అనంతపురం, ఏప్రిల్ 4 : జిల్లాలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాలన సులువుగా మారనుంది. ఇప్పటివరకూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం కొత్తగా కదిరి, కళ్యాణదుర్గం కేంద్రంగా రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యింది. జిల్లాలో చాలా రోజులుగా రెవెన్యూ డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పటికీ బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా ప్రజల ఆశ తీరింది. ఈ మేరకు రెండు అదనపు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన దస్త్రం కదిలింది. ప్రస్తుతం ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లను ఐదుగా మార్చేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 457ను జారీ చేసింది. డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన సలహాలు, సూచనలను నెల రోజుల లోపు అందచేయాలని పై ఉత్తర్వులలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత వైశాల్యం కల జిల్లాల్లో అనంతపురం జిల్లాది మొదటి స్థానం. 19.13 లక్షల హెక్టార్లువైశాల్యం కలిగిన జిల్లాలో ఇప్పటివరకూ మూడు రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. వీటిని ఐదు డివిజన్లుగా చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా వినవస్తోంది. ప్రస్తుతమున్న రెవెన్యూ డివిజన్లు ప్రజలకు అంతగా అందుబాటులో లేవన్న అభిప్రాయం ఉండేది. మారుమూల గ్రామాల నుంచి రెవెన్యూ డివిజన్ కేంద్రానికి రావాలంటే కొన్ని గ్రామాల నుంచి రెండు వందల కిలోమీటర్లకు పైగానే ప్రయాణించాల్సి వచ్చేది. ఇది ప్రజలకు ఎంతో అసౌకర్యంగానూ, ఆర్థికంగానూ ఇబ్బందికరంగా ఉండేది. అటు ప్రజలు, ఇటు ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలో కదిరి, కళ్యాణదుర్గంలను రెవెన్యూ డివిజన్లు చేయాలని నిర్ణయించింది. పై రెండు రెవెన్యూ డివిజన్లలోకి ఏయే మండలాలు చేర్చాలన్న దానిపైనా ఉత్తర్వుల్లో పేర్కొంది.
జిల్లా ఏర్పాటయ్యిందిలా ..
అనంతపురం జిల్లా ఒకప్పుడు కడప, కర్ణాటక లోని బళ్లారి జిల్లాల్లో అంతర్భాగంగా ఉండేది. అనంతపురం జిల్లా 1882లో ఏర్పాటయ్యింది. అప్పట్లో కదిరి తాలూకాలోని కదిరి, ముదిగుబ్బ, ఎన్‌పి కుంట, తలుపుల, నల్లచెరువు, ఓడిసి, తనకల్లు, ఆమడగూరు, గాండ్లపెంట మండలాలు కడప జిల్లాలో అంతర్భాగంగా ఉండేవి. 1910వ సంవత్సరంలో వీటిని అనంతపురం జిల్లాలోకి కలిపారు. అటు తరువాత మరోమారు అనగా 1956వ సంవత్సరంలో బళ్లారి జిల్లాలో ఉన్న రాయదుర్గం, డీ. హీరేహాళ్, కణేకల్, బొమ్మనహాళ్, గుమ్మగట్ట మండలాలను అనంతపురంలోకి చేర్చారు. దీంతో అనంతపురం జిల్లా 63 మండలాలతో పూర్తి జిల్లాగా సంతరించుకుంది. దీని ప్రకారం
అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో 20 మండలాలు, ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో 17 మండలాలు, పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో అత్యధికంగా 23 మండలాలు ఉండేవి. కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రకారం కదిరి రెవెన్యూ డివిజన్‌లో12 మండలాలు, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో పది మండలాలు, ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలు, పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాలు, అనంతపురం డివిజన్‌లో అత్యధికంగా 19 మండలాలు ఉన్నాయి. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పుడు పెనుకొండ డివిజన్‌లో అత్యధికంగా 26 మండలాలు ఉండేవి. ప్రస్తుతం కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో అనంతపురం డివిజన్‌లో 19 మండలాలు అత్యధికంగా ఉండబోతున్నాయి. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని మండలాలతో కదిరి రెవెన్యూ డివిజన్ ఏర్పడబోతోంది. ఇక రాయదుర్గ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని మండలాలతో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది.
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
బుక్కరాయసముద్రం, ఏప్రిల్4: బుక్కరాయసముద్రం మండలం గోవిందపల్లి రెవెన్యూ సదస్సులో రైతు సమస్యలను కలెక్టర్ దుర్గాదాస్ అడిగి తెలుసుకున్నారు. గురువారం గోవిందపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన హాజరై రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని రెవె న్యూ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది పంపిణీ చేసిన ఇన్‌పుట్ సబ్సిటీ పంట నష్టపరిహారం పంపిణీ గురించి, రెవెన్యూ రికార్డుల, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో మండల అధికారుల నుండి ఏవై నా సమస్యలు ఉన్నాయో అని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను అడంగళ్, 1-బిలను పరిశీలించారు. ముఖ్యంగా గ్రామస్థులు యంపిటిసి ముసలన్న ద్వారా తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. ఒకే సర్వే నెంబర్లలో వేసుకున్న బోర్లలో నీరు రాకపోయినా, చాలీచాలని నీటితో అరెకరం సాగుచేసినా ఇన్‌పుట్ సబ్సిడీ రాలేదని గ్రామానికి లోకలైజేషన్ కాలు వ ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ నుండి తూము మంజూరు అయి సంవత్సరాలు గడిచినా ఇంతవరకూ కాలువలో నీటిజాడ కూడా కనపడకపోయినా అందులో నీటి పారుదలకింద భూముల్ని పొందుపరచడంతో ఇన్‌పుట్ సబ్సిటీ, పంట నష్టపరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో ఫ్లొరైడ్ కారణంగా తాగునీరు లేక ప్రజలు రోగాలబారిన పడుతున్నారని ప్రభుత్వం మంచినీటిని పైపులైన్ల ద్వారా తాగునీటివసతి కల్పించాలని కోరారు. వర్షాలు రిస్తే డ్రైనేజీలు లేక ఇళ్ళలోకి నీరువచ్చి రోగాల బారిన పడుతున్నామన్నారు. బోయ కొట్టాల నుండి అనంతపురానికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ల రహదారి అధ్వాన్న స్థితిలో ఉందని రహదారి ఏర్పాట్లకు ఎన్‌ఆర్‌ఐజి పథకం కింద రహదారిని వేయించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ రైతులకు, ప్రజలకు త్వరలోనే సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి మురళి, మండల తహశిల్దార్ నాగరాజు, ఆర్‌ఐ ఈశ్వర్, వీఆర్‌వో పెద్దన్న, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు ఆంకె.నరేష్, పలువురు రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. ఈసందర్భంగా గోవిందపల్లి రెవెన్యూ రికార్డులు పరిశీలించిన కలెక్టర్ తహశీల్దార్ నాగరాజును అభినందించారు.
సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
హిందూపురం రూరల్, ఏప్రిల్ 4: ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులు భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికేనని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం మండల పరిధిలోని వినాయకనగర్ కాలనీలో తహశీల్దార్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ గ్రామస్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ, రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగకుండా అక్కడికక్కడే తమ సమస్యలను పరిష్కరించడం కోసం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ రెవెన్యూ లెక్కలకు సంబంధించి అన్ని వివరాలను రెవెన్యూ సదస్సుల్లో ఉంచడం జరుగుతుందని, ప్రజలు వాటిని పరిశీలించి చేర్పులు, మార్పులు అవసరమైతే చేసుకోవచ్చన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి క్లెయిం అర్జీలను అందచేస్తే అక్కడికక్కడే పాసు పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. రైతులకు రెవెన్యూ సదస్సులు ఎంతగానో తోడ్పడుతుందని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. వినాయకనగర్ పరిధిలో తాము నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఆ ప్రాంత వాసులు జెసికి వినతి పత్రం సమర్పించారు. వినతిని పరిశీలించిన జెసి వెంటనే పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు అందించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. వీవర్స్ కాలనీ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఆటల మైదానం స్థలం విషయంలో కొందరు దురాక్రమణలకు పాల్పడుతున్నారని, ఈ స్థలాన్ని పాఠశాలకే చెందేలా చూడాలని జెసిని మాజీ ఎంపిటిసి రామాంజినేయులు కోరారు. ఇప్పటికే ఈ స్థలాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొందని, దీన్ని ఆట స్థల మైదానానికి ఉపయోగించుకోవచ్చని జెసి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి ఈశ్వర్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలి
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం వ్యవహిస్తున్న తీరుపట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తవౌతున్నాయని, ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందని తెలుగుదేశం నేతలు తెలిపారు. గురువారం పట్టణంలోని టి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన పెంచిన విద్యుత్ చార్జీలపై సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని, అందుకు అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో తొలి రోజులు హాజరుకావడంతోనే ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత వుందో స్పష్టంగా తెలిపోయిందని నియోజక వర్గం ఇన్‌చార్జి ఉన్నం హనుమంతరాయచౌదరి తెలిపారు. ప్రజలు మోయలేని విద్యుత్ భారాన్ని వేయడంతో అన్ని వర్గాల్లోను వ్యతిరేకత వచ్చిందని, అధికారంలో వున్న మంత్రులు సైతం పెంచిన చార్జీలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.టిడిపి హయాంలో ప్రజలపై ఇలాంటి భారాలు ఎప్పుడు మోపలేదన్నారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరెసుకోవ చ్చని వారు ఎద్దేవా చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటన చేయాలని, లేదంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతం చేస్తామన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రం చీకటి ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. వృద్దులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల నుంచి విశేషంగా స్పందన రావడంతోనే తొలి రోజు 3003 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని దేశం నేతలు తెలిపారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో టి సర్కిల్ నందు ఆరు కేంద్రాల్లో 3003 మంది సంతకాలు చేశారని పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ డికే రామాంజినేయులు, మాజీ కన్వీనర్ దొడగట్ట నారాయణచౌదరి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, చాపిరి సింగల్ విండో అధ్యక్షులు తిమ్మారెడ్డి, సీనియర్ నేతలు బాదన్న, శివశంకర్, రామాంజినేయులు, నారాయణస్వామిలతో పాటు, రఘు, శ్రీనివాసరెడ్డి, రాము, గోవిందు, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో
ఫైవ్‌ఎస్ చేపట్టండి
గుంతకల్లు, ఏప్రిల్ 4: ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలతో పాటు ఇంట్లో సైతం ఫైవ్‌ఎస్‌ను చేపట్టాలని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ తేజేందర్‌పాల్ సింగ్ పిలుపునిచ్చారు. స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలో గురువారం ఫైవ్‌ఎస్ ర్యాలీని డిఆర్‌ఎం తేజేందర్‌పాల్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఎం మాట్లాడుతూ రైల్వేలోని ప్రతి శాఖలో ఫైళ్లను అందుబాటులో వుంచే విధంగా ఫైవ్‌ఎస్‌ను అనుసరించాలన్నారు. కార్యాలయంలో అత్యవసరమైన సమయంలో కార్యాలయంలోని రికార్డులను అందుబాటులో వుంచుకోవడమే ఫైవ్‌ఎస్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. అంతేకాక రైల్వే ఉద్యోగులు తమ ఇండ్లలో సైతం ఫైవ్‌ఎస్‌ను అలవాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. డిఆర్‌ఎం కేంద్ర కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ కార్యక్రమంలో గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్‌తో పాటు ఎడిఆర్‌ఎం సత్యనారాయణ, సీనియర్ డిసిఎం విక్టర్‌బాబు, డివిజన్ స్థాయి అధికారులు, ఉద్యోగులు, కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మడకశిర, ఏప్రిల్ 4: పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొంటూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే సుధాకర్‌లు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఐకెపి కార్యాలయ ఆవరణలో దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మహిళలకు రూ.10 వేల కోట్ల రుణాలను అందచేయడం జరిగిందన్నారు. మహిళలు పాడి రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. జిల్లాలో గత 2012లో వేరుశెనగ పంట సాగు చేసి నష్టపోయిన 7.32 లక్షల మంది రైతులకు రూ.648 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా రూ.18,867 కోట్ల వాతావరణ బీమా సైతం మంజూరయిందని, మరో రెండు నెలల్లో రైతుల ఖాతాలకు జమ కానున్నట్లు తెలిపారు. మహిళలు తమ పిల్లలను బాగా చదివించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం దీపం పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన గ్యాస్ కనెక్షన్‌లను పంపిణీ చేశారు. అదే విధంగా గుడిబండ, రొళ్ళ, అగళి మండలాల్లోని వాటర్‌షెడ్ పరిధిలో ఉన్న మహిళా సంఘాలకు రూ.76 లక్షల రుణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, ఐకెపి ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన్ పాల్గొన్నారు.
తాగునీటి కోసం మహిళల రాస్తారోకో
హిందూపురం రూరల్, ఏప్రిల్ 4: హిందూపురం రూరల్ మండలం కిరికెర గ్రామానికి చెందిన మహిళలు గురువారం తాగునీటి కోసం కిరికెర గేట్ వద్ద ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో తూమకుంట పారిశ్రామిక వైపు వెళుతున్న జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని రహదారిపై అడ్డుకొని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, గత 15 రోజులుగా గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జెసికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న బోరులో నీరు తగ్గిపోయిందని, మరిన్ని పైపులను వేసి నీరు అందించాల్సిన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గ్రామానికి తాగునీరందించాలని మహిళలు డిమాండ్ చేశారు. మహిళల సమస్యలను విన్న జెసి వెంటనే ఎంపిడిఓ ఆదినారాయణకు సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడి కిరికెర గేట్ వద్దకు పిలిపించారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి గురించి రెండు రోజుల క్రితమే తన దృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకొంటున్నట్లు ఎంపిడిఓ జెసికి తెలిపారు. రెండు రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలని జెసి ఎంపిడిఓను ఆదేశించారు. దీంతో మహిళలు తమ నిరసన విరమించారు. పెనుకొండ ఆర్టీఓ ఈశ్వర్, తహశీల్దార్ విశ్వనాథ్ తదితరులు ఈ సందర్భంగా జెసి వెంట ఉన్నారు.
లాంతర్లతో టిడిపి ప్రదర్శన
అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 4: విద్యుత్ ఛార్జీలను, కోతలను వ్యతిరేకిస్తూ టిడిపి నాయకులు నగరంలో లాంతర్లతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. గురువారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభమైన ఈప్రదర్శనలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఆలం నరసానాయుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి మహలక్ష్మి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రం చీకటి ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. ప్రజలకు విద్యుత్‌ను అందించలేని కిరణ్‌కుమార్‌రెడ్డి ఉగాది నుండి పంపిణీ చేయనున్న నిత్యావసరాల వస్తువుల్లో లాంతర్లను, విసనకర్రలను పంపిణీ చేయాలన్నారు. ఈసందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈకార్యమ్రంలో నాయకులు ఆదినారాయణ, కృష్ణకుమార్, నారాయణస్వామియాదవ్, సరిపూటిరమణ, స్వామిదాస్ పాల్గొన్నారు.
రాంనగర్‌లో సిపిఎం ధర్నా
విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ కోతలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాంనగర్‌లో ధర్నా నిర్వహించారు. ఈధర్నాలో మాజీ కార్పొరేటర్, పార్టీనాయకురాలు డా.ప్రసూన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే నేడు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలుపడ్డాయన్నారు. విద్యుత్ కోతలతో లక్షలమంది ఉపాధి కోల్పోయారన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.