తిరుపతి, ఏప్రిల్ 4: తిరుమలకు వచ్చే భక్తుల ఆధారంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారుల పట్ల టిటిడి రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ దుకాణాలను మూసివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, దుకాణదారులు గురువారం కూడా షాపులు మూసివేసి ఆందోళనకు దిగారు. వీరి సమస్య పరిష్కరించేందుకు బుధవారం రాత్రి తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి నేత ఓవిరమణ, పెంచలయ్య దుకాణదారులకు బాసటగా నిలిచారు. దుకాణదారులను ఇబ్బంది పెట్టడం ధర్మం కాదన్నారు. దీంతో టిటిడి స్పందించింది. దుకాణదారులు, స్థానికులు గురువారం టిటిడి జేఇఓకు సమస్యను వివరించారు. గతంలో తమకు దుకాణాలుకు ముందు మూడు అడుగులు స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ మేరకే తాము వస్తువులు పెట్టుకున్నామన్నారు. కొంత మంది దుకాణదారులు జేఇఓ ముందు కన్నీంటి పర్యంతమవుతూ దుకాణదారుల పట్ల టిటిడి రెవెన్యూ అధికారులు అమర్యాదగా ప్రవరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన జేఇఓ దుకాణాలకు ముందు రెండు అడుగుల వరకూ వస్తువులను పెట్టుకోచ్చని హామీ ఇస్తూ రెవెన్యూ, హెల్త్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై వారానికి ఒకరోజు లేదా నెలకు ఒక పర్యాయం దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఇఓ హామీతో సమస్య సద్దుమణిగింది. దీంతో దుకాణాలు తెరుచుకున్నాయి.
వేర్వేరు సంఘటనల్లో ముగ్గురి మృతి
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి,
అనుమానాస్పద స్థితిలో యువతి, ట్రాక్టర్ కింద పడి బాలుడు...
మదనపల్లె, ఏప్రిల్ 4: ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇంటి నుంచి కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళుతూ మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని ఐషర్‌వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. మదనపల్లె రూరల్ ఎఎస్‌ఐ మున్నాసాబ్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... మదనపల్లె పట్టణం కురవంకకు చెందిన అబ్ధుల్జ్రాక్ కుమారుడు సయ్యద్ సాల్మాన్ (19) మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ చిత్తూరురోడ్డుకు 10కిలోమీటర్ల సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నాడు. కళాశాలకు ద్విచక్రవాహనంలో వెళ్ళివచ్చే వాడు. కొంతకాలం క్రితం తండ్రి మృతిచెందాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన స్నేహితుడు తారీఫ్ (19)తో కలిసి ద్విచక్రవాహనంలో కళాశాలకు బయలుదేరాడు. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. సయ్యద్ ఇమ్రాన్ (19) అక్కడికక్కడే మృతిచెందగా, స్నేహితుడు తారీఫ్ (19) తలకు, కాళ్లకు గాయాలై ప్రక్కనే ఉన్న వాగులో పడిపోయాడు. ఢీకొన్న గుర్తుతెలియని వాహనం వెళ్ళిపోయింది. సంఘటనా స్థలాన్ని సిఐ వంశీధర్‌గౌడ్, ఎఎస్‌ఐ మున్నాసాబ్‌లు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ తెలిపారు.
ఇదిలా ఉండగా ఓ యువతి గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె 7నెలల గర్భిణీగా గుర్తించారు. ఈ సంఘటన కురబలకోట మండలం తెట్టు పంచాయతీలో జరిగింది. ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. మదనపల్లె పట్టణ శివారుప్రాంతం తట్టివారిపల్లె బైపాస్‌రోడ్డులో నివాసముంటున్న రమణ స్థానికంగా స్కూటర్ మెకానిక్‌గా పనిచేసుకుని జీవిస్తున్నాడు. ఇతనికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ళ కితం తట్టివారిపల్లెకు చెందిన నందిని (22) అనే యువతితో సంబంధం ఏర్పరుచుకుని వేరే కాపురం పెట్టాడు. నందిని ప్రస్తుతం 7నెలల గర్భిణి. కురబలకోట మండలం తెట్టు పంచాయతీ కేంద్రం సమీపం రోడ్డుప్రక్కనే నందిని శవమై పడి ఉంది. నందిని కాళ్ల నుంచి శరీరమంతా కాలిన గాయమై శవమై కన్పించింది. గురువారం తెట్టు గ్రామస్థులు గమనించి ముదివేడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నందిని శరీరమంతా కాలిపోవడంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాల్మీకిపురం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన గురువారం గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. గుర్రంకొండ మండలం శ్రీనివాసపురంకు చెందిన రవి కుమారుడు విష్ణు (3) గ్రామ పొలిమేర్లలో గురువారం ఉదయం ఉపాథిహామి పథకం పనులు జరుగుతున్న చోట ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అక్కడ వున్న ట్రాక్టర్ దొర్లుకుని విష్ణు మీదకు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు వాల్మీకిపురం ఎస్‌ఐ పరశురాముడు కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తున్నాడు.
తితిదే విజిలెన్స్‌కు దొరికిపోయన దళారులు
తిరుపతి, ఏప్రిల్ 4: తిరుమల శ్రీవారి దర్శనార్థం కెనడాకు చెందిన ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ భక్తులను అక్రమ మార్గంలో దర్శనానికి పంపే ప్రయత్నంలో ముగ్గురు వెండర్లను తితిదే నిఘా, భద్రతా సిబ్బంది గురువారం అదుపులోకి తీసుకుంది. తితిదే నిఘా, భద్రతాధికారి జివిజి అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు వీరిని విధులనుంచి తొలగించారు. కెనడా దేశానికి చెందిన దంపతులు తమ చంటిబిడ్డతో వైకుంఠంలోని సుపథం మార్గం దగ్గరకు విచ్చేయగా అక్కడి లగేజీ కౌంటరు దగ్గర విధులు నిర్వహిస్తున్న ముగ్గురు వెండర్లు జగన్నాథం, మోహన్, చంద్ర వారి నుంచి 80 డాలర్లు (సుమారు 4000 రూపాయలు) ఒప్పందం కుదుర్చుకుని దర్శనానికి పంపించే యత్నం చేశారు. అక్కడ విధుల్లో వున్న భద్రతా భటుడు శివయ్య వీరిని అడ్డగించి వారిని ఎవిఎస్‌ఓ మల్లికార్జునరావుకు అప్పగించారు. అనంతరం ఎవిఎస్‌ఓ వారిని విచారించి విధుల నుంచి తొలగించారు. తదుపరి విదేశీ భక్తులను యధాప్రకారం సుపధం మార్గంగుండా దర్శనానికి అనుమతించారు.
జిల్లాలో 88 వేల మందికి ఉపాధి
మదనపల్లె, ఏప్రిల్ 4: జాతీయ ఉపాధిహామీ పథకంలో ఎస్టీ, ఎస్సీ భూముల అభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం.. ఇందిర జలప్రభ పథకానికి 580 బోర్లు మంజూరు చేశాం.. ఉపాధిహామీ పథకంలో నెలాఖరులోగా 1.10లక్షల మంది కూలీలకు పనులు కల్పించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నామంటూ డ్వామా పిడి చంద్రవౌళి స్పష్టం చేశారు. బుధవారం మదనపల్లె మున్సిపల్ ప్రత్యేకాధికారి చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిర జలప్రభ ద్వారా ఎస్టీ, ఎస్సీ భూముల అభివృద్ధికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ఇందుకు గాను 580 బోర్లు వేయించినట్లు తెలిపారు. కరెంటు కనెన్షన్‌ల కోసం ట్రాన్స్‌కో ఎస్‌ఇకి ప్రతిపాదించినట్లు వివరించారు. జాతీయ ఉపాధిహామీలో ఇప్పటికే 88వేల మంది కూలీలకు పనులు కల్పించామని, నెలాఖరులోగా 1.10లక్షల మంది కూలీలకు ఉపాధి లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి శనివారం గ్రామాల్లో పనులు డిమాండును గుర్తించి రికార్డులు తయారుచేసి నివేదించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి పంచాయతీ నుంచి 150మంది కూలీలను పనులలో పెట్టేవిధంగా ఉపాధి సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. ప్రతి కూలీకి రూ.149లు పెంచుతూ వేసవిలో 30శాతం అదనంగా చెల్లించనున్నట్లు చెప్పారు. రానున్న వేసవికాలంలో ఉద్యానవన శాఖచే పండ్లతోటల పెంపకాలకు రెండు ఎకరాలు ఉన్నవారికి సైతం మంజూరు చేస్తామన్నారు. గుంతలు తవ్వకాలు ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలో టేకు మొక్కల పెంపకానికి 100నర్సరీలు గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా కరువుప్రాంతంలో మండలానికి కనీసం 2500మంది కూలీలకు ఉపాధి కల్పించే దిశగా కృషిచేస్తుండగా, ప్రస్తుతం 1200-1400మంది కూలీలు పనులు చేసుకుంటున్నట్లు వివరించారు.
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి
వి.కోట, ఏప్రిల్ 4: ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లాపరిషత్ సిఇఓ నాగేశ్వర్‌రావు వెల్లడించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఎంపిడిఓ రమణప్రసాద్‌కు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2012-13 సంవత్సరానికి గాను అన్ని పథకాల కింద తాగునీటికి 140కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తం 2,778పనులు పూర్తి చేశామని, 1016పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 888పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.
అదే విధంగా పలమనేరు నియోజకవర్గ పరిధిలో 8కోట్ల రూపాయలు ఖర్చు చేసి 263పనులు పూర్తి చేయగా 127పనులు వివిధ దశల్లో ఉన్నాయని 114పనులు ప్రారంభం కాలేదన్నారు. వి.కోట మండల పరిధిలో 3కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, 74పనులు పూర్తి కాగా, 64పనులు వివిధ దశల్లో, 18పనులు ప్రారంభం కాలేదన్నారు. అదే విధంగా చేతిపంపులు మరమ్మతులకు గాను జిల్లాకు 50లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు. వీటిలో వి.కోట మండలానికి 61వేల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. బిఆర్‌జిఎఫ్ పథకం కింద మండలంలో 2012-13 సంవత్సరానికి వివిధ పనులకు 63లక్షల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు.
మండలంలో నిర్మిస్తున్న స్ర్తి శక్తి భవనం పూర్తి కావడానికి జిల్లాపరిషత్ నిధుల నుంచి అదనంగా నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈయన వెంట కార్యాలయ సూపరింటెండెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ వినయ్ ఉన్నారు.
ఇద్దరు బిట్రగుంట దొంగలు అరెస్టు
తిరుపతి, ఏప్రిల్ 4: తిరుపతిలో చోరీలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు బిట్రగుంట దొంగలను తిరుపతి సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి వారి నుండి 5.50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను గురువారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న బిట్రగుంట దొంగలను పట్టుకోవాలని అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశించడంతో ఎఎస్‌పి రామమహేశ్వరశర్మ నేతృత్వంలో తిరుపతి క్రైమ్ డిఎస్పీ ఎంవిఎస్ స్వామి ఆధ్వర్యంలో రేంజ్ క్రైం కంట్రోల్ స్క్వాడ్ వీరిని అరెస్టు చేసింది. ఈ సందర్భంగా సిసిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ స్వామి మాట్లాడుతూ తిరుపతిలో కార్లలో, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప బిట్రగుంటకు చెందిన పీట్ల మహేష్ (25), పీట్ల షరీష్ కుమార్‌ను బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శంకరంబాడి సర్కిల్ వద్ద సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. వీరు 2011 మే 5న తిరుపతి సప్తగిరి నగర్‌కు చెందిన రిటైర్డ్ ఇఇ మెగిలి జయశంకర్‌రెడ్డి కరూర్ వైశ్యా బ్యాంకు లాకర్ నుండి బంగారం, వెండి నగలను తీసుకుని కారులో ఇంటికి బయలుదేరారు. తన కారును రోడ్డు పక్కన తన ఇంటికి కొద్దిదూరంలో ఆపి పాల ప్యాకెట్ కోసం వెళ్లారు. ఇదే అదునుగా కారు అద్దాలు పగులగొట్టి ఈ ఇద్దరూ బ్యాగును ఎత్తుకెళ్లారు. మోటార్ సైకిల్‌పై కారును వెంబడించి బ్యాగును చోరీ చేసినట్లు తమ విచారణలో ముద్దాయిలు ఇద్దరు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి వారి నుండి 16 గాజులు, పూసల దండ, 250 గ్రాముల వెండి వస్తువులు, 175 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు, రికవరీలో తిరుపతి క్రైమ్ సిఐ రామచంద్రారెడ్డి, ఎస్‌ఐలు బి ప్రభాకర్‌రెడ్డి, కె చంద్రశేఖర్‌పిళ్లై, సిసిఎస్ సిబ్బంది సుధాకర్, మురళీ, మునిరాజా, శ్రీనివాసులు, మున్వర్‌బాషా, హుస్సెన్, శ్రీనివాసులరెడ్డి, రాధాకృష్ణ, రామయ్య తదితరులున్నారు. వీరికి రివార్డులను ప్రకటిస్తామని డిఎస్పీ తెలిపారు.
‘టీచర్ పోస్టులకు కోతపెడితే సహించం’
చిత్తూరు, ఏప్రిల్ 4: హేతుబుద్ధిలేని హేతుబుద్దీకరణ ప్రక్రియ పేరుతో, ఉపాధ్యాయ పోస్టుల్లో కోతపెడితే, తాము ఉద్యమాలతో వాత పెట్టాల్సి వస్తుందని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంటామోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తలపెట్టిన ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ ప్రక్రియ మూలంగా జిల్లాలో 329 ప్రాథమిక పాఠశాలలు మూత పడడమే కాకుండా, దాదాపు 400పైగా ఎస్‌జిటి పోస్టులు కుదించబడుతున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్టీయు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన గంటామోహన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కారణాలవలన ప్రజలు పట్టణాలకు, నగరాలకు వలసబాట పట్టినందున అక్కడి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువుగా ఉందన్నారు. పదిలోపు పిల్లల సంఖ్య గల పాఠశాలలన్నీ మూసి వేయాలనుకోవడం గ్రామీణ బడుగు, బలహీన వర్గాల వారిని విద్యకు దూరం చేయడమేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులు అందుబాటులో లేకుండా చేశారని, ఇప్పుడు రద్దు అవుతున్న పాఠశాలల పిల్లలకు రవాణా చార్జీలు చెల్లిస్తామని చెబుతున్నారని, గతుకుల రోడ్లలో ఇరుకు ఆటోల్లో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విద్యాహక్కు చట్టానికి వక్రభాష్యం చెప్పి ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయాలనుకోవడం దారుణమన్నారు. 60 మంది పిల్లల వరకు ఇద్దరు టీచర్లు చాలంటున్న ప్రభుత్వం, ఐదు తరగతులకు అన్ని సబ్జెక్టులనూ ఇద్దరు టీచర్లే ఎలా బోధించగలరో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం సెక్షన్లకు భాషాపండితులు, పిఇటి, ఫిజికల్ సైన్స్ పోస్టులు కేటాయించకపోగా, ఉన్న పోస్టులను ఊడ బెరికే విధంగా వున్న జివోనెం.61ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో ఎస్‌టియు జిల్లా నాయకులు కుమారస్వామి, చినరాజన్, దేవరాజులరెడ్డి, పురుషోత్తం, శ్రీనివాసులు, బాలచంద్రారెడ్డి, హరినాధాచ్చారి, మదన్‌మోహన్‌రెడ్డి, హేమాద్రి, జగదీష్, సుబ్రహ్మణ్యంరెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, కులశేఖర్, మునీర్, అహ్మద్, సుబ్రహ్మణ్యంపిళ్ళై, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి తవ్వకాలను పరిశీలించిన ఎమ్మెల్యే
చిత్తూరు, ఏప్రిల్ 4: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని పురాతన కట్టడాలను కూల్చివేసి తవ్వకాలు చేపట్టారు. అందులో ఫిరంగి గుండ్లు బయటపడ్డాని వార్తపత్రికల్లో వార్తలు రావడంపై స్పందించిన చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, తహశీల్దార్ శివకుమార్‌లు గురువారం ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. ఉదయానే్న ఆసుపత్రికి వెళ్లిన తహశీల్దార్ ఫిరంగి గుండ్లు బయటపడ్డ రాళ్లను పురావస్తుశాఖకు అప్పగించేందుకు శాంపుల్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మలు ఆసుపత్రిలోని తవ్వకాలను పరిశీలించారు. తవ్వకాలు జరిపే కాంట్రాక్టర్ మాత్రం తనకేమీ తెలియదని, ఏదో రాళ్ళు బయటపడితే ఆసుపత్రి సిబ్బంది వాటిని సేకరించి పెట్టారే తప్ప ఈ తవ్వకాల్లో మరేమి బయట పడలేదని తెలిపారు. ఇదిలా ఉంటే కమ్యూనిష్టు పార్టీలు పలువురు ప్రజలు మాత్రం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వేలూరు కోటకు సొరంగమార్గం ఉండేదని, గతంలో ఇక్కడ ఫిరంగి గుండ్లతోపాటు బంగారం, వెండి తదితరాలు లభించి ఉంటాయని, అయితే ఆసుపత్రివర్గాలు, కాంట్రాక్టర్లు వీటిని రాత్రికి రాత్రే మాయం చేశారని ఆరోపిస్తున్నారు. సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం బ్రిటీష్ కాలంలో వాడి ఫిరంగి గుండ్లు తవ్వకాల్లో బయట పడ్డాయంటే అలాంటి కట్టడాలు కూల్చే సందర్భంలో పురావస్తు శాఖ, ప్రభుత్వ అధికారుల నిఘాతో పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇకపై తవ్వకాలు చేపట్టేటప్పుడు సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు, పురావస్తు శాఖ శాస్తవ్రేత్తలను దగ్గర ఉంచుకోవాలని, ఈ ఫిరంగి గుండ్లతోపాటు బయటపడ్డ నిధి నిక్షేపాలు సైతం కాంట్రాక్టరు, ఆసుపత్రి వర్గాలను విచారించి ప్రభుత్వానికి అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమలకు వచ్చే భక్తుల ఆధారంగా వ్యాపారం చేసుకుంటూ
english title:
ttd revenue
Date:
Friday, April 5, 2013