నెల్లూరు, ఏప్రిల్ 4: ట్రైడెంట్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్యర్యంలో సముద్ర జలాల నుంచి విద్యుత్ గ్యాస్ పెట్రోలియం, యూరియా వంటి పదార్ధాలు తీయగలమని ఆ సంస్థ చైర్మన్ ఎం కృష్ణప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్విట్జర్లాండ్ దేశ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టగలుగుతున్నామని వివరించారు. దీని కోసం ఈనెల 7వతేదీ మధ్యాహ్నం 2గంటలకు జిల్లాలోని కోడూరు గ్రామం వద్ద బంగాళాఖాతంలో ప్రయోగాత్మకంగా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ ప్రయోగానికి ప్రభుత్వ అధికారులతో పాటు స్విట్జర్లాండ్, నెదర్లాండ్, యునైటెడ్ అరబ్‌ఎమిరేట్, లండన్, నమీబియా, మలేషియా దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతారన్నారు. సముద్ర జలాల నుంచి ఆర్గానిక్, డిసెలైనేషన్ ద్వారా తమ లక్ష్యసాధన నెరవేర్చగలమన్నారు. తాను స్వతహాగా నెల్లూరీయున్ని అయినందున స్థానికంగా డెమో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చాలామంది పెట్టుబడుదారులు సైతం ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు. సముద్ర జలాల డిసెలైనేషన్‌లో మెటాలిక్ సోడియం అనే విలువైన పదార్ధం కూడా వెలువడుతుందన్నారు. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభం సమయంలో కడలి నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయగలిగితే అంత కంటే మించిన భాగ్యం ఏముంటుందన్నారు. అలాగే ఈ డిసెలైనేషన్‌లో మంచినీరు కూడా విడుదల అవుతుందన్నారు. హిమాలయాల్లో లభ్యమయ్యేంతటి స్వచ్ఛమైన తాగునీరు లభ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం గృహ అవసరంగా వినియోగించుకునే మోటార్లు వంటి పరికరాలు సరిపోతాయని వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
బియ్యం దుకాణాల తనిఖీ
వెంకటగిరి, ఏప్రిల్ 4: పట్టణంలోని మార్కెట్ వీధిలో ఉన్న నాలుగు బియ్యం దుకాణాలను గురువారం రాత్రి విజిలెన్స్ ఎస్పీ శశిధర్‌రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నాలుగు దుకాణాల్లో లెక్క ప్రకారం బియ్యం బస్తాలు ఉన్నాయా, లేవా అని తనిఖీలు నిర్వహిస్తునట్లు ఎస్పీ తెలిపారు. లెక్కకు మించి బియ్యం బస్తాలు వున్న షాపులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజలెన్స్ డీఎస్పీ రమేష్‌బాబు, ఇన్స్‌పెక్టర్ కిషోర్‌బాబు, స్థానిక తహశీల్దార్ కృష్ణమూర్తి, సిఎస్‌డీటి మునిరాజా పాల్గొన్నారు.
మరో రెండు సర్దుబాటు చార్జీలతో
మరింత భారం కానున్న విద్యుత్ బిల్లులు
కావలి, ఏప్రిల్ 4: ఇప్పటికే పలు సర్దుబాటు చార్జీలు, సర్‌చార్జీల భారంతో పాటు తాజాగా పెరగనున్న చార్జీలకు అదనంగా ప్రస్తుతం జరుగుతున్న ఏప్రిల్ బిల్లులో మరో రెండు సర్దుబాటు చార్జీలు తోడుకానుండగా విద్యుత్ బిల్లులు మరింత భారం కానున్నాయి. జూలై 2012 నెలలో వాడుకున్న యూనిట్‌లకు సంబంధించి ఒక్కో యూనిట్‌కు 62.13పైసలు, అక్టోబర్ 2010 సంవత్సరంలో వాడుకున్న యూనిట్‌లకు సంబంధించి 29.41పైసలు మొత్తంగా 91.54 పైసలు భారం పడనుంది. సరాసరి అప్పట్లో వాడుకున్న ప్రతి యూనిట్‌కు రూపాయి భారం పడనుండగా, ఏప్రిల్ నెలకు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి రానున్న బిల్లులో ఈమొత్తం కలవనుంది. దీంతో సాధారణంగా వచ్చే బిల్లుకు అదనంగా అతి సామాన్య వినియోగదారుడు సైతం మేనెలలో సుమారు వంద రూపాయిలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈమేరకు ట్రాన్స్‌కో గణాంక విభాగం క్షేత్ర అధికారులకు వర్తమానం రాగా, వీటిని విధించే పనిలో తలమునకలై వున్నారు. ఇప్పటికే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశంతోపాటు అన్ని విపక్షాలు తీవ్ర నిరసన గళాన్ని వినిపిస్తుండగా, రానున్న రోజుల్లో ఈ ఉద్యమాలు మరింత బలపడి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
ముసునూరులో క్షుద్ర పూజలు
భయాందోళనలో గ్రామస్థులు
కావలి, ఏప్రిల్ 4: పట్టణ సమీపంలోని ముసునూరు గ్రామంలో బుధవారం రాత్రి క్షుద్ర పూజలు జరగ్గా గ్రామస్థులు తెల్లవారుఝామున గమనించి భయకంపితులయ్యారు. గ్రామంలో నివాసం వుంటున్న ఓ విఆర్‌ఓ ఇంటి ఎదుటే రోడ్డుపై ఈపూజలు జరగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత చేసి ఉంటారని భావిస్తున్నారు. రోడ్డుపైనే ఓ బాలుడి ఆకారాన్ని ముగ్గుతో వేసి అందులోనే మట్టి బొమ్మను తయారుచేసి వుంచి పసుపు, కుంకుమ ఇతర క్షుద్రపూజకు వినియోగించే ద్రవ్యాలు ఉంచారు. కోడిగుడ్లకు రంగులు వేసి అక్కడ వుంచి పూజలు నిర్వహించగా, ఎవరో మేల్కొని అటువైపు వస్తుండగా మధ్యలోనే వదలి వెళ్ళినట్లు సంఘటన స్థలాన్ని గమనిస్తే తెలుస్తోంది. 2007 సంవత్సరంలో అదే స్థలంలో ఇదే తరహా పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, తెల్లవారే వరకు దీనిని స్థానికులు గమనించకపోగా ఒక్కసారిగా అంతా తెలుసుకొని భయభ్రాంతులకు లోనయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ గిరిబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
విద్యుత్‌కోతతో మూతపడుతున్న పరిశ్రమలు :సోమిరెడ్డి
వెంకటగిరి, ఏప్రిల్ 4 : రాష్ట్రంలో అమలుపరుస్తున్న విద్యుత్ కోతలతో చిన్న చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు రద్దుచేయాలని, కోతలు ఎత్తివేయాలని టిడిపి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఏర్పాటుచేసిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజల్ని అన్ని విధాలుగా అవస్థలు పెట్టడమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు రద్దుచేయాలని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని, చార్జీలు తగ్గించే వరకు టిడిపి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో మొదటిగా మాజీ శాసససభ్యులు డాక్టర్ సాయికృష్ణయాచేంద్ర సంతకం చేశారు. అనంతరం పట్టణంలోని ప్రజల వద్ద సంతకాల సేకరణ ప్రారంభించారు. అనంతరం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆలయంలో రానున్న 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, గంగోట నాగేశ్వరరావు, పట్టణ నాయకులు బీరం రాజేశ్వరరావు, పులుకొల్లు రాజేశ్వరరావు, కెవికె ప్రసాద్‌నాయుడు, మురళీ, మేరిగ రామకృష్ణ, సుధాకర్, గొల్లగుంట ముని తదితరులు పాల్గొన్నారు.
రైతు అభివృద్ధే టిడిపి లక్ష్యం
ఇందుకూరుపేట: రైతుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసిందని, ఇప్పుడు కూడా పనిచేస్తుందని ఆపార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఇందుకూరుపేట బజార్ సెంటర్‌లో గురువారం జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా అధ్యక్షురాలు విజయమ్మ ఒక పక్క ఢిల్లీ వెళ్తూ కాంగ్రెస్ అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారని, ఆమె కుమార్తె షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, మరో పక్క జగన్మోహన్‌రెడ్డి వైకాపాను దీవించండి అంటూ ఎవరికి వారు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము పరిపాలించిన 9 సంవత్సరాలలో రైతులకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం కూడా రైతులకు విద్యుత్‌ను ఇవ్వటంలో విఫలమైందన్నారు. అదే కోవలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుండటం బాధారకమన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో ఆయనున్నంత వరకు విద్యుత్ కోత లేకుండా చేశారన్నారు. రైతులకు మాత్రం విద్యుత్ సమస్యను చూపుతున్నారన్నారు. ఆయనకొక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా అంటూ సోమిరెడ్డి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని జోస్యం చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీద రవిచంద్ర, మండల అధ్యక్షుడు వీరేంద్ర, జిల్లా కార్యదర్శి పిఎల్ రావు, టిడిపి నాయకులు డి కల్యాణ్‌రెడ్డి, రాంప్రసాద్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనతో
ఒరిగిందేమీలేదు:కాకాణి
మనుబోలు, ఏప్రిల్ 4: ఇందిరమ్మ బాటలో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మూడు రోజులు ముఖ్యమంత్రి పర్యటన వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని అక్కంపేట గ్రామంలో గురువారం ఆయన దీవెన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సియం పర్యటనతో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయి తప్ప, జిల్లాలో ముఖ్యమైన కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన సభలు వెలవెల పోయాయన్నారు. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ఎన్నికల్లోపు ఒక్కొక్కటి తుడిచి వేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని, రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు గుణపాఠం తప్పదన్నారు. ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారన్నారు. రాజశేఖరరెడ్డి హాయంలో కరెంటు ఫుల్, బిల్లు నిల్‌గా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వంలో బిల్లు ఫుల్, కరెంట్ నిల్‌గా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి వరప్రసాదరావు, అనిల్‌కుమార్ యాదవ్, మండల నాయకులు పాల్గొన్నారు.
70 కుటుంబాలు వైకాపాలో చేరిక
టిడిపికి చెందిన దండు రామసుబ్బారెడ్డి, నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో అక్కంపేట శ్రీరాంనగర్ కాలనీకి చెందిన 70 కుటుంబాలు గురువారం కాకాణి సమక్షంలో వైకాపాలో చేరారు. వైకాపాలో చేరిన వారందరికీ కాకాణి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనూహ్యంగా మీడియా విస్తరణ
ఇందుకూరు పేట, ఏప్రిల్ 4: సమాజంలో అనూహ్యంగా మీడియా విస్తరించిందని 20సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ తులసి రెడ్డి అన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ, ప్రెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్ కాలేజీలో గత రెండురోజులుగా జరుగుతున్న జిల్లా గ్రామీణ విలేఖరుల శిక్షణాతరగతుల ముగింపు సభ గురువారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తులసిరెడ్డి మాట్లాడుతూ సంఖ్యాపరంగా, సర్క్యులేషన్ పరంగా మీడియా విస్తరించిందన్నారు. ఇటువంటి సమయంలో మీడియాకు ప్రాణాధారమైన పాత్రికేయులు సామాజిక స్పృహ, సేవాభావంతో నిజాయితీగా విధులు నిర్వహించాలన్నారు. సమాజంలో అన్ని రంగాల్లో విశిష్టమైనది మీడియారంగమేనన్నారు. సమాజాభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న 20సూత్రాలను క్లుప్తంగా వివరించారు. అనంతరం శిక్షణ పొందిన పాత్రికేయులకు ప్రెస్ అకాడమీ తరఫున సర్ట్ఫికెట్లు అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమల గిరి సురేందర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తినైపుణ్యం పెంచుకోడానికి ప్రెస్ అకాడమీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈకార్యక్రమంలో విక్రమసింహపురి రిజిస్ట్రార్ నాగేంద్రప్రసాద్, ప్రెస్ అకాడమీ సెక్రటరీ సన్యాసిరావు, విక్రమసింహపురి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండోరోజు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ వల్లీశ్వర్, రజ్వీమీడియా డైరక్టర్ ఫయాజ్,ప్రజాశక్తి సీనియర్ జర్నలిస్టు తులసీదాస్ జర్నలిస్టులకు అవసరమైన అంశాలను విశదీకరించారు.
వైఎస్‌ఆర్‌సి ఆధ్వర్యంలో
సబ్‌స్టేషన్ ముట్టడి
నెల్లూరు, ఏప్రిల్ 4: విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిటీ కోఆర్డినేటర్ సి అనిల్‌కుమార్ యాదవ్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వైఎస్ కరెంటు చార్జీలు పెంచకుండా పాలించారన్నారు. ఆయన తనయుడు అధికారంలోకి వస్తే ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తారన్నారు. వైఎస్ పథకాలన్నీ కిరణ్ సర్కాలు తూట్లుపొడుస్తోందన్నారు. ఈకార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్లు, ముప్పసాని శ్రీనివాసులు, సంక్రాంతి కల్యాణ్, వెంకారెడ్డి, పోలం వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీభాను, రంగారావు, సుభాషిణీ లలితమ్మ, మస్తాన్, సత్యానంద్ రఘువేలూరు తదితరులు పాల్గొన్నారు.
భావితరాల వారికి యువత ఆదర్శం కావాలి
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 4: యువత సమసమాజా వికాసానికి, సమాజంలో నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగస్వాములై భావితరాల వారికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక కస్తూర్భాకళాక్షేత్రం ఆడిటోరియంలో రాజీవ్ యువకిరణాల యువతతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతర ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మానవ జీవితంలో యవ్వనం దశలోనే యువతి యువకులు కష్టపడి స్వయంశక్తితో ఉపాధి అవకాశాల కల్పనవైపు దృష్టి సారించాలన్నారు. సమాజంలో యువతీ యువకులు అణుశక్తి లాంటి వారని, అటువంటి యువత అణుబాంబులు తయారు చేసే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారన్నారు. అటువంటి మేధాశక్తి గల యువత కేవలం ప్రభుత్వం ఉద్యోగాలకు పాకులాడకుండా ప్రవేటు రంగంలో స్వయం ఉపాధి రంగాలలో తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యతలతో అనూహ్యమైన ప్రగతి సాధించవచ్చున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ లోపు చదువు మానేసిన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వినూత్నరీతిలో రాజీవ్ యువకిరణాలు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా యువతీ యువకులకు వారి నైపుణ్యతను బట్టి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అందుకనుగుణంగా ప్రవేటు రంగాలలో, ఇతర రంగాలలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు 1800కోట్ల బడ్జెట్‌లో పెట్టి దాదాపు 15లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగానిర్దేశించిందన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి సాధించలేరని, ప్రైవేటు రంగంలో వారి వారి నైపుణ్యతను బట్టి మేధస్సు కనుగుణంగా అనూహ్యమైన పురోగతి సాధించవచ్చున్నారు. స్వయం శక్తితో ఉపాధి పొంది అభివృద్ధి చెందడమే కాకుండా తమతోపాటు 10మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. స్వయం కృషితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బిల్‌గేట్స్, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత, క్రేన్ వక్కపొడి అధినేతలు పారిశ్రామిక వేత్తలుగా ఎలా ఎదిగారో గుర్తు చేసుకోవాలన్నారు. తొలుత 20 సూత్రాల పథకం ప్రగతి పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కైవిసితో 2.4 కోట్ల గ్యాస్ కనెక్షన్ల తొలగింపు
నెల్లూరు, ఏప్రిల్ 4: కెవైసి (నో యువర్ కస్టమర్ ) కార్యక్రమంతో దేశవ్యాప్తంగా 2.4 కోట్ల అక్రమ గ్యాస్ కనెక్షన్లను గుర్తించి రద్దు చేశామని కేంద్ర చేనేత జౌళి, పెట్రోలియం,సహజనవరుల శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. దీని వల్ల సబ్సిడీకి వినియోగించే గ్యాస్ సిలిండర్ల సంఖ్య తగ్గిందని వివరించారు. ఇదే సందర్భంలో వాణిజ్యపరమైన సిలిండర్ల సంఖ్య పెరిగిందన్నారు. గురువారం నెల్లూరులోని హరితా టూరిజం హోటల్‌లో నెల్లూరుజిల్లాలోని పెట్రో కంపెనీల అమ్మకపుప్రతినిధులు, పౌరసరఫరాల అధికార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, కిరోసిన్, తదితరాలపై 1.64లక్షల కోట్ల రూపాయల భారం సబ్సిడీ రూపేణా భరిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ సబ్సిడీ మొత్తం 1.61లక్షల కోట్ల రూపాయలుగా ఉందని వివరించారు. కాగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్‌లపై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వల్ల ప్రజలపై భారం మరింత అధికమవుతుందనే అభిప్రాయపడ్డారు. పర్యావరణం కాపాడేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ వినియోగం విస్తృతమయ్యేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాజీవ్‌గాంధీ ఎల్‌పిజి విత్రక్ యోజన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ డీలర్‌షిప్‌ల సంఖ్య పెంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు బాటలు వేసేలా డీలర్‌షిప్‌లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కాగా గ్యాస్ కనెక్షన్ల కేటాయింపులో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నా ఇంకా పది లక్షల దరఖాస్తులు వెయిటింగ్ లిస్టు ఉంటుందన్నారు. ఇదిలాఉంటే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా తొమ్మిది వరకు అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12,150 గ్యాస్ డీలర్‌షిప్‌లు ఉన్నాయన్నారు. అందులో రెగ్యులర్ 10,461 వరకు ఉండగా, రాజవ్‌గాంధీ ఎల్‌పిజి విత్రక్ యోజన కింద మరో 1489 వరకు ఉన్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో గ్యాస్ సరఫరాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం తధ్యమన్నారు. ఆధార్ కార్డు నమోదు కేంద్రాల్లోనే బ్యాంక్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి అకౌంట్లు లేనివారికి నూతనంగా ఖాతా ప్రారంభించేలా సూచించామన్నారు. తద్వారా ‘మీ డబ్బు మీ చేతికి’ కార్యక్రమాన్ని అమలు చేయడంలో సమగ్ర రూపానికి కృషి చేస్తామన్నారు. తాను ప్రాతినిధ్యం వహించే లోక్‌సభస్థానం బాపట్ల వద్ద చేనేతజౌళి శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ ప్రాజెక్ట్ నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చేనేత కార్మికులకు నైపుణ్యం పెరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఉత్తరభారత దేశంలో ఉన్న పెట్రో యూనివర్శిటీ దక్షిణాదిలో కూడా ఏర్పాటయ్యేందుకు ప్రయత్నిస్తామన్నారు.