విజయనగరం, ఏప్రిల్ 4: 3‘ఇందిరమ్మ కలలు’ను సాకారం చేయాలని సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ఆయన రంగారెడ్డి నుంచి వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై అమలుపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి క్యాబినెట్ కమిటీ సూచనల మేరకు 3ఇందిరమ్మ కలలు2గా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నామకరణం చేసినట్టు మంత్రి పితాని పేర్కొన్నారు. తొలి విడతగా ప్రచారాన్ని 5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి నుంచి డాక్టర్ అంబేద్కర్ జయంతి వరకు ప్రచారం చేపట్టాలన్నారు. 40 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో కళాజాతల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. వీటికి ఆయా జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. కళాజాతల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో మండల రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారులు, సంక్షేమశాఖల అధికారులు, వివిధ శాఖల ఇంజనీర్లు పర్యటించి మంచినీరు, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, ఇతర వౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కార్యదర్శి మిన్నీ మాధ్యూ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంపై క్షేత్రస్థాయి అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జెసి హేమసుందర్ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్, బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, కళాజాతల నిర్వహణకై షెడ్యూలు రూపొందించినట్టు తెలిపారు. జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా రూ.60 లక్షలు విలువ గల ఆస్తులను 95 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి రేమాండ్ పీటర్, సాంఘీక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్లు ఉన్నారు.
పాము కలకలం
విజయనగరం, ఏప్రిల్ 4: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పాము కలకలం సృష్టించింది. గురువారం మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో పాములోడు ఆటో ఎక్కినపుడు పాము బుట్టలో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో చుట్టు ప్రక్కల ప్రజలు హడలిపోయారు. పాము అటూ, ఇటు పరుగు పెట్టడంతో దానిని పట్టుకోడానికి తిప్పలు పడ్డారు. సుమారు అర్థగంట దాటిన తరువాత దానిని కర్రతో కొట్టి చంపారు. చివరకు అందరు ఊపిరి పీల్చుకున్నారు.
నేడు కేంద్ర మంత్రి కిశోర్ రాక
విజయనగరం, ఏప్రిల్ 4 : కేంద్రం గిరిజన వ్యవహారాలు, పంచాయితీరాజ్ శాఖా మంత్రి వి.కిషోర్‌చంద్రదేవ్ శుక్రవారం డిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖనుంచి బయలుదేరి కురుపాం చేరుకుంటారు. శుక్ర,శనివారాల్లో అక్కడే బసచేస్తారు. 7వ తేదీ ఉదయం 9.30 గంటలకు సాలూరు చేరుకుని స్థానిక శాసన సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కురుపాం చేరుకుంటారు. 7,8 తేదీల్లో కురుపాంలోనే బసచేస్తారు. 9వ తేది సాయంత్రం 4 గంటలకు అరసాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం తిరిగి కురుపాం చేరుకుంటారు. 10,11 తేదీల్లో అక్కడే బసచేస్తారు. 12వ తేది ఉదయం 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా బామిని చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి బయలుదేరి కురుపాం చేరుకుంటారు. 13వ తేది నుంచి 15వ తేది వరకు కురుపాంలోనే బసచేస్తారు. 16న మెంటాడ, పార్వతీపురం మండలాల్లో పర్యటించి కురుపాం చేరుకుంటారు. 17 నుంచి 19 వరకు కురుపాంలోనే బసచేస్తారు. 20వ తేదిన 9.00 విశాఖబయలుదేరి వెళతారు.
‘అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి’
విజయనగరం , ఏఫ్రిల్ 4: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో లంకాపట్నంలో గురువారం డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు, అభివృద్ధికి అంబేద్కర్ ఎన్నో మార్గదర్శిక సూత్రాలను రూపొందించారన్నారు. ముఖ్యంగా అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిందన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి యడ్ల ఆదిరాజు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు పి.హైహింద్‌కుమార్, పట్టణ కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు సోము రామకోటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ సమరానికి నేతలు సన్నద్ధం
విజయనగరం, ఏప్రిల్ 4: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించడంతో నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ దఫా ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతల మధ్య పోటీ పెరిగింది. దీంతో జనాధరణ, విజయావకాశాలు ఉన్న అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు అనే్వషణ చేస్తున్నాయి. యువతకు, మహిళలకు ప్రాధాన్యమివ్వాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో స్థానిక పదవులను ఆశిస్తున్న ఆశావహులు పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నేతల ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. గత కొనే్నళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఎప్పటికైనా పదవి దక్కకపోతుందా అని ఎదురుచూసిన నాయకులు ఈ దఫా ఎన్నికల్లో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పదవులకు పోటీ పెరిగింది. ఇదిలా ఉండగా మరోప్రక్క ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు భిన్నమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. స్థానిక ఎన్నికలు సమీపించడంతో గ్రామీణ ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రత్యేకించి కొత్త ఓటర్లను చేర్పిస్తున్నారు. మరోప్రక్క కాంగ్రెస్ నేతలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా ఉండగా, ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఎంసెట్ శిక్షణకు వచ్చిన
గిరిజన విద్యార్థిని అదృశ్యం
సీతానగరం, ఏప్రిల్ 4: మండల పరిధిలోని జోగింపేట వద్ద ఉన్న ప్రతిభా గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రిన్సిపల్ సత్యరాజులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా అరకు వేలికి చెందిన సి.హెచ్. వెంకటలక్ష్మి ఎం.సెట్ శిక్షణ నిమిత్తం మార్చి31న పాఠశాలకు వచ్చింది. తరువాత రోజున ఎవ్వరికి చెప్పకుండా శిక్షణ నుంచి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయంపై తోటి విద్యార్థినులను అడగ్గా తనకు ఎం.సెట్ శిక్షణకు రావడం ఇష్టం లేదని వెంకటలక్ష్మి చెప్పిందన్నారు. అదృశ్యమైన తరువాత విద్యార్ధిని తల్లిదండ్రులను సంప్రదించగా ఇంటికి రాలేదని వారు తెలిపారు. ఇదిలా ఉంటే వెంకటలక్ష్మి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే విద్యను అభ్యసించింది. మార్చి 19న ఇంటర్ పరీక్షలను ముగించుకుని స్వగ్రామానికి వెళ్లి 31న ఎం.సెట్ శిక్షణకు వచ్చింది. గిరిజన పాఠశాలలో ఉన్న విద్యార్థిని అదృశ్యమవ్వడం మండలంలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ విషయంపై గిరిజన సంక్షేమశాఖ అధికారులు విద్యార్థిని అదృశ్యంపై విచారణ చేపడుతున్నారన్నారు. ఈ మేరకు సీతానగరం ఎస్.ఐ. జి.ఏ. వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల వద్దకు వెళ్లి ఉండవచ్చునని విద్యార్థిని తల్లి సత్యవతి వాపోతున్నారు.
జగజ్జీవన్‌రామ్ జయంతి నిర్వహణపై జె.సి సమీక్ష
విజయనగరం, ఏప్రిల్ 4 : బాబు జగజ్జీవనరామ్ 106వ జయంతి ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పిఎ శోభ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగజ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించినందున కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక అంబేద్కర్ కళ్యాణమంపంలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం పలు చూచనలు ఇచ్చారు. ఇందిరమ్మ సంక్షేమ బాట ప్రచార కళాజాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ పధకాల క్రింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్‌పిసిఇఓ మోహనరావు, డిఆర్‌ఓ బిహెచ్‌ఎస్ వెంకటరావు, డ్వామా పిడి శ్రీరాములనాయుడు, డిఆర్‌డిఎ పిడి జ్యోతి, ఎస్సీ సోసైటీ ఇడి మనోరమ, సోషల్ వెల్ఫేర్ డిడి జీవపుత్రకుమార్, మున్సిపల్ కమీషనర్ గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు.
‘చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం’
విజయనగరం , ఏప్రిల్ 4: జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో రేపు మహిళలు-పిల్లలు పట్ల జరుగుతున్న నేరాలపై న్యాయ అవగాహన సదస్సును గంట్యాడ మండలం టి.టి.డి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముత్యాల నాయుడు తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జి.రోహిణి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జిల్లా ఎస్పీ కార్తికేయలతోపాటు రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు తమ్మన్నశెట్టి, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.ముత్యాలనాయుడు పాల్గొంటారని చెప్పారు. మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు, వారి రక్షణకు న్యాయస్థానాలు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై ప్రజలకు , మహిళలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
‘ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి’
విజయనగరం (్ఫర్టు), ఏఫ్రిల్ 4: పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో 13వ వార్డు పరిధిలో టౌన్ సెంటర్ లేవుట్‌లో రోడ్డు నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అయిదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, మరెన్నో అభివృద్ధిపనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని కోలగట్ల చెప్పారు. అందరి సహకారంలో పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్, కాంగ్రెస్‌నాయకులు సోము రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘పట్టణ అభివృద్ధికి కృషి‘
విజయనగరం , ఏఫ్రిల్ 4: పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.వి.డి.్ఫణిరామ్ అన్నారు. గురువారం ఇక్కడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలాస గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన ఇక్కడ స్పెషల్‌గ్రేడ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఫణిరామ్ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఎరువులు, విత్తనాల పంపిణీకి పటిష్ఠమైన ఏర్పాట్లు
గజపతినగరం, ఏప్రిల్ 4 : ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకురాలు లీలావతి చెప్పారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాలకు చెందిన 53 వేల క్వింటాళ్ల వరివిత్తలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కేటాయించిందన్నారు. గడచిన ఏడాదిలో 43 వేల క్వింటాళ్లు సరఫరా జరిగినట్లు చెప్పారు. గడచిన ఏడాదిలో లక్ష్యానికి మించి పంటల రుణాలు అందజేశామన్నారు. 660 కోట్లు రుణాలు అందజేయాలని లక్ష్యం కాగా 880 కోట్లు అందజేశామన్నారు. 2013-14 సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు రుణాలు అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పంటల సాగుపట్ల రైతులను చైతన్య వంతుల్ని చేయడానికి ఈనెల 22 నుంచి మే 9 వరకు గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు జరుగుతాయన్నారు. వ్యవసాయం దాని అనుబంధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు సదస్సులకు హాజరు కానున్నట్లు చెప్పారు. రైతులు తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించడం వలన పంటల సాగు వ్యయం తగ్గుతుందన్నారు. ఈ పరీక్షల వలన పంటలకుఅవసరమైన ఎరువులు ఎంత మోతాదు మేరకు వాడాలో తెలుస్తుందన్నారు. జిల్లాలో 15 వేల మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు జరప నున్నట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేయడం వలన శిలీంద్రం, బూజు తెగుళ్లు పంటలకు సోకకుండా నివారించ వచ్చునని చెప్పారు. సమావేశంలో ఎడిఎ సిహెచ్ లచ్చన్న పాల్గొన్నారు.
పథకాల అమలు తీరుపై ఆరా
పార్వతీపురం, ఏప్రిల్ 4: గిరిజన ప్రాంతాల్లోని చేపడుతున్న పథకాల అమలుపై గురువారం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వాణీ శ్రీరాం పరిశీలించారు. ఇందులో భాగంగా ఐటిడిఎ సబ్‌ప్లాన్ పరిధిలోని కురుపాం మండలంలోని గొటివాడ స్వయం సహాయక సంఘాల పనితీరును పరిశీలించారు. ఈ సంఘం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. తద్వారా ఆర్థికంగా వారి కుటుంబాల పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందోనని ప్రశ్నించారు. అలాగే వారి పిల్లలు చదువు సంధ్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. సంఘాలు బలోపేతం కావడానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా గొటివాడ నిర్వహించే బాలబడి కేంద్రం నిర్వహణను కూడా ఆమె పరిశీలించారు. అలాగే రంగుపురంలోని సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్న గిరిజన రైతులతో ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ చర్చించారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఇప్పటికే 166 కుటుంబాలు సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా వివిధ రకాల పంటలు పండిస్తున్నారని ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా సబ్‌ప్లాన్ పరిధిలో మరో పదివేల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయ విధానం ద్వారా
పండించేందుకు గిరిజన రైతులకు తగిన ప్రోత్సాహం అందించే చర్యలు తీసుకున్నామని వివరించారు.