ఆదోని, ఏప్రిల్ 4: రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఉన్న 57 వ్యవసాయ మార్కెట్ల నుంచి మార్చి ఆఖరినాటికి రూ. 74.56 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ. 60.56 కోట్ల ఆదాయం వచ్చిందని రాయలసీమ రీజియన్ మార్కెటింగ్‌శాఖ జెడి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లోని మార్కెట్ల ద్వారా గత సంవత్సరం కన్నా రూ. 3 కోట్లు అదనంగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. సీమలోని 57 మార్కెట్లకు గాను 20 మార్కెట్లలో మాత్రమే వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. మిగిలిన మార్కెట్లలో చెక్‌పోస్టులు, వ్యాపారుల ద్వారా ఆదాయం వసూలవుతోందన్నారు. మార్కెట్లలో వచ్చిన ఆదాయంలో 20 శాతం నిధులు అభివృద్ధికి ఖర్చు చేయడానికి వీలుంటుందని చెప్పారు. అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతున్న ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు మొదలగు మార్కెట్లకు నిధుల పరిమితి లేదన్నారు. అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేయవచ్చన్నారు. ఈ సంవత్సరం ఆదోని మార్కెట్లో అభివృద్ధి పనులకు రూ. 1.60 కోట్లు మంజూరు చేశామన్నారు. అనంతపురం మార్కెట్ లక్ష్యం రూ. 2.86 కోట్లు కాగా రూ. 2.89 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇలా పనిచేస్తున్న 20 మార్కెట్ల ద్వారా ఆదాయం సమకూరిందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో జీరో వ్యాపారం నిరోధించడానికి నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జీరో వ్యాపారం జరుగుతున్న మార్కెట్ కార్యదర్శులు చర్యలు తీసుకోకపోతే కార్యదర్శిని మారుస్తామన్నారు. వ్యాపార లావాదేవీలు మార్కెట్లోలో జరగాలే తప్ప బయట కాదన్నారు. అలా జరిగితే చర్యలు తప్పవన్నారు. వ్యాపార లావాదేవీలు బయట జరిగితే రైతులకే నష్టం అన్నారు.
పావలావడ్డీకే రైతులకు రుణాలు
రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం పావలా వడ్డీకే రైతులకు రుణాలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రైతులకిచ్చే రుణాలను ప్రభుత్వం పెంచిందని చెప్పారు. గతంలో రూ. 50 వేల రుణం ఇచ్చేవారని, ఇప్పుడు దాన్ని లక్షకు పెంచారన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర రాలేదని రైతులు భావించినప్పుడు ఆ సరుకును యార్డుకు తెస్తే గోదాంలో నిల్వ ఉంచుకుని రైతు బంధు పథకం కింద వారికి రుణం అందజేస్తామని చెప్పారు. 3 నెలల వరకు రుణాలకు ఎలాంటి వడ్డీ ఉండదన్నారు. 3 నెలల తరువాత వడ్డీ వర్తిస్తుందన్నారు. 3 నుంచి 6 నెలలలోపు సరుకులను రైతులు అమ్ముకోవాల్సి ఉంటుందన్నారు.
ఉపాధి పనుల్లో అక్రమాలకు
పాల్పడితే కఠిన చర్యలు
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కోడుమూరు, ఏప్రిల్ 4: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని క్రిష్ణాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలతో కూలి గురించి ఆరా తీశారు. కూలీలు ప్రతి రోజూ వంద రూపాయలు కూలి వచ్చేలా పనులు చేసుకోవాల్సిన బాధ్యత వారిదే అన్నారు. పని కావాలని వచ్చిన వారికి తక్షణమే పనులు చూపాలని అక్కడి అధికారులను ఆదేశించారు. అలాగే వలసలను నివారించాలని, కూలీలు చేసిన పనులకు వారం రోజుల తర్వాత తప్పనిసరిగా కూలి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రూ. 5 లక్షల వ్యవయంతో నిర్మిస్తున్న పంచాయతీ భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
కూలీ డబ్బులు సక్రమంగా అందజేయండి
ఎమ్మిగనూరు : వేసవికాలం దృష్ట్యా ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు సక్రమంగా అందజేయాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి గురువారం ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసిలో జీవనోపాధి కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్తితుల్లో నీళ్ల కోసం రూ. 5లు, గడ్డపారకు రూ.10లు, మొత్తం కూలీ రూ. 149లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు ఈ డబ్బులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని చిన్నమర్రివీడు, పెద్దమర్రివీడు గ్రామాలను ఆయన సందర్శించారు. అల్వాల గ్రామంలో రోడ్డు లేదని అక్కడి ప్రజలు విన్నవించడంతో రూ. 5 లక్షలను విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వెంట ఉపాధి హామీ ఏపిడి అబ్దుల్‌కలాం, ఎంపిడిఓలు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.
డిసిసి కొత్త అధ్యక్షుడి
ప్రమాణ స్వీకారం నేడు
కర్నూలు, ఏప్రిల్ 4: కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన బోయ ఎల్లా రామ య్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్, నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని డిసిసి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తెలిపారు. డిసిసి అధ్యక్ష పదవి కోసం గత రెండేళ్లుగా నిర్విరామ కృషి చేసిన రామయ్యకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు యువ నాయకత్వం అవసరమన్న పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు రామయ్యను ఎంపిక చేసినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న వాల్మీకి వర్గానికి చెందిన రామయ్య డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా పర్యటించి మండల స్థాయిలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి వారిని ఉత్తేజపరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయ సాధనే లక్ష్యంగా పని చేస్తానని ఇందుకు పార్టీ నాయకుల, కార్యకర్తల సహకారం తీసుకుంటానని బివై రామయ్య వెల్లడిస్తున్నారు.
మల్లన్న సేవలో భన్వర్‌లాల్
శ్రీశైలం, ఏప్రిల్ 4: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామివార్లను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం అధికారులు, రెవెన్యూ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భన్వర్‌లాల్ స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే అమ్మవారి సన్నిధిలోని ఆశీర్వాద మండపం వద్ద శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రూ. 2 కోట్ల విలువైన ఇసుక సీజ్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఏప్రిల్ 4: కర్నూలు నగర శివారులోని తుంగభద్ర నదిలో అక్రమంగా నిల్వచేసిన 11 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను గురువారం విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవమడ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే తుంగభద్రనదిలో నిషేధిత ప్రాంతంలో ఇసుక తవ్వి నిల్వ చేసినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు ఆకస్మికంగా దాడులు చేశారు. నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇసుకను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తే సుమారు రూ. 2 కోట్లు వస్తుందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలు
మూసేస్తే ఉద్యమిస్తాం..
* ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్
కర్నూలు, ఏప్రిల్ 4: విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో వందలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే ఉద్యమిస్తామని ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం చేస్తే దానికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యహరిస్తుందన్నారు. స్థానిక చండ్రరాజేశ్వరరావు భవన్‌లో గురువారం ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన లెనిన్ మాట్లాడుతూ 2010 ఏప్రిల్ 1 నుంచి విద్యాహక్కు చట్టం అమలు చేస్తున్నా, ఆచరణలో నిధులు కేటాయించడం లేదని, అదనపు తరగతి గదులు నిర్మించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించిందని, అయితే ఎలా అమలు చేయాలో చర్చించకుండా పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. దాదాపు 1,258 పాఠశాలలను విద్యార్థులు తక్కువ ఉన్నారని కారణంతో మూసివేయాలని చూస్తుందే తప్ప, విద్యార్థులు ఎందుకు రావడం లేదని చర్చించలేదన్నారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, టీచర్ల పోస్టులు భర్తీ చేయకపోతే విద్యార్థులు ఎలా చేరుతారని ప్రశ్నించారు. మూసివేత నిర్ణయా న్ని విరమించుకుని వౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చే శారు. రాష్ట్రంలోని యూనివర్శిటీ పాలకమండలి సభ్యుల నియామకం మూడేళ్లుగా పెండింగ్‌లో ఉందని వాటి భర్తీకి వెంటనే గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. బడ్జెట్‌లో నూతన యూనివర్శిటీల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. స్వదేశీ యూనివర్శిటీలను అభివృద్ధి చేయకుండా దేశంలోకి విదేశీ యూనివర్శిటీలను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోమని ఐక్యంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న, రామసుబ్బున్న, రమేష్, రంగస్వామి, సురేం ద్ర, రాజు, చరణ్, వెంకట్రాముడు, శ్రీరాములు పాల్గొన్నారు.
రాయలసీమ రీజియన్‌లో ఆదాయంలో
ఆదోని మార్కెట్‌దే అగ్రస్థానం
* జెడి రామాంజినేయులు
ఆదోని, ఏప్రిల్ 4: రాయలసీమలో ఉన్న వ్యవసాయ మార్కెట్లలో అన్ని మార్కెట్ల కన్నా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆదాయంలో ఆగ్రస్థానంలో నిలిచిందని రాయలసీమ రీజియన్ మార్కెటింగ్‌శాఖ జెడి రామాంజనేయులు పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులోని కార్యదర్శి కార్యాలయంలో మధ్యాహ్నం జరిగిన సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. జెడి రామాంజనేయులు మాట్లాడుతూ మార్చి 31నాటికి ఆదోని మార్కెట్ ఆదాయ లక్ష్యం రూ. 7కోట్ల 85 లక్షలుగా నిర్ణయించగా, రూ. 9కోట్ల 10లక్షల ఆదాయం వసూలైందన్నారు. రాయలసీమ జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్లకన్నా ఆదోని మార్కెట్‌లోని అధిక ఆదాయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కమీషన్ ఏజెంట్లు చేస్తున్న సమ్మె విషయాన్ని జెడి దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు కమీషన్ ఏజెంట్లకు అనుకూలంగా లేవని సమ్మె చేస్తున్నారని, ఈవిషయాన్ని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఒకే కుటుంబానికి ఒక్కరే కమీషన్ ఏజెంట్లుగా లైసెన్స్ తీసుకోవాలన్న నిబంధనపైన కమీషన్ ఏజెంట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఆదోని వ్యవసాయ మార్కెట్లో గోదాములు తీసుకున్న కొంతమంది వ్యాపారులు బాడుగ బకాయిలు కట్టకుండా ఉన్న రూ. కోటి బకాయిలను కడితేనే వారికి లైసెన్స్‌లను తిరిగి రెన్యూవల్ చేస్తామని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో రెన్యూవల్ చేయమని ఆయన పేర్కొన్నారు. బకాయిల వసూళ్లను ఖచ్చితంగా చేస్తామని బకాయిలు చెల్లించని వ్యాపారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్తగా లైసెన్స్‌లు తీసుకున్న కమీషన్ ఏజెంట్లు జిఓ.నెం.70ప్రకారం చెల్లించాల్సిన సొమ్మును కూడ చెల్లించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. చెల్లించకపోతే లైసెన్స్‌ల విషయంలో పునరాలోచన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రెవెన్యూ సదస్సును తనిఖీ చేసిన కలెక్టర్
కోడుమూరు, ఏప్రిల్ 4: మండల పరిధిలోని క్రిష్ణాపురం గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి సందర్శించారు. ఈ సదస్సులో పట్టాదారు పాసు పుస్తకాలు, కౌలు రైతులకు రుణ పత్రాలు అందుతున్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. అలాగే గ్రామంలో డి పట్టాల కోసం ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అంతేగాక గ్రామంలో మాన్యం భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వీటిని ఎవరు సాగు చేసుకుంటున్నారు అని ఇక్కడి తహశీశీల్దార్ శివశంకరనాయక్‌ను ప్రశ్నించగా, గ్రామంలో 20 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయని, వీటిని రైతులే సాగు చేసుకుంటున్నారని ఆయన కలెక్టర్‌కు వివరించారు. దీంతో మాన్యం భూములు సాగు చేసే రైతులకు, కౌలు రైతులకు పంట రుణాలు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట ఉపాధి హామీ పథకం ఎపిడి మోహన్‌రావు, ఎపిడి ఈరన్న, కోడుమూరు ఉపాధి హామీ పథకం ఎపిఓ మద్దేశ్వరమ్మ, లక్ష్మీనారాయణ, తహశీల్దార్ శివశంకర్‌నాయక్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ మనోహర్‌రెడ్డి, పిఆర్ డిఇ మల్లికార్జున, కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాసరెడ్డి, హనుమంతు ఉన్నారు.
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
ఆళ్లగడ్డ, మార్చి 4: మండల పరిధిలోని మర్రిపల్లె గ్రామానికి చెందిన బంగారయ్య (35) గురువారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. బంగారయ్య ఉదయమే ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా ఎండ తీవ్రత అధికం కావడంతో మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యాడు. దీంతో వెంటనే అతడిని ఇంటకి తీసుకెళ్లారు.
మళ్లీ సాయంత్రం ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆళ్ళగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎపిఓ రవిప్రకాశ్ తెలిపారు. బంగారయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నట్లు ఎపిఓ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
* మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్
నంద్యాల, ఏప్రిల్ 4: ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్దిచెప్పాలని మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ పిలుపు ని చ్చారు. గురువారం నంద్యాల పట్టణ లో టిడిపి ప్రచురించిన విద్యుత్ సం క్షోభం అన్న బ్లాక్‌పేపర్ కరపత్రాన్ని ఫరూక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు విస్తృత స్థాయి సమావేశంలో ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ముందుచూపులేకనే విద్యుత్ కష్టాలు ఏర్పడ్డాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయని, కేంద్రం ఎప్పుడు పడితే అప్పుడు డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచుతోందని, రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి ఫరూక్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పోటీ పడి ప్రజలపై భారాలు వేస్తున్నాయని, వీరికి పరిపాలించే హక్కులేదన్నారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్దిచెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో ఏడేళ్ల కరవు వెంటాడినా రైతులకు 9గంటల విద్యుత్ సరఫరా చేశారని, సమష్టి నిర్ణయాలే టిడిపి పాలనకు అద్దం పడుతాయని, సిఎం కిరణ్ ఏకపక్ష నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫరూక్ విమర్శించారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ చార్జీలు ఎత్తివేయాలని, సర్‌చార్జీలు తొలగించాలని, పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించి సామాన్యులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర బిసిసెల్ కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు నరహరి విశ్వనాథరెడ్డి, శ్రీశైలదేవస్థానం మాజీ చైర్మన్ యాతం జయచంద్రారెడ్డి, అనుపూరి ప్రసాద్, గోపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్ హయాంలోనే
మైనారిటీల అభివృద్ధి
ఆదోనిటౌన్, ఏప్రిల్ 4: దివంగత ముఖ్యమంత్రి వె ఎస్ రాజశేఖర్‌రెడ్డి హ యాంలోనే రాష్ట్రంలోని ముస్లిం మై నార్టీల అభివృద్ధి జరిగిందని, నేడు ప్రభుత్వం వారిని పూర్తి గా విస్మరించిందని మాజీ ఎ మ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప ట్టణంలోని కౌడల్‌పేట, మ హ్మద్‌షా కాలనీకి చెందిన 150మంది ముస్లిం యువకు లు, మహిళలు వైకాపా మైనార్టీసెల్ జిల్లా నాయకులు ఏ జాజ్ ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు. చేరిన చాంద్‌బాషా, దావుద్‌బాయి, దా దాబాయి, ఉసేన్‌బాషా, ఖాదర్, జి క్రి యా, ఆయూబ్, కాశీం, పర్వీన్, బా నుబీ, జూబేదా, తాయమ్మలకు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ముఖ్యంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. అలాగే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేశారని తెలిపారు. అనేక రుణాలను అందజేశారన్నారు. ప్రస్తుతం నాయకులు కనీస సౌకర్యాలు కూడ కల్పించడం లేదని, విద్యుత్ సమస్య ఉందని చెప్పిన కాలనీవాసులకు న్యాయం జరగడం లేదన్నారు. దీనిపై తాను ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు, వారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాద్‌రావు, మునిస్వామి, దేవిరెడ్డిలు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకై అధికారుల బదిలీలు
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్‌పార్టీని గెలిపించుకోవాలని ఆ పార్టీ నాయకులు కొత్తగా అధికారుల, పోలీసు అధికారుల బదిలీలకు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారుల సహకారంతో పోలీసు పవర్‌తో విజయం సాధించాలని కేంద్రమంత్రి కోట్ల, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసేది ప్రజలని పోలీసులు కాద న్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపొందాలన్న లక్ష్యంతోనే రాజకీయాలు ప్రారంభించారని, దీనిని జిల్లా అధికారులు గమనించాలని కోరారు. ఈ విషయంపై తాను జిల్లా ఎస్పీకి, ఇతర అధికారులకు కలిసి విన్నవిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం ఎవరు పనిచేయొద్దని ఆయన హితవు పలికారు. ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.