Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో జిల్లాకు మొండి చేయి

$
0
0

కడప, ఏప్రిల్ 4 : పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో రెవెన్యూ డివిజన్లను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో జిల్లాకు స్థానం లభించలేదు. జనాభా ప్రతిపాదికన, మండలాల సంఖ్యను బట్టి జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఎంతో అవసరం. ఇందులో భాగంగానే గతంలో రాయచోటి, మైదుకూరును రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ముఖ్యంగా బ్రిటీష్ పాలనలో రాయచోటిలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉండేది. చిన్నమండెం సమీపంలోని కేశాపురం వద్ద సబ్‌కలెక్టర్ విడిది కూడా ఉండేది. నేటికి అది శిథిలావస్థకు చేరుకుని రూపరేఖలు మారాయి. జిల్లాకు ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఒక క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర చైర్మన్ ఉన్నప్పటికీ రెవెన్యూ డివిజన్ మంజూరు చేయించలేక పోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. అంతేగాకుండా ముఖ్యమంత్రి, జిల్లా మంత్రుల మధ్య మనస్పర్థలు, పంతాల కారణంగానే రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లలో జిల్లా అవకాశం లభించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే జిల్లా పొరుగున ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి రెండు రెవెన్యూ డివిజన్లను మంజూరు చేయించుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అర్బన్ రెవెన్యూ మండలంతో పాటు 50 రూరల్ రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో కడప, జమ్మలమడుగు, రాజంపేటల్లో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. జనాభా ప్రతిపాదికపై మండలాల వారీగా తీసుకున్నా పదేసి మండలాలను కలుపుతూ మొత్తం 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మూడు రెవెన్యూ డివిజన్లతో పాటు మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అవుతాయని పలువురు భావించారు. అంతేగాకుండా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండేసి నియోజకవర్గాలకు ఒక రెవెన్యూ డివిజన్ చొప్పున ఏర్పాటు చేసినా జిల్లాకు రెండు ఖాయమని అనుకున్నారు. అయితే అందరి ఊహాలు, ఆశలు ఆడియాశలయ్యాయి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నట్లేతే నేడు జిల్లాకు అన్యాయం జరిగేది కాదని పలువురు బహాటంగా చెబుతున్నారు. అంతేగాకుండా ఆయన మరణాంతరం అభివృద్ధిని కూడా జిల్లా నేతలు గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ మండల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు అధికారులు అంటున్నారు. వీటన్నింటికి తోడు ప్రస్తుతం రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. ఈనేపథ్యంలో జిల్లాపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండి కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అనమతి లభించకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో జిల్లాకు అన్యాయం జరిగిందనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని జిల్లాలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శిశు మరణాలు తగ్గించాలి
* ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి
కడప (క్రైం), ఏప్రిల్ 4 : శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రిమ్స్‌లోని ఐపి విభాగంలో నవజాత శిశు అత్యవసర చికిత్స విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు మరణాలు తగ్గించి, మెటర్నటీ రేటును పెంచేందుకు నవజాత శిశు అత్యవసర చికిత్సా విభాగం ప్రజలకు ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో 1000 శిశువులకు 43 మంది మరణిస్తున్నారని ఆ సంఖ్య 30 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే లక్ష మంది గర్భవతుల్లో 134 మంది చనిపోతున్నారని, వాటిని 80 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్‌ఆర్ హెచ్‌ఐ కింద ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే ప్రొద్దుటూరులో ఆసుపత్రి ప్రారంభించామని, ఇక్కడ డాక్టర్ల కొరత ఉన్నందువల్ల ఆలస్యమైందన్నారు. శిశు మరణాల రేటు తగ్గించి లక్ష్యాన్ని అధికమిస్తామనే నమ్మకం ఉందన్నారు. ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యులు ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకురాగా, ఏడు సంవత్సరాల క్రితం తాను ఆరోగ్య శాఖ మంత్రిగా లేనప్పుడు కొన్ని నిర్ణయాల వల్ల తీసుకున్నారని ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రి యాజమానులు 30 శాతానికి పెంచాలని చర్చలు జరుగుతున్నాయన్నారు. ఒక వేళ చర్చలు సఫలం అయితే 15 శాతం పెంచవచ్చని తెలిపారు. రిమ్స్ పిజి సీట్ల కోసం చాలా అవస్థలు పడి ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఒకే సారి అంత రేటింపు చేయకుండా నిదానంగా పెంచితే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ సిద్దప్ప గౌరవ్, ఆర్‌ఎంఓ వెంకట రత్నం, సూపరింటెండెంట్ రామ్‌చరణ్, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ మార్కెట్‌కు చౌక బియ్యం!
ప్రొద్దుటూరు, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాశయంతో పేద ప్రజలకు పట్టెడు అన్నం లభించేలా ప్రవేశపెట్టిన పథకాల్లో ఒక్కటైన కిలో రూ.2 బియ్యం దళారుల అవతారంతో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో పేద ప్రజలకు అందక అక్రమ రవాణాకు సిద్ధమై వేల రూపాయలు గడిస్తున్నారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరులో అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉన్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలిస్తూనే వారిపై చర్యలు చేపడుతున్నామని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికి ఎలాంటి ప్రయోజనాలు కనిపించకపోవడంతో బియ్యం కోసం ఎదురుచూస్తున్న పేదవారు నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు తదితర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని పలు విధాలుగా ప్రొద్దుటూరు పట్టణానికి తరలించి స్థానికంగా ఉన్న కొన్ని రైస్‌మిల్లులలో వాటిని శుద్ధి చేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్న సంబందిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదు. ప్రదానంగా మైదుకూరు రోడ్డులోని రింగు రోడ్డులో అదికంగా జరుగుతున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు మాత్రం అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని నామమాత్రపు ప్రకటనలతో సరిపెట్టుకోవడం జరుగుతోంది. పట్టుబడిన తర్వాత 6- ఎ కేసులు, జాయింట్ కలెక్టర్‌కు నివేదిక పంపించామని చెప్పడంతోనే సరిపోతుంది. అనంతరం సంబందిత దళారులుకానీ, డీలర్లుకానీ యథావిధిగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రొద్దుటూరు మండల పరిధిలో దాదాపు 120 మందికిపైగా రేషన్‌షాపులు ఉన్నాయి. ఇందులో కొంతమంది రాజకీయ పలుకుబడితో దళారులు ఏకంగా ఒక్క పేదవానికి కిలో బియ్యం కూడా పంపకం చేయకుండా అమ్మేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా మూడు రకాలుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇందులో డీలర్ల వద్ద నుంచి బియ్యాన్ని స్వాధీనపరచుకోవడం, రేషన్ మిల్లులకు తరలించి వాటిని శుద్ధి చేసి సాదారణ బియ్యం మాదిరిగా ప్యాకెట్లను రూపొందించి పులివెందుల, కదిరి, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే విధంగా కిలో రూపాయికే తెచ్చుకున్న లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పడి-కొలత రూపంలో బియ్యాన్ని సేకరించి వాటన్నింటిని ఒక గోడౌన్‌లోకి తరలించడం, వాటిని శుద్ధి చేసి తరలించడం జరుగుతుంది. ఇంకొక విధంగా రేషన్‌షాపు డీలర్లతో, ఇటు లబ్ధిదారులతో ఇద్దరితో కుమ్మక్కై దళారుల అవతారమెత్తి చౌక దుకాణాల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో దాదాపు నెలరోజులుగా స్థానిక రెవెన్యూ కార్యాలయాలలో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండకపోవడంతో పాటు రెవెన్యూ సదస్సులలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే అదునుగా భావించిన బియ్యం స్మగ్లర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్మగ్లర్లు తమ వ్యాపారాలను వివిధ రూపాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో బైపాస్ రోడ్డు తదితరప్రాంతాలల్లో ఒక ప్రముఖ బియ్యం స్మగ్లర్‌కు చెందిన 8గోడౌన్‌లు ఉన్నట్లు అధికారులు గతంలో నిర్దారించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ రవాణాను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేద ప్రజలు వాపోతున్నారు.

జోరుగా క్రికెట్ బెట్టింగ్!
* ముంబయి క్రికెట్ బుకీలతో పందేలు
కడప, ఏప్రిల్ 4 : ఐపిఎల్ క్రికెట్ పోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కోట్లల్లో జరుగుతోంది. ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా నేతృత్వంలో గేమింగ్ యాక్ట్ కింద ఒక పక్క కేసులు నమోదు చేస్తూ క్రికెట్ బుకీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినా ఫలితం లేదు. నేరుగా ముంబయి క్రికెట్ బుకీలతో జిల్లాలోని ప్రొద్దుటూరు, కడప కేంద్రాల బుకీలకు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఫోన్ల మీద చైన్ సిస్టమ్‌తో పందేలు కాస్తున్నట్లు సమాచారం. క్రికెట్ బెట్టర్లు, బుకీలు తమ చాకచక్యంతో పోలీసుల కంట పడకుండా పందేలు కాస్తున్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో క్రికెట్ బెట్టింగ్‌లు ఉండేవి. ప్రస్తుతం మండల కేంద్రాలకు కూడా పాకడంతో కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. క్రికెట్ బుకీలు నివాస గృహాలను స్థావరాలుగా ఏర్పర్చుకుని పందేలు కాస్తున్నట్లు తెలిసింది. గతంలో టివిలు రహస్య స్థావరాల్లో ఉంచుకుని స్కోర్‌ను వీక్షించే వారు. ప్రస్తుతం సెల్‌లు, ఫేస్ బుక్కులు, ల్యాప్‌టాప్‌ల ద్వారా క్రికెట్‌ను వీక్షిస్తూ పందేలు జోరుగా కాస్తున్నారు. ముఖ్యంగా యువత, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు పందేలు కాస్తున్నట్లు సమాచారం. ముంబయితోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు తదితర పట్టణాలకు చెందిన ఆటగాళ్లు కూడా కడప, ప్రొద్దుటూరులకు తరలివచ్చి జోరుగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఐపిఎల్ పుణ్యామా అని జిల్లాలో కోట్లాది రూపాయలు క్రికెట్ బెట్టింగ్‌లు కాస్తున్నారు.

అర్హులకు న్యాయం చేయాలి
* ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి
ఖాజీపేట, ఏప్రిల్ 4 : ఎన్‌ఎంబిఎస్ పథకం కింద అర్హులందరినీ గుర్తించి న్యాయం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్‌ఎంబిఎస్ కింద భర్తను కోల్పోయిన మహిళకు 5 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి వచ్చిన 156 మందికి 8.90 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ పరిహారం నిజమైన లబ్ధిదారులకు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 2004 నుంచి 20013 వరకు ఎంత మందికి ఇచ్చారనే వివరాలను కలెక్టర్ కార్యాలయం నుంచి తెప్పించుకుని పరిశీలించాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించమని హెచ్చరించారు. నిధుల కొరత ఉంటే సిఎం రిలీఫ్ ఫండ్ నుండి విడుదల చేయిస్తామన్నారు. భర్తను కోల్పోయిన మహిళలకు ఇచ్చే 5 వేలను 25 వేల రూపాయలకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి జయరామ్ రమేష్‌తో చర్చించానన్నారు. అలాగే ఇటీవల కొందరు మాజీ ప్రజాప్రతినిధులు కార్యాలయాని వస్తే పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ఆర్డీవో వీరబ్రహ్మం మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అసైన్‌మెంట్ భూములు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. 1 నుండి 6 వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీల మేరకు పట్టా కలిగిన వ్యక్తికే భూములు అందేలా చూస్తామన్నారు. అంతేగాకుండా వాటిని ఇందిర జలప్రభ కింద అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ సమత, తహశీల్దార్ మహబూబ్ చాంద్, వ్యవసాయాధికారి ప్రవీణా, వెలుగు కో- ఆర్డినేటర్ ధనుంజయ్, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు బుజ్జమ్మ, సావిత్రమ్మ, ఎఇలు మహబూబ్‌బాషా, నాగేశ్వరరెడ్డి, ఇఓఆర్డీ రాధాకృష్ణవేణి, విఆర్వోలు, కార్యదర్శులు మహిళలు పాల్గొన్నారు.
ఇసుక వాడకంపై కలెక్టర్ వివరిస్తారు
ప్రస్తుతం ఇసుక రవాణాపై నిషేధం ఉండడం వల్ల ఇసుకను తరలించకుండా అధికారులు చూస్తున్నారని, ఒకవేళ ఇసుకను వాడుకోవాలంటే కలెక్టర్ అనమతిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో కొందరు స్థానికులు కలిసి దేవాలయాలకు ఇసుకను తోలుకునేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన ఆయన ఆలయాలు, చర్చిలు, ఇందిరమ్మ గృహాలు నిర్మించుకునేందుకు ఇసుక కావాలంటే ఎవరిని సంప్రదించాలో కలెక్టర్ తెలియజేస్తారన్నారు.
ఇరిగేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు
* జిల్లా ఇరిగేషన్ శాఖ ఎస్‌ఇ క్షేత్రబాల
రైల్వేకోడూరు, ఏప్రిల్ 4: జిల్లాలో ఇరిగేషన్ అభివృద్ధి కోసం రూ. 25 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆ శాఖ జిల్లా ఎస్‌ఇ వి.క్షేత్రబాల తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అంతకు మనుపు బుడుగుంటపల్లె గ్రామ సమీపంలో జరిగిన బావి దుర్గటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన నిధులతో జిల్లా వ్యాప్తంగా 33 అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఈ పనులకు టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల పక్కన ఉన్న చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. చెరువుల ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. ఎస్‌ఇ వెంట డిఇ వీరేంద్రబాబు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
* మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ మురళీకృష్ణ
ప్రొద్దుటూరు, ఏప్రిల్ 4: రాయలసీమ పరిధిలోని మున్సిపాల్టీల్లో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాయలసీమ మున్సిపల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. గురువారం ప్రొద్దుటూరు మున్సిపాల్టీకి విచ్చేసిన ఆయన స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల రికవరీలో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో 93 శాతంతో ముందంజలో ఉందన్నారు. అదేవిధంగా చిత్తూరు, మదనపల్లె, ప్రొద్దుటూరు, డోన్, బద్వేల్, తదితర మున్సిపాల్టీల్లో తాగునీటి సమస్యకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రీజియన్ పరిధిలో తాగునీటి కోసం ఏడు కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. దీంతో బోర్లు, ట్యాంకుల ద్వారా ప్రజలకు నీరు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డిఇ రామచంద్రప్రభు, తదితరులు పాల్గొన్నారు.

సరస్వతీ నిలయంపై దాడి హేయమైన చర్య
* కాంగ్రెస్ ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవౌళి
జమ్మలమడుగు, ఏప్రిల్ 4: వ్యక్తిగత మనస్పర్థలను సరస్వతీ నిలయంపై దాడిచేయించడం హేయమైన చర్య అని కాంగ్రెస్ ఒబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవౌళి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గండికోట టూరిజం అతిథిగృహం వద్ద కాంగ్రెస్ వర్గాల్లో జరిగిన ఘర్షణ సంఘటనలో నాగేంద్రయాదవ్, చంద్రవౌళి గాయపడిన విషయం విధితమే. బుధవారం రాత్రి చంద్రవౌళికి చెందిన రామిరెడ్డిపల్లె దారిలో వున్న విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలను ధ్వంసం చేయడంతో పాటు, పాఠశాలకు చెందిన టాటా మ్యాజిక్ వాహనాన్ని కాల్చిలేశారు. జరిగిన సంఘటనతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వుంటుందని చంద్రవౌళి తెలిపారు. వ్యక్తి గత మనస్పర్థాలతో పాఠశాలపై ఎమ్మెల్యే అనుచరులతో దాడులు చేయించడం బాధాకరమన్నారు. దీనిపై జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కలిసిరావాలన్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
బిసిలను అణగదొక్కేందుకే దాడులు
బిసి వర్గ నాయకులను అణగదొక్కేందుకే దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిథి బండి ప్రభాకర్ ఆరోపించారు. గురువారం జరిగిన సంఘటనలపై నాగేంద్రయాదవ్, చంద్రవౌళిని జిల్లా బిసి నాయకులు పరామర్శించారు. అనంతరం విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బండి ప్రభాకర్ మాట్లాడుతూ ఇలాంటి దాడుల వల్ల బిసి మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి శివనారాయణ చంద్రవౌళిని పరామర్శించారు. ఇటువంటి దాడులు జరుగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు ఎస్పీ రాక?
చేనేత మంత్రి పర్యటన జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ వర్గ నాయకుల్లో గండికోట వద్ద బుధవారం దాడులు జరిగిన సంఘటన చోటు చేసుకున్న విషయం విధితమే. చేనేత శాఖామాత్యులు పర్యటన వారం పది రోజుల ముందు నుండే వర్గ బేధాలు బయటపడే అవకాశం వుందని సర్వత్రా వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో చేనేత మంత్రి పర్యటన పట్టణంలో సజావుగా సాగినా ఆఖరు సమయంలో మాత్రం దాడులు జరిగాయి. విషయం బాహాటంగానే వినిపిస్తున్నా పోలీసులు సరైన చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. బుధవారం సాయంత్రం దాడులు జరిగిన తరువాత కూడా అప్రమత్తం కాకపోవడం వల్లనే పాఠశాలపై దాడులు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఆరా తీస్తున్న ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా శుక్రవారం జమ్మలమడుగుకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఇందిర జలప్రభను
సద్వినియోగం చేసుకోండి
* డ్వామా పిడి యదుభూషణరెడ్డి
సుండపల్లె, ఏప్రిల్ 4 : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పిడి యదుభూషణరెడ్డి సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఓపెన్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భూములు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. 7.5 ఎకరాల భూమి ఒకే చోట ఉన్న రైతులకు ఈ పథకం కింద ఉపాధి పనులు చేపడతామన్నారు. ఇందులో కంపచెట్లు, రాళ్ళు, మొద్దులు తొలగించుట, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు బోరు వేయించి డ్రిప్, మామిడి చెట్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం వల్ల ఒక్కొక్క రైతుకు సుమారు లక్షా 50వేలు మిగులుతుందన్నారు. మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు సద్వినియోగం చేసుకుని పంటల్లో అధిక దిగుబడులు సాధించినందుకు రైతులు, ఉపాధి సిబ్బందిని అభినందించారు. అలాగే మాచిరెడ్డిగారిపల్లెలో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. అలాగే ఉపాధి కూలీలకు ఈనెల 1వ తేదీ నుంచి కూలి రేటును 149 పెంచిందన్నారు. ఏప్రిల్, మే నెలలకు అదనపు కూలిని చెల్లిస్తుందన్నారు.
ఉపాధిలో 16,596 అవినీతి
2012-13 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి కింద మండల వ్యాప్తంగా రూ. 3 కోట్ల 28లక్షల పనులు జరిగాయని, అయితే 7వ విడత సామాజిక తనిఖీలలో 16వేల 596 రూపాయలు అవినీతి జరిగిందని తెలిపారు. ఈ నగదును పూర్తిగా రికవరీ చేసినట్లు ఎంపిడిఓ జనార్ధన్‌రావు తెలిపారు. అలాగే పెన్షన్‌ల కింద గ్రామ కోఆర్డినేటర్లు రూ. 48 వేలు అవినీతి జరగా, అందులో 44వేల రూపాయలను రికవరీ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి వెంకటస్వామి, క్వాలిటీ కంట్రోల్ అధికారి బాషా, పెన్షనర్ల జిల్లా ప్రతినిధి ప్రసాద్, ఎపిడి స్వరూప్, ఎపిఓ ఉమామహేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

యువకుడి దారుణ్య హత్య
కడప , ఏప్రిల్ 4 : నగరంలోని సాది చెంగయ్య వీధిలో బుధవారం అర్ధరాత్రి యువకుడు ఖాజామైనుద్దీన్ (22) హత్యకు గురయ్యాడు. టు-టౌన్ పోలీసుల వివరాల మేరకు బెల్లంమండి వీధిలో నివసించే షేక్ ఖాజామొహిద్దీన్, మేదరువీధికి చెందిన సయ్యద్ మొహిద్దీన్ బాషా, మట్టి పెద్దపులికి చెందిన ఆచారి ముగ్గురు కలిసి సోహాల్ అనే స్నేహితునికి ఫోన్ చేశారు. అయితే సోహాన్ ఫోన్ బబుల్ దగ్గర ఉండడంతో నీవు ఎవడివిరా అంటూ ఇరువురి మధ్య వాగ్వివాదం నెలకొంది. అయితే నువ్వు ఎక్కడ ఉండావు అంటూ నీ అంతు తేలుస్తామని అంటూ వస్తుండగా బబుల్ ఈ విషయాన్ని అన్న హుస్సేన్‌కు చెప్పడంతో వీరు ఇరువురు కలసి రవీంద్ర నగర్‌లో నివాసం ఉంటున్న షేక్ ఖాజా మైనుద్దీన్‌ను తీసుకువచ్చారు. అయితే వీరి ఇరువర్గాలు మధ్య ఘర్షణ నెలకొనడంతో షేక్ ఖాజామొహిద్దీన్ చేతిలో ఉన్న కత్తిని తీసుకుని మైనుద్దీన్‌ను పోడవడంతో అక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని మైనుద్దీన్ తండ్రి షేక్ గౌస్ బాషా ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* మైదుకూరు, రాయచోటి ప్రతిపాదనలు హుళక్కేనా..
english title: 
revenue divisions

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>