శ్రీకాకుళం , ఏప్రిల్ 4: సేమ్.. అప్ సెట్! పది నెలలైనా సమస్య పరిష్కారం కాదా! ఎన్ని డీఆర్సీల్లో సమస్యలు లేవనెత్తాలి’ అంటూ అధికారుల తీరుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అసహనం వ్యక్తం చేసిన తీరిది. గురువారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, విద్యుత్, ఉపాధి హామీ పథకం, నీటిపారుదల శాఖ పనీతీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారుల తీరును ప్రజాప్రతినిధులు ఎండగట్టారు. జిల్లాలో ఏ గ్రామంలో చూసినా మంచినీటి ఎద్దడి నెలకొందని, దీనికి అధికారుల తీరే కారణమని మండిపడ్డారు. రైతులకు సకాలంలో నీటి సరఫరా చేయరు, అడిగితే సవాలక్ష కారణాలు చెబుతారు అంటూ విరుచుకుపడ్డారు. సీజన్ వచ్చేంత వరకు పనులను నాన్చుతూ, ఆనక ఎద్దడి నెలకొనగానే పరుగులెడతారని, ప్రజా సమస్యలు వీరికి పట్టవని విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులుగా నిధులు మంజూరుకు తాము సిద్ధంగా ఉన్నా పనులు పూర్తిచేయడంలో అధికారులు తాత్సార ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. పలాస శాసన సభ్యుడు జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ మందస మండంలోని మహేంద్రతనయ నదిని ఆనుకుని ఉన్న చీపుగడ్డపై బ్రిడ్జిని నిర్మించేందుకు అధికారుల పర్యవేక్షణా లోపంతో కాంట్రాక్టరు పనులను సకాలంలో పూర్తిచేయడం లేదని, ఈ విషయమై గత జిల్లా సమీక్షా సమావేశంలో కూడా ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై సంబంధిత విభాగపు ఇ.ఇ డోల తిరుమలరావు ఏదో చెప్పబోతుండగా ప్రతిఘటించిన శాసనసభ్యునికి, అధికారికి మధ్య కొద్దిపాటి వాగ్యుద్ధం చోటుచేసుకోవడంతో ఇన్‌చార్జి మంత్రి కల్పించుకొని ఏంటయ్యా సేమ్! అప్‌సెట్ సమస్య పరిష్కారం కావడానికి ఇంకెంత కాలం టైంకావాలి, మీ అలసత్వం వలనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. గత డీ ఆర్సీలో సమస్య లేవలెత్తినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటే మీ పనితనం అర్ధవౌతోందని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే డిసిసిబి అధ్యక్షుడు డోల జగన్ లేచి ప్రతి శాఖలో అధికారులకు పిసిలు అందుతున్నాయని, కావాలంటే వారినే అడగండని చెప్పడంతో ఒక్కసారిగా హాల్ నిశ్శబ్ద వాతావరణం సంతరించుకుంది. అవి కుదరకే పనులు ఆగిపోతున్నాయని, దీనికే అధికారులు అనేక విధాలైన సాకులు చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. మంత్రి ఏరాసు మాట్లాడుతూ కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, అధికారులు వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. రెండవ పర్యాయం తాను జిల్లాకు వస్తానని, అప్పటికి సీజనల్‌కు అనుగుణంగా ఉన్న తాగునీటి, మైనర్, మేజర్ ఇరిగేషన్ పనులపై ప్రత్యేకంగా చర్చిస్తానని చెప్పారు. ముందుగా గ్రామీణ నీటిసరఫరా విభాగంను సమీక్షించారు. గ్రామాల్లో విపరీతమైన తాగునీటి ఎద్దడి ఉండగా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పలాస, పాలకొండ నియోజకవర్గాల శాసనసభ్యులు జుత్తు జగన్నాయకులు, నిమ్మక సుగ్రీవులు ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో అవసరమైన బోర్ మెకానిక్‌లు లేరని, వారికి పనిముట్లు లేవని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో వంద శాతం నిధులు ఉన్నాయని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. మంత్రి ఏరాసు కల్పించుకొని ప్రైవేట్ బోర్‌లు ఉంటే అక్కడ నుండి నీటిని తీసుకొని ప్రజలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి వస్తే మంచినీటి కొరత ఏర్పడటం సహజమని, దానికి ముందుగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. బోర్‌వెల్‌లకు ముఖ్యమంత్రి ఆరు కోట్ల రూపాయలు కేటాయించారని, కాబట్టి నిధులకు లోటులేదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా కిందిస్థాయి అధికారులు పనిచేయకపోవడంతో నిధులు మురిగిపోయే ప్రమాదం వస్తుందని, వారిని అప్రమత్తం చేయడం ద్వారా నిధుల వినియోగం సఫలం కాగలదని ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ సూచించారు. వ్యవసాయశాఖ సమీక్షలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో ఆ శాఖ జెడి వైఫల్యం చెందారని మంత్రి శతృచర్ల విజయరామరాజు అధికారులతీరుపై మండిపడ్డారు. ఉపాధి హామీలో ఫీల్డు అసిస్టెంట్లు, ఎపివోలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న శాసనసభ్యుల ఫిర్యాదుకు మంత్రి ధర్మాన వారిని వేరే చోటికి మార్చమని పిడి కళ్యాణ చక్రవర్తిని ఆదేశించారు. మొత్తానికి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం ఎంపిపిలు, జడ్‌పిటిసిలు ఉన్నప్పటికంటే ఉన్న ఆరుగురు శాసనసభ్యులు అధికారులపై మండిపడ్డ తీరు జిల్లా అభివృద్ధిపై ఆశలు రేకెత్తించింది. జిల్లా ఇనఇచార్జి మంత్రిగా ఏరాసు అధికారుల తీరుపై తన అసహనాన్ని తెలియజేస్తూ, ఇది ఇండియన్ మెంటాలిటీ అని పేర్కొనడం కొసమెరుపు. ఇటువంటి సమావేశానికి టిడిపికి చెందిన ఇటీవల వైకాపాలో చేరిన ఇచ్చాపురం శాసన సభ్యుడు పిరియా సాయిరాజ్, వైకాపాకు చెందిన నరసన్నపేట శాసన సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడ్డేపల్లి సత్యవతిలు హాజరుకాకపోవడం విశేషం.
గైర్హాజరైన మున్సిపల్ కమిషనర్లకు మెమోలు
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: జిల్లా సమీక్షా మండలి సమావేశానికి గైర్హాజరైన ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు మోమోలు ఇవ్వాలంటూ జిల్లా ముఖ్యప్రణాళికాధికారి శివరాంనాయకర్‌ను రోడ్లు,్భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. ప్రస్తుత వేసవి దృష్యా జిల్లాఅంతటా ప్రధాన సమస్య అయిన తాగునీటి సరఫరాపై ఆర్.డబ్ల్యూ.ఎస్., మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ అధికారులతో సమీక్షించిన ఇన్‌ఛార్జి మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు మున్సిపాలిటీలలో తాగునీటి సమస్య పట్ల తీసుకుంటున్న చర్యలను కమిషనర్లకు అడిగి తెలుసుకుంటున్న సమయంలో కేవలం శ్రీకాకుళం, రాజాం మున్సిపల్ కమిషనర్లు రామలింగేశ్వర్, శ్రీనివాసరావులు హాజరై వారివారి మున్సిపాలిటీలలో తీసుకున్న చర్యలు గూర్చి చెప్పారు. ఆమదాలవలస, పలాస, ఇచ్చాపురం మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు జి.కృష్ణమోహన్, భాస్కరరావు, రత్నంరాజులను పేరుపేరునా మంత్రి ధర్మాన పిలిచినప్పటికీ వారు సమీక్షా సమావేశానికి హాజరుకాలేదని తెలియడంతో ఆగ్రహించారు. దీంతో సీపీవో శివరాంనాయకర్‌ను ప్రశ్నిస్తూ వారికి సమాచారం ఇచ్చారా? లేదా? ఇచ్చినట్లయితే ఎందుకురాలేదని ఆగ్రహించారు. గైర్హాజరుకుఅధికారికంగా అనుమతులు తీసుకున్నారా? అంటూ ప్రశ్నించగా, ఎటువంటి అనుమతులు కోరలేదంటూ సీపీవో పేర్కొనడంతో మంత్రి ధర్మానతోపాటు, ఇన్‌ఛార్జి మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా ఆమదాలవలస, పలాస, ఇచ్చాపురం మున్సిపల్ కమిషనర్లకు మోమోలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేసారు.
ఇదిలా ఉండగా, డీఆర్‌సీ ముగించకముందే గైర్హాజరైన ముగ్గురు కమిషనర్లకు సీపీవో ఫోన్‌లో సమాచారం అందించగా, హుటాహటిన ఆమదాలవలస కమిషనర్ సమావేశం జరుగుతున్న జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకుని మంత్రి ధర్మాన వద్ద లబోదిబోమన్నారు. ఇచ్చాపురం కమిషనర్ రత్నంరాజు మాత్రం అక్కడ జరగనున్న సంబరాల సమావేశంలో డిఎస్పీ, ఆర్డీవోలతో ఉన్నట్లు సీపీవోకు సమాచారం ఇచ్చారు. ఇకపోతే, పలాస కమిషనర్ ఎండి. ఫణీరాంకు ఇటీవలే బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో డి.ఇ. భాస్కరరావు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోమోల కథ తెలుసుకుని మంత్రి ధర్మానను కలిసేందుకు పలాస నుంచి పరుగులు తీసారు.
కథలు చెబుతున్నారా?
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: తాగునీటి ఎద్దడి నివారణ చర్యలపై సుదీర్ఘ చర్చ జరుగుతుండగా ఒక్కసారిగా అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఎస్.ఇ.రవీంద్రనాథ్‌పై విరుచుకుపడి ‘డోంట్ టాక్ నాన్‌సెన్స్’ అంటూ గర్జించారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిసికూడా ముందస్తు ప్రణాళిక రూపొందించకుండా పిట్టకథలు చెబుతున్నారంటూ ఆగ్రహించారు. ప్రతీ సమీక్షలోనూ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూస్తున్నా అందుకు తగిన చర్యలు తీసుకోకుండా, తిరిగి సాంకేతిక లోపాలని, సిబ్బంది లేరంటూ చెప్పే సాకులు ఇకపై వినేపరిస్థితులు లేవన్నారు. ఇంజనీర్లు, బోర్ మెకానిక్‌లు అందుబాటులో లేరన్న సాకులు మరిచెప్పొద్దంటూ హెచ్చరించారు. ఒక్కసారే చెబుతాను - వేసవిలో పాతపట్నం నియోజకర్గంలో తాగునీరు సమస్య ఏ గ్రామంలో కన్పించినా యాక్షన్ సీరియస్‌గా ఉంటోందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు 4 - 5 కోట్ల రూపాయలు వేసవిలో తాగునీటి ఎద్దడి కోసం నిధులు కేటాయించినట్లు రాజధానిలో ఒక సమావేశంలో ఆయన చెబితే, ఇక్కడ కనీసం బోరు స్పేర్ పార్టులు కూడా లేవని చెప్పే గ్రామీణ మంచినీటిసరఫరా అధికారులపై మంత్రిగా చర్యలు తీసుకుంటానంటూ ఇన్‌ఛార్జి మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డితో ఘాటుగా చెప్పడంతో సమావేశం అంతా ఒక్కసారిగా నిశ్శబ్ధమైంది!
అలాగే, తాగునీటి సరఫరా అంశంపై జరుగుతున్న చర్చలో జెడ్పీ సీఇవో కైలాష్‌గిరేశ్వర్ సమాధానాలు ఇస్తూ పదేసార్లు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే..విప్లవవందనాలతో సభను ప్రారంభించే మంత్రి శత్రుచర్ల ‘తెలుగు రాదా’ అంటూ జెడ్పీ సీఈవోను ప్రశ్నించారు. డీఆర్‌సీలో వందలాది మంది అధికారులు, ప్రజాప్రతినిధుల ఉండగా, ఇంగ్లీషు మాట్లాడే అధికారికి తెలుగులో మాట్లాడమంటూ శత్రుచర్ల సూచించారు.
కార్యకర్తలకు అందుబాటులో ఉంటా..
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అనేక పథకాలను కొంతమంది తమవిగా చెప్పుకుంటున్నారని, అటువంటి వారిని కార్యకర్తలు గుర్తించి ఇంటికి సాగనంపాలని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాదిరి చెప్పేదొకటి, చేసే దొకటని విమర్శించారు. ఇటీవల ఆయన కార్యకర్తల సమావేశంలోమాట్లాడుతూ ఈ పర్యాయం అధికారంలోకి రాకపోతే జెండా ఉండదని పేర్కొనడం చూస్తుంటే, ఇక అధికారంలోకి టిడిపి రాదని ఆయన ముందుగానే గ్రహించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే రానున్న ఎన్నికల్లో మరల అధికారం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ త్వరలో నిర్వహించనున్న స్థానిక ఎన్నికలు 2014 ఎన్నికలకు పునాదుల వంటివని చెప్పారు. పార్టీని క్రియాశీలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు వివిధ మండల, గ్రామ కమిటీలు వేసి పార్టీని పటిష్టం చేయాలని అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేళ్లలో చేపట్టిన పథకాలే రక్షగా పేర్కొన్నారు. టిడిపి ఎన్ని కుట్రలు పన్నినా, కొత్తగా వచ్చిన పార్టీలు ఎన్ని పత్రికలు, ఛానళ్లు పెట్టినా ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని అన్నారు. పార్టీలు మారిన వారికి ఎందుకు మారారో త్వరలోనే అర్ధవౌతుందని, జీతం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయరని, భావజాలం కోసం పనిచేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాసన సభ్యులు కొర్ల భారతి, నిమ్మక సుగ్రీవులు, మీసాల నీలకంఠంనాయుడు, జుత్తు జగన్నాయకులు, శాసన మండలి సభ్యుడు పీరుకట్ల విశ్వప్రసాద్, డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ సంక్షోభం త్వరలోనే సమసిపోతుంది
విద్యుత్ సంక్షభం త్వరలోనే సమసి పోతుందని మంత్రి ధర్మాన అన్నారు. రానున్న నవంబర్‌లోగా విద్యుత్ సమస్య గట్టెక్కడానికి సర్కార్ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో గ్యాస్, నీటి కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, వినియోగానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతోనే ఈ సంక్షోభమన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రాణభయంతో పరుగులు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 4: మండలంలో చిలకపాలెం సమీపంలో ఉన్న వరం పవర్‌ప్లాంట్‌లో గురువారం ఒంటిగంట ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే టర్బైయిన్ ఆయిల్ ఇండికేటర్ వద్ద లీక్ కావడం, దీనికి ఉష్ణోగ్రత తోడుకావడంతో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో క్వాయర్ వైర్లు అగ్నికి ఆహుతై రెండుకోట్లు నష్టం వాటిల్లిందని ప్లాంట్ మేనేజర్ శర్మ అధికారులకు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యర్ధపదార్ధాలైన చెరకు పిప్పు, ఊక, సరుగుడు, రంపపుపొట్టు, కట్టిజనుము వినియోగించి రోజుకు 1.44 లక్షలు యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ఈ ప్లాంటులో తొలిసారి ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సమీపంలో ఉన్న నాగార్జున అగ్రికెమ్ డి.జి.ఎం పి.కనకారావు నేతృత్వంలో సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పవర్‌ప్లాంట్ కావడంతో ఫోమ్‌ఎక్యూప్‌మెంట్‌తో మంటలను అదుపుచేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఒ జి.గణేష్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. టర్బెయిన్ ఇండికేటర్‌ను ఆర్డీఒ స్వయంగా పరిశీలించి భద్రతాచర్యలపై ఆరాతీశారు. ప్రమాదం జరిగిన తీరుతోపాటు కార్మికులెవరైనా క్షతగాత్రులయ్యారా అని ప్రశ్నించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఘటనపై ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్లతో విచారణ జరిపించి భద్రతాచర్యలు మరింత కట్టుదిట్టం చేయనున్నామన్నారు. పవర్‌ప్లాంట్ ఇ.డి బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటై 11 ఏళ్లు అయిందని, ఎప్పుడూ ఇటువంటి ఘటన చోటుచేసుకోలేదని వివరించారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు నడుమ పరిశ్రమను నిర్వహిస్తున్నామని, విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ 3.70 పైసలకు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల నష్టాలు భరించాల్సి వస్తోందన్నారు. ఇటువంటి తరుణంలో అగ్నిప్రమాదం సంభవించడం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉందన్నారు. తహశీల్దార్ వి.శివబ్రహ్మానంద్, జె.ఆర్.పురం సి.ఐ కె.వేణుగోపాలనాయుడు, ఎస్సై ఎల్.సన్యాసినాయుడులు పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టారు.
15 నుండి చేపలవేటపై నిషేధం
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్యక్రమబద్దీకరణ చట్టం ప్రకారం ఈ నెల 15వ తేదీ నుండి మే 31వ తేదీవరకు సముద్రంపై మెఖనైజ్డ్, మోటార్లు ఇంజనీర్లు కలిగి ఉన్న మరపడవల ద్వారా చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు మత్స్యశాఖ ఉపసంచాలకులు కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేట చేసిన యెడల 2,500 రూపాయలు జరిమానా విధించబడునని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
నేడు బ్యాంకర్ల సమావేశం
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటలకు నిర్వహిస్తున్నట్టు లీడ్‌బ్యాంకు మేనేజర్ సి.హెచ్.శ్రీనివాసశాస్ర్తీ గురువారం ఒక ఫ్రకటనలో తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసిక సమావేశమన్నారు. ఈ సమావేశానికి బ్యాంకర్లు, సంబంధిత అధికారులు పాల్గొనాలని కోరారు.
13న మత్స్యనారాయణ జయంతి
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: మత్స్యకారులు శక్తిదర్శనం చేసుకోవాలని మత్స్యకార సంక్షేమ సమితి గౌరవ అధ్యక్షుడు ఎం.ఎర్రన్న పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మత్స్యకార సంక్షేమ సమితి గత ఏడు సంవత్సరాలుగా కాకినాడ కేంద్రంగా తీరప్రాంత జిల్లాల్లో భక్తి, సేవా కార్యక్రమాల ద్వారా మత్స్యకారులను ఐక్యమత్యం చేసేందుకు విశేష కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మత్స్యనారాయణ జయంతి సందర్భంగా ఈ నెల 13వ తేదీన మత్స్యనారాయణ మాలధారణ(దీక్ష), దేవాలయ ప్రతిష్ఠామహోత్సవాలు జిల్లాలో గార మండలం కె.మత్స్యలేశంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. మత్స్యకారులు తమ దైవం పట్ల భక్తిని ప్రదర్శించుకునే అవకాశం ఆసన్నమైందని, మత్స్యకారులకు తీర్ధస్థలంగా గుర్తింపు తేవాలని కోరారు. మత్స్యనారాయణ దేవాలయ ప్రతిష్ఠామహోత్సవానికి మత్స్యకారులంతా తరలిరావాలని కోరారు. తొలుత మత్స్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు చోడిపల్లి శ్రీరాములు, జలుమూరు సత్యం, హరి, చిట్టిబాబు సాహు, మైలపల్లి సూర్యనారాయణ, సదాశివుని మన్మధేశ్వరరావు, నూకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్యుని సేవలో రాష్టమ్రంత్రులు
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: రాష్ట్ర న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం సాయంత్రం అరసవల్లి ఆదిత్యుని సన్నిధిలో గడిపారు. ముందుగా ఆలయ మర్యాదలతో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యాలయ సిబ్బంది మేళతాళాలు, పూర్ణకుంభంతో లోపలకు ఆహ్వానించారు. మంత్రులు ఇరువురు స్వామివారి ధ్వజస్థంభానికి తొలి ప్రణామములు చేసి ఆరోగ్య ప్రదాత ఆదిత్యనారాయణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనివెట్టి మండపం వద్దకు చేరుకున్న మంత్రులకు అర్చకులు ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలందించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్‌రెడ్డి ఆలయ విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, కాంగ్రెస్ నాయకులు సుంకరి కృష్ణ, పాలిశెట్టి మధుబాబు, టి.మోహిని, ఆర్డీఒ గణేష్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్తమ క్రికెటర్లను అందిస్తాం
* ఎసిఎస్ డైరెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్
శ్రీకాకుళం, ఏప్రిల్ 4: జాతీయ స్థాయి క్రికెట్ జట్లకు కోస్తా ఆంధ్రా జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఉత్తమ క్రీడాకారులను అందించేందుకు కృషిచేస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రయత్నంలో భాగంగా జిల్లాలో వెనె్నలవలస నవోదయ విద్యాలయాన్ని సందర్శించామన్నారు. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నంలో కూడా కొన్ని పాఠశాలలను ఈ శిక్షణకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రధానంగా ఉమెన్ క్రికెట్ టీమ్‌ను పటిష్ఠం చేసే ప్రయత్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందన్నారు. ఎంపిక చేయబడిన క్రీడాకారులకు ఆరు నుండి ఇంటర్మీడియేట్ వరకు క్రికెట్ శిక్షణతోపాటు విద్య, వసతి సౌకర్యాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందన్నారు. జిల్లాలో ఎం.ఎస్. దీపక్, సూరజ్‌ప్రీతంలు అండర్ 16-19లో ఆడుతున్న విషయం గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట పట్ల విపరీతమైన క్రేజ్ ఉన్న నేపధ్యంలో అందులో రాణించాలంటే అందరి సహకారం అవసరముందన్నారు.
విద్యుత్ చార్జీలపై కిరణ్‌సర్కార్ తీరు సరికాదు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 4: ప్రజలు, ప్రతిపక్షాలు విద్యుత్ చార్జీలు పెంపును నిరసించడమే కాకుండా అధికార పక్షంలో కూడా నిరసనగళం వినిపించడంతో కిరణ్‌సర్కార్ కిరణ్‌సర్కార్ మాటమార్చడం సరికాదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపేలా నిర్ణయాలు తీసుకుని తమకు సంబంధం లేదని దాటవేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఆధీనంలోనే ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు పనిచేస్తాయన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి పాలవుతామన్న భయంతోనే పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తోందని విమర్శించారు. ప్రత్యేక పాలన కొనసాగించి స్థానిక సంస్థలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దీని కారణంగా పౌరులు ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి పనులు ముందుకు సాగకపోవడంతో గ్రామాలన్నీ రోగాల బారిన పడుతున్నాయన్నారు. గ్రామీణులు దాహం కేకలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
‘పానీ’పట్టు యుద్ధం
ఎచ్చెర్ల, ఏప్రిల్ 4: ఓ పక్క ఎండలు ఠారెత్తిస్తుండగా మరోవైపు భూగర్భజలాలు అడుగంటడంతో పల్లెల్లో పానీపట్టు యుద్ధాలు ఆరంభమయ్యాయి. మండలంలో అల్లినగరం గ్రామంలో ప్రజలు నీటిపథకం కోసం వర్గాలుగా విడిపోయి అధికారులను చెమటలు పట్టిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం నుంచి 16 ట్యాప్‌పాయింట్ల ద్వారా అల్లినగరం ఎస్సీ, యాదవకాలనీలకు మంచినీరు సరఫరా అవుతోంది. అయితే ప్రశాంతినగర్ కాలనీకి ఇదే పథకం నుంచి నీరివ్వాలని కొన్నాళ్లుగా వారంతా పట్టుబడుతుండగా మిగిలిన వారు దీనికి నిరాకరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తహశీల్దార్, అదే గ్రామానికి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న వి.శివబ్రహ్మానంద్ గురువారం సాయంత్రం గ్రామానికి చేరుకుని పనులు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ, యాదవ కాలనీ వాసులు విస్తరణ పనులకు అడ్డుతగిలారు. చేసేది లేక అధికారులు వెనుదిరగగా ప్రశాంతినగర్ కాలనీవాసులు తహశీల్దార్ వాహనాన్ని అడ్డుకుని ఆర్‌డబ్ల్యూఎస్ ఎ.ఇ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సుధారాణిలను ముందుకు కదలనివ్వకుండా బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎల్.సన్యాసినాయుడు ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ నుంచి తహశీల్దార్‌ను ముందుకు సాగేలా స్థానికులకు సర్దిచెప్పి సముదాయించారు. తాత్కాలికంగా ఈవివాదానికి తెరపడినప్పటికీ మున్ముందు మంచినీటి యుద్ధాలు జరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
నలుగురు ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి
*ఉత్వర్వులు జారీ చేసిన డిఐజి
శ్రీకాకుళం , ఏప్రిల్ 4: జిల్లాకు చెందిన నలుగురు ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి కల్పిస్తూ డిఐజి స్వాతిలక్రా గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. టెక్కలి ఎస్సైగా పనిచేస్తున్న మోహన్‌రావును జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి సిఐగా పదోన్నతి కల్పించారు. ఇచ్ఛాపురం ఎస్సై కె శ్రీనువాసరావు, కంచిలి ఎస్సై ఎం శ్రీనువాసరావులను శ్రీకాకుళం సిసిఎస్‌కు సిఐలుగా నియమించారు. రాజాం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి సోమశేఖర్‌ను సిఐగా పదోన్నతి కల్పిస్తూ అనకాపల్లి మహిళా పోలీసుస్టేషన్‌కు బదిలీచేశారు.