణబాబు, పి దుర్గ్భావాని, తమ్మిన దుర్గ, సిపిఎం కార్పొరేటర్లు బోయి సత్యబాబు, దోనేపూడి కాశీనాధ్, శ్రీదేవి, తదితరులోతపాటు ఎఐవైఎప్ రాష్ట్ర అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, వియ్యపు నాగేశ్వరరావు, ఈడే ప్రసాద్, చీకటి సైదారావు, సిపిఎం నేతలు యువి రామరాజు, డి విష్ణువర్ధన్, పి సాంబిరెడ్డి, పి హరి, కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
అవిశ్రాంత పోరు తప్పదు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దశలవారీగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు తాము అవిశ్రాంత పోరాటం సాగిస్తామని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. విద్యుత్ ఆందోళనలో భాగంగా రాధాకృష్ణ నాయకత్వంలో బుధవారం ఉదయం సబ్ కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో వరుసగా ప్రతీ ఏడాది దాదాపు ఎనిమిదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచగా విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 1600 కోట్ల మేర విద్యుత్ చార్జీల బకాయిలన్నింటినీ రద్దుచేయించారన్నారు. పైగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కూడా దేశంలోనే ప్రప్రథమంగా అందుబాటులోకి తీసుకురాగా ప్రస్తుత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. సర్‌చార్జీలు, విద్యుత్ చార్జీల పేరిట ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. ధర్నాలో పార్టీ అధికార ప్రతినిధి చందన సురేష్, మాజీ కార్పొరేటర్లు బుద్దా జగన్నాధం, రామాయణపు శ్రీనివాస్, నాయకులు చిత్రం లోకేష్, రామిరెడ్డి, గోకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ర్యాలీగా బయలుదేరివెళ్లి విద్యుత్ శాఖ ఎస్‌ఇకి వినతిపత్రం సమర్పించారు.
విద్యుత్ షాక్ తప్పదు
సబ్ కలెక్టరేట్, ఏప్రిల్ 3: ప్రజాభిప్రాయాన్ని ఏ మాత్రం పరిగణించని గుడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ షాక్ తగలక తప్పదని వైఎస్సార్ సిపి సెంట్రల్ నియోజకవర్గ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం నగరంలోని స్వరాజ్‌మైదాన్ ఎదురుగా ఉన్న విద్యుత్ ఎస్‌ఇ కార్యాలయం దగ్గర సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రజల ముక్కుపిండి మరీ ప్రభుత్వం కరెంట్ చార్జీలను వసూలు చేస్తుందన్నారు. విద్యుత్ చార్జీల భారం మోయలేని విధంగా ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి తిలోదకాలు ఇచ్చి చార్జీల భారం వేస్తుందని ఎద్దేవా చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మరో చంద్రబాబు నాయుడులా పాలన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. చార్జీలను తగ్గించేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతునే ఉంటాయని నాయకులు ప్రకటించారు. ధర్నాలో పార్టీ అర్బన్ అధికార ప్రతినిధి యాదల శ్రీనివాసరావు, సేవాదళ్ సిటి విభాగం చైర్మన్ కమ్మిలి రత్నకుమార్, సాంస్కృతిక విభాగం చైర్మన్ మంజుశ్రీ, మాజీ కార్పొరేటర్ అవనిగడ్డ సునీత తదితరులు పాల్గొన్నారు.
సర్కార్ మెడలు వంచుతాం
ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 3: పెంచిన విద్యుత్ చార్జీలు, సర్ చార్జీలు, అప్రకటిత కరెంట్, తదితర సమస్యలను పరిష్కరించటానికి అసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అర్బన్ కన్వీనర్ జలీల్‌ఖాన్ హెచ్చరించారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో విద్యుత్‌పై పైసా భారం వేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వైయస్ పాలన కాకుంటే మరింత మెరుగైనా పాలన అందిస్తామని చెప్పి కిరణ్‌కుమార్ సర్కార్ పాలన దేవుడెరుగు, కనీసం పెంచిన విద్యుత్ భారాలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజధానిలో చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్ కార్యాలయంలో ఎదుట పెద్ద ఎత్తున్న ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ మహానేత వైయస్ జీవించి ఉంటే నేడు ఈ రాష్ట్ర ప్రజలకు రోడ్డునపడే దుస్ధితి ఉండేది కాదన్నారు. ఆ మరణంతోనే ఈ రాష్ట్రంలో చీకట్లు ఆలుముకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కరెంట్ తీగలను పట్టుకొంటే షాక్ కొట్టేదని ప్రస్తుతం కిరణ్‌కుమార్ సర్కార్‌లో విద్యుత్ బిల్‌ను పట్టుకొంటే చాలు కరెంట్ షాక్ తగులుతోందని ఆయన వ్యంగ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రజలకు కనీన వౌళిక సదుపాయాలను కల్పించవల్సిన ప్రభుత్వం వాటిని కల్పించకుండా వివిధ రూపాల్లో పన్నుల భారం వేయటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న అన్ని ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న తెలుగుదేశంపార్టీకి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని సమావేశపర్చి అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ కిరణ్‌కుమార్‌రెడ్డితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని రోడ్డుమీద విమర్శలు, ఫోన్‌ల్లో రాజకీయ ఒప్పందాలు చేసుకోవటం ఈ రాష్ట్ర ప్రజలు గమినిస్తున్నారన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు రాంపిళ్ళ శ్రీనివాసరావు, దాసి జయప్రకాష్ కెనడీ తదితరులకు మాట్లాడుతూ ఈరాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యుత్‌పై శే్వతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఎందుకు విద్యుత్‌పై చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. గత కొద్ది రోజుల క్రితం విద్యుత్ కోత, ఉత్పత్తి, అదనపుభారం తదితర అంశాలపై నిపుణులు ఇచ్చిన నివేదికను ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు అమలు చేయలేదని వారు ప్రశ్నించారు. వాణిజ్యసెల్ అర్బన్ కన్వీనర్ కొణిజేటి రమేష్, కార్మిక సెల్ అర్బన్ కన్వీనర్ విశ్వనాధ రవి మాట్లాడుతూ విద్యుత్ కోత, పన్నుల భారం తదితర వాటికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుండి విద్యుత్ చార్జీలను పెంచి ఈ భారం పేదలకు పడదని సియం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ అర్బన్ కన్వీనర్ అమీర్‌జానీ, యస్‌సిసెల్ మాజీ కన్వీనర్ యం సుధీర్, యస్‌టి సెల్ కన్వీనర్ కట్టా సత్తయ్య, మాజీ కార్పొరేటర్ ఆలుగండ్ల సుబ్బారెడ్డి, డివిజన్ కన్వీనర్లు యం రాజకుమారి, మనోజ్ కొఠారీ, పప్పుల రమణారెడ్డి, బండి రాజ్‌కుమార్, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, పైడిపాటి మురళీ, చెంచురెడ్డి, సూరసాని రామిరెడ్డి, మస్తాన్, ఎద్దు సురేష్, సీనియర్ నాయకులు అల్లు మురళీ, ఆర్‌డి ప్రసాద్, ప్రచార కార్యదర్శి కంది గంగాధరరావు, ముంతాజ్‌బేగం, స్టీరింగ్ కమిటీ సభ్యులు గుండె సుందర్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. తొలుత 26వ డివిజన్ కన్వీనర్ పోతిరెడ్డి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు సుధాకర్‌రెడ్డి, ఏలూరు వెంకన్న, రహీమ్‌తుల్లా, సీత, వీరయ్య, తదితరులతోపాటు సుమారు 200 మంది కార్యకర్తలు భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ నుండి ఊరేగింపుగా నగరపాలక సంస్ధ కార్యాలయానికి చేరుకున్నారు. విద్యుత్ పోరాటంలో మృతి చెందిన అమరవీరులకు జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
7న బందరులో జిల్లా కాంగ్రెస్ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 3: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన మచిలీపట్నంలో జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశం నర్విహించనున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎఐసిసి కార్యదర్శి కృష్ణమూర్తి, ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహం, జిల్లా మంత్రి పార్థసారథి, ఎంపి, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం మనసువిప్పి మాట్లాడుకోవచ్చన్నారు. బుధవారం సాయంత్రం గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లేముందు కొద్దిసేపు హోటల్ ఐలాపురంలో బసచేసిన బొత్స సత్యనారాయణను పలువురు నేతలు